'ది లెజెండ్' (The Legend Movie) సినిమా కోసం తమిళ ప్రేక్షకుల్లో కొంత మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శరవణ స్టోర్స్ ప్రకటనల ద్వారా తమిళ ప్రజలకు సుపరిచితుడైన ఆ స్టోర్స్ అధినేత అరుల్ శరవణన్ నటించిన చిత్రమిది. పూజా హెగ్డే, తమన్నా నుంచి మొదలుపెడితే హన్సిక, లక్ష్మీ రాయ్, డింపుల్ హయతి, శ్రద్ధా శ్రీనాథ్, యాషికా ఆనంద్... మొత్తం పదిమంది హీరోయిన్లను తీసుకొచ్చి అందరి దృష్టిని ఆకర్షించినది ఇతడే.


జూలై 28న 'ది లెజెండ్' విడుదల అవుతోంది. తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రోజున సినిమా విడుదల చేయనున్నట్లు ఈ రోజు ప్రకటించారు. తమిళ, తెలుగు భాషల్లో మాత్రమే కాదు... కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్టు తెలిపారు.
 
'ది లెజెండ్' సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. హీరో శరవణన్‌తో కలిసి తెలుగు టైటిల్ పోస్టర్ విడుదల చేశారాయన.  శ్రీ లక్ష్మీ మూవీస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలోని థియేటర్లలో విడుదల చేయనున్నారు. త్వరలో పాటలు, ప్రచార చిత్రాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై 'లెజెండ్‌' శరవణన్‌ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు జెడి - జెర్రీ దర్శకత్వం వహించారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఒక సామాన్యుడు తన శ్రమ, సమర్ధత, బలంతో తనకు ఎదురైన అడ్డంకులను అధిగమించి 'లెజెండ్‌'గా ఎలా నిలిచాడనేది సినిమా కథాంశం. ఇందులో మైక్రో బయాలజీ శాస్త్రవేత్తగా శరవణన్ కనిపించనున్నారు.


Also Read : కమల్ హాసన్‌కు, నాగార్జునకు పోలిక ఏంటి?


'ది లెజెండ్' సినిమాలో బాలీవుడ్ ఊర్వశి రౌతేలా కథానాయిక. ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్‌ చివరి చిత్రమిది. దీనికి హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. 


Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు