ప్రజల దృష్టిలో పడడం కోసం తాత్కాలిక గుర్తింపు కోసం సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులను సాఫ్ట్ టార్గెట్ చేయడం సిగ్గుచేటు అని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన ఆటవిక వ్యాఖ్యలపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. హీరో హీరోయిన్లు అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం మీద ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల చిరు తన స్పందనను సూటిగా స్పష్టంగా తెలియజేశారు.
మహిళా మంత్రి వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి!
సామాజిక మాధ్యమాలలో తన స్పందన తెలియజేసిన చిరంజీవి మాట వరసకు కూడా కొండా సురేఖ పేరు ఎత్తలేదు. గౌరవప్రదమైన మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయి అని ఆయన తెలిపారు. తమ చిత్ర పరిశ్రమలోని సభ్యుల పట్ల ఈ విధమైన మాటల దాడిని ఇండస్ట్రీ అంతా ఏకమై వ్యతిరేకిస్తుందని ఆయన వివరించారు.
కొండా సురేఖ స్థాయికి ఎవరు దిగజారకూడదు...
ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను మరి ముఖ్యంగా మహిళలను తమ రాజకీయ పాటలోకి లాగడం, ప్రజలు అంతా అసహ్యించుకునే విధంగా కల్పితమైన ఆరోపణలు చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందే స్థాయికి ఎవరు దిగజారకూడదని చిరంజీవి హితువు పలికారు. ఒక విధంగా కొండా సురేఖ తన స్థాయిని దిగజార్చుకున్నారని ఆయన పరోక్షంగా చెప్పినట్లు అయింది.
రాజకీయ నాయకులు మంచి ఉదాహరణగా ఉండాలి తప్ప!
సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకు వెళ్లడానికి ప్రజలు అందరూ చాలా మంచిగా జీవించడానికి మనం నాయకులను ఎన్నుకుంటాం అని, అటువంటి నాయకులు తమ మాటల ద్వారా సమాజాన్ని కలుషితం చేయకూడదని చిరంజీవి పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాలలో ఉన్న వ్యక్తులు ఇతరులకు మంచి ఉదాహరణగా ఉండాలని ఆయన సూచించారు. హేయమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు తమ మాటలను ఉపసంహరించుకుంటారని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: ఆడపిల్లలు అంటే ఎందుకు అంత చులకన... తెలంగాణ రాజకీయాలకు సమంత, రకుల్ బలి కావాలా?
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్టీఆర్ నాని సుధీర్ బాబు వంటి యువ హీరోలతో పాటు అక్కినేని కుటుంబం అంతా కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. లక్ష్మీ మంచుతో పాటు సీనియర్ హీరోయిన్లు కుష్బూ, రోజా తదితరులు సైతం అక్కినేని కుటుంబానికి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.