Ram Gopal Varma Logic On Konda Surekha Comments: అక్కినేని నాగచైతన్య, సమంత (Samantha) విడాకుల వ్యవహారం పై తాను చేసిన వ్యాఖ్యలకు గాను తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు కోరారు. అయితే... సమంతకు కొండా సురేఖ సారీ చెప్పడం అంతా స్టుపిడిటీ మరొకటి లేదని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక ఆడియో నోట్ విడుదల చేశారు. సారీ చెప్పాల్సింది సమంతకు కాదని... నాగ చైతన్య, నాగార్జునకు అని ఆయన పేర్కొన్నారు. ఇంతకీ వర్మ చెబుతున్న లాజిక్ అండ్ వ్యాలిడ్ పాయింట్ ఏమిటంటే?


అసలు సమంతను ఎక్కడ అవమానించారు?
సమంతకు కొండ సురేఖ సారీ చెప్పడం అంత మూర్ఖత్వం తాను ఎక్కడా చూడలేదని రామ్ గోపాల్ వర్మ అన్నారు.‌ అసలు, ఆవిడ సమంతను ఎక్కడ అవమానించారు? అని ప్రశ్నించారు. 


సమంతను కొండా సురేఖ అవమానించ లేదని, ఇంకా చెప్పాలి అంటే... ఒక విధంగా సమంతను పొగిడారని వర్మ వివరించారు. ''కొండా సురేఖ ఏమని చెప్పారు, ఆవిడ ఏమన్నారు? అనేది చూస్తే... ఒక భర్తగా నాగ చైతన్య, ఒక మామగా నాగార్జున తమ ఆస్తి కాపాడుకోవడం కోసం సమంతను ఒకరి దగ్గరికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే... నో అని చెప్పి సమంత విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. అక్కడ అవమానం ఏం ఉంది? సమంతను పోగిడినట్టు కదా!'' అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. 


ఇంత కంటే జుగుప్సాకరమైన అవమానం లేదు!
అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్యలను కొండా సురేఖ అత్యంత జుగుప్సాకరంగా అవమానించారని రామ్ గోపాల్ వర్మ వివరించారు. ''నాగార్జున, నాగ చైతన్యకు జరిగిన అవమానం గురించి కొండా సురేఖ ఇంత వరకు మాట్లాడలేదు. ఆ టాపిక్ ఎత్తడం లేదు'' అని ఆయన అసలు పాయింట్ బయటకు తీశారు.



''అక్కినేని కుటుంబానికి ఉన్న హుందాతనం, వాళ్లకు ఉన్న గౌరవం పక్కన పెడితే...  ఏ ఇంట్లో అయినా సరే ఒక మామ, ఒక భర్త మీద ఇటువంటి అవమానం జరగడం నేను వినలేదు. దీనిని చాలా సీరియస్ గా తీసుకోవాలి. నాగార్జున, నాగ చైతన్యలకు నా రిక్వెస్ట్ ఏమిటంటే... మళ్ళీ ఇటువంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజల అందరి కోసం కూడా మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. ఇది తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇటువంటిది మళ్ళీ జరగకుండా చూడాలి'' అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.


Also Readఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?



రామ్ గోపాల్ వర్మతో పలువురు ప్రజలు ఏకీభవిస్తున్నారు. సమంతకు సారీ చెప్పిన కొండా సురేఖ... నాగార్జున, నాగ చైతన్య పేర్లు మాట వరుసకు అయినా ఎత్తడం లేదని గుర్తు చేసుకున్నారు. అక్కినేని కుటుంబానికి కూడా ఆవిడ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సమంతకు సారీ చెప్పిన కొండా సురేఖ... అక్కినేని అమల, అఖిల్, నాగార్జున చేసిన ట్వీట్ల మీద స్పందించలేదు. ఎన్ కన్వెషన్ కూల్చివేత తర్వాత అక్కినేని కుటుంబానికి, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరం ఏర్పడిందని సామాన్య ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దూరం వల్లే అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేశారా? అనేది చూడాలి.


Also Readఅటెన్షన్ కోసం ఇండస్ట్రీని టార్గెట్ చేయడం సిగ్గుచేటు - కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరంజీవి ట్వీట్!