HBD Koratala Siva:సక్సెస్‌, స్టార్‌డమ్‌ అనేది రాత్రికిరాత్రే రాదు. ఆ స్థాయికి చేరుకోవాలంటే ఎంతో కష్టపడాలి. ఇక సినీ ఇండస్ట్రీలో అయితే ఎన్నో కష్టాలు, అవమానాలు తర్వాతే అంతటి సక్సెస్‌ చూస్తారు. తొలి సినిమాకే గుర్తింపు రావడం అనేది చాలా అరుదు. అయినా లక్‌ కూడా కలిసి రావాలి. కానీ ఇది ఈ స్టార్‌ డైరెక్టర్‌ విషయంలో వర్తించదనిపిస్తుంది. ఎందుకంటే చేసింది ఐదు సినిమాలే. కానీ, ఇండస్ట్రీలో ఆయన ఓ అగ్ర డైరెక్టర్‌. అదీ కూడా రైటర్‌గా వచ్చి డైరెక్టర్‌గా మారారు. తొలి ప్రయత్నంలోనే భారీ విజయం సాధించి.. ఏకంగా నంది అవార్డు కైవసం చేసుకున్నారు. ఆయనే దర్శకుడు కొరటాల శివ. ఇప్పటి వరకు ఆయన ఐదు సినిమాలే.. తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో ఆయన పేరు మారుమోగింది. సినిమా సినిమాకు భారీ విజయం అందుకుంటూ టాలీవుడ్‌లో అగ్ర డైరెక్టర్ల జాబితాలో చేరిన ఈ స్టార్‌ డైరెక్టర్‌ బర్త్‌ డే నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమా జర్నీ,వ్యక్తిగత జీవితంపై ఓ లుక్కేయండి!


కమర్షియల్ అంశాలకు సోషల్ మెసేజ్..


టాలీవుడ్‌ దర్శకుల్లో కొరటాల శివకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. స్క్రిప్ట్‌ విషయంలో ఆయన పాయింట్‌ ఆఫ్‌ వ్యూ కొత్తగా ఉంటుంది. సోషల్‌ మెసేజ్‌ కథకు కమర్షియల్‌ హంగులు జోడించి సక్సెస్‌ పొందిన డైరెక్టర్‌. తెరపై హీరో పాత్రని సాఫ్ట్‌గా చూపిస్తూనే వయలెన్స్‌తో పవర్ఫుల్‌గా‌ చూపించి హీరోయిజానికే కొత్త నిర్వచనం ఇచ్చారు. ఫ్యాక్షన్‌ని కూడా క్లాస్‌ చూపించిన ఒకే ఒక్క డ డైరెక్టర్‌ ఈయన. అందుకే కొరటాల సినిమాలు ఆడియన్స్‌ని ఎదురుచూసేలా చేస్తాయి. అలా ఇండస్ట్రీలో‌ వందశాతం సక్సెస్‌ రేట్‌ ఉన్న డైరెక్టర్‌గా కొరటాల ప్రశంసలు అందుకుంటున్న ఆయన సినీ ప్రస్థానం ఎలా మొదలైందో చూద్దాం.  


సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి..


కొరటాల సొంతూరు ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా పెదకాకాని. 1975 జూన్ 15న కమ్యూనిస్టు భావజాలాలు ఉన్న సోషల్ యాక్టివిస్టుల కుటుంబంలో జన్మించారు. ఆయన ఇంట్లో అందరూ విద్యావంతులు, కమ్యూనిస్టు ఐడియాలజీ ఉండటంతో ఆయన ఇంటి నిండా పుస్తకాలుండేవట. చిన్నప్పటి నుంచి అవి చదువుతూనే పెరిగానంటూ కొరటాల చాలా సందర్భాల్లో చెప్పారు. కవిత్వంపై ఆసక్తి ఉండటంతో అప్పుడప్పుడూ సరదాగా కవితలు, కథలు రాస్తుండేవారట. ఇక బీటెక్ చదివిన కొరటాల మొదట సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇండస్ట్రీకి వచ్చేందుకు తన దగ్గరి బంధువైన పోసాని కృష్ణ మురళి ఆయనకు హెల్ప్‌ అయ్యారు. కొరటల మేనత్త కొడుకు పోసాని కృష్ణ మురళి. 


ప్రతి సినిమాలో ప్రత్యేకత


దీంతో మొదట పోసాని దగ్గర అసిస్టెంట్‌గా చేరిన కొరటాల కొంతకాలానికి ఉద్యోగం వదిలేసి డైలాగ్ రైటర్‌గా ఇండస్ట్రీలో కెరీర్‌ ప్రారంభించారు. అలా ఒక్కడున్నాడు, మున్నా, భద్ర,, బృందావనం, ఊసరవెల్లి సినిమాలకు మాటలు రాశారు. ఆ తర్వాత ప్రభాస్‌ 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా మారారు. 2013లో మిర్చి సినిమాను డైరెక్ట్‌ చేసి  తొలి ప్రయత్నంలోనే సూపర్‌ హిట్‌ కొట్టారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్‌ కొట్టి ఒవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయారు. ఇందులో ప్రభాస్‌తో చెప్పించిన డైలాగ్స్‌, లుక్‌కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. ప్రభాస్‌ని కూల్‌గా చూపిస్తూనే.. కీలక సన్నివేశాల్లో వయోలెన్స్‌ చేయించి హీరో పాత్రని పవర్ఫుల్‌గా తీర్చిదిద్దారు. ఇక కొరటాల మేకింగ్‌ స్టైల్‌, డైలాగ్‌ రైటింగ్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. దీంతో ఆయనతో సినిమా చేసేందుకు స్టార్‌ హీరోలంతా ఆసక్తి చూపించారు. మిర్చి తర్వాత మహేష్‌తో 'శ్రీమంతుడు' చేసి మరోసారి తన పనితనాన్ని నిరూపించుకున్నారు. ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్‌. 


ఆ వెంటనే జూనియర్‌ ఎన్టీఆర్‌తో 'జనతా గ్యారేజ్‌' తీసి మరో సూపర్‌ డూపర్‌ హిట్‌ను ఇండస్ట్రీకి అందించారు. ఇక హ్యాట్రిక్‌ హిట్‌ డైరెక్టర్‌గా ఫుల్‌ క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో మహేష్‌ మరోసారి కొరటాలతో జతకట్టాడు. భరత్‌ అనే నేను అంటూ మహేష్‌ను 'మునుపెన్నడు' చూపించని విధంగా కొత్తగా చూపించి మరో సూపర్ హిట్‌ కొట్టారు. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌ చరణ్‌తో ఆచార్య తెరకెక్కించారు. ఈ సినిమా కమర్షియల్‌ విజయం సాధించకపోయినా.. ఎమోషనల్‌గా ఆకట్టుకుంది.  కొరటాల సినిమా అంటేనే అందులో ఏదోక మెసేజ్‌ ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలను అబ్జర్వ్‌ చేస్తే అందులో ఓ మెసేజ్‌ కనిపిస్తుంది. "పగ తీర్చుకోవడం మగతనం కాదు.. పగోడిని సైతం ప్రేమించడమే అసలైన మగతనం" అంటూ మిర్చిలో ఫ్యాక్షన్‌ ఫ్యామిలీతో చెప్పించి కొత్తగా చూపించారు. దేశం బాగుండాలంటే పల్లెల్లో అభివృద్ధి జరిగాలని శ్రీమంతుడిలో ద్వారా వివరించారు. 


హ్యాపీ బర్త్‌డే కొరటాల..


"ఊరు మనకెంతో ఇచ్చింది. కొంతైనా తిరిగిచ్చేయాలి" అంటూ డైలాగ్‌ చెప్పించి అందరిని ఆలోచింపజేశారు. తప్పుదారి నడిచేవాడు సొంతవాడైన శిక్ష పడాల్సిందేనంటూ "జనతా గ్యారేజ్‌"లో చాటిచెప్పారు. నాయకుడు సరిగ్గా పనిచేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారంటూ "భరత్ అనే నేను"తో నిరూపించారు. పాపాలు చేస్తే గుణపాఠం చెప్పడానికి దేవుడే రానక్కర్లేదన "ఆచార్య"తో సందేశం ఇచ్చారు. ఇలా తన సినిమాల్లో ఏదోక మెసేజ్‌ ఇస్తూ ప్రజలను ఆలోచింపజేస్తున్న ఆయన వ్యక్తిగతంగానే చాలా మంచివారని, సాయం చేయడంతో ముందుంటారని ఇండస్ట్రీవర్గాలు చెబుతుంటారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్‌తో 'దేవర' మూవీ చేస్తున్న కొరటాల ఈ చిత్రంతో ఎలాంటి మెసేజ్‌ ఇవ్వబోతున్నారో చూడాలి. ఇక మొత్తానికి సెన్సిబుల్‌ సబ్జెక్ట్‌కి.. స్టైలిష్‌ మేకింగ్‌ జోడించి సినిమాను అత్యద్బుతంగా ప్రేక్షకులు ముందు ఉంచే కొరటాల భవిష్యత్తులో మరెన్నో మంచి సినిమాలు అందించాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్‌డే కొరటాల శివ.