'టైగర్ నాగేశ్వర రావు' (Tiger Nageswara Rao Movie)... మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా! విజయ దశమి కానుకగా ఈ నెల 20వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ట్రైలర్ కూడా ముంబైలో విడుదల చేశారు. ప్రస్తుతం సినిమాపై మంచి బజ్ ఉంది. 


'టైగర్ నాగేశ్వర రావు'ను నిజ జీవిత కథ ఆధారంగా తీసిన సంగతి ప్రేక్షకుల్లో చాలా మందికి తెలుసు. ప్రభుత్వాలను, పోలీసులను గజగజలాడించిన స్టూవర్టుపురం వ్యక్తి, పేరు మోసిన గజదొంగ నాగేశ్వర రావు గురించి విన్న, తెలుసుకున్న, రీసెర్చ్ చేసిన అంశాలతో దర్శకుడు వంశీ తెరకెక్కించారు. మరి, ఇప్పుడు ఆ స్టూవర్టుపురం నాగేశ్వర రావు ఫ్యామిలీ ఎలా ఉంది? ఆయనకు ఎంత మంది పిల్లలు? ఇప్పుడు వాళ్ళ ఫైనాన్సియల్ స్టేటస్ ఎలా ఉంది? వంటి ప్రశ్నలకు తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు వంశీ తెలిపారు. 


దోచిన డబ్బులు ఫ్యామిలీకి ఇవ్వలేదు!
నాగేశ్వర రావుకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అబ్బాయి ఉద్యోగం చేస్తున్నారు. పిల్లలు, ఫ్యామిలీతో స్టూవర్టుపురంలో సెటిల్ అయ్యారు. అమ్మాయి ఆరోగ్య పరిస్థితి గతంలో బాలేదని, ఇప్పుడు బావుందని వంశీ తెలిపారు. నాగేశ్వర రావుకు ఓ సోదరుడు ఉన్నారు. ఇప్పుడు ఆయన వయసు 70 నుంచి 80 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. ఆయన కూడా సొంతూరులోనే ఉంటున్నారు.   


కరోనా కాలంలో నాగేశ్వర రావు సతీమణి మరణించారని వంశీ తెలిపారు. ఆవిడ మరణించడానికి ముందు కలిశానని, ఆవిడ మాటల్లో భర్త గురించి పలు విషయాలు తెలుసుకున్నానని ఆయన వివరించారు. వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏవరేజ్ అని చెప్పారు. తాము ఈ సినిమా తీయాలని అనుకున్నప్పుడు కొంత డబ్బు వాళ్లకు ఇవ్వాలని అనుకుని అందించామని వంశీ పేర్కొన్నారు. 


Also Read నెక్ట్స్ మూవీ టార్గెట్ రూ. 3 వేల కోట్లు- అట్లీ సంచలన స్టేట్మెంట్, ఆటాడుకుంటున్న నెటిజన్లు


తన భర్త నాగేశ్వర రావు దొంగతనాలు చేసినా, ఏం చేసినా కుటుంబాన్ని సాధారణంగా చూసుకున్నారని... దోచిన డబ్బును తమకు ఇవ్వలేదని నాగేశ్వర రావు సతీమణి తమతో చెప్పారని వంశీ వివరించారు. పల్లెటూరిలో సాధారణ జీవితం గడుపుతున్నారని ఆయన తెలిపారు. 


సినిమా ప్రారంభంలో కాంట్రవర్సీ గురించీ...
తొలుత నాగేశ్వర రావు కథతో బెల్లకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బెల్లకొండ సురేష్ నిర్మాణంలో సినిమా చేయాలని వంశీ ప్రయత్నించారు. కథ వాళ్లకు చెప్పారు. ఆ తర్వాత రవితేజతో సినిమా అనౌన్స్ చేశారు. తర్వాత బెల్లకొండ సురేష్ కూడా ఈ కథతో సినిమా అనౌన్స్ చేశారు. ఆ కాంట్రవర్సీ గురించి మాట్లాడుతూ ''ఆ సినిమా అనౌన్స్ చేశాక... సురేష్ గారిని నేను కలిశా. సినిమా చేయడం లేదని నాతో చెప్పారు. నేను సాయి శ్రీనివాస్ హీరోగా అనుకున్నప్పుడు ఆయనకు మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. లేట్ అవుతుందని వేరే హీరోతో సినిమా చేస్తానని వాళ్ళతో చెప్పి బయటకు వచ్చా'' అని వంశీ చెప్పారు. 


Also Read రజనీకాంత్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్డేట్ - ఐమ్యాక్స్ కెమెరాలో...



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial