KGF Star Yash Released Letter For Fans: అభిమానానికి అర్థం మార్చేసి.. తనది గోల్డెన్ హార్ట్ అని నిరూపించుకున్నాడు రాకింగ్ స్టార్ యష్. ‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఈ స్టార్ హీరో.. తన అభిమానుల క్షేమాన్ని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. ప్రతి హీరోకు అభిమానులు ఉంటారు.. ఇంకా డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఆ అభిమానులను ఉద్దేశిస్తూ.. మీరే మా ప్రాణం, మీరే మా దైవం అనేలా సందర్భం వచ్చిన ప్రతిసారి హీరోలు కూడా వారి అభిమానులపై ప్రేమ చూపిస్తుంటారు. అలాంటి అభిమానులకు ఏమైనా అయితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. అందుకే తన అభిమానుల విషయంలో జరిగిన దురదృష్టకరమైన సంఘటనలను తెలియజేస్తూ.. మళ్లీ అటువంటివి రిపీట్ కాకుండా.. అభిమానులకు యష్ ఈ లెటర్‌లో ముందస్తు జాగ్రత్తలు తెలిపారు. ఇంతకీ యష్ చెప్పిన దురదృష్టకరమైన సంఘటనలను ఏమిటంటే..
2024 సంవత్సరం ప్రారంభంలో యష్ పుట్టినరోజు (జనవరి 8)ను పురస్కరించుకుని ముగ్గురు అభిమానులు కర్ణాటకలో గదగ్ జిల్లాలో భారీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. ఆ విషయం తెలిసి యష్ ఎంతో తల్లడిల్లిపోయారు. ఆ వెంటనే ప్రమాదంలో చనిపోయిన అభిమానుల కుటుంబాలను ప్రత్యేకంగా వెళ్లి కలిసిన యష్.. వారికి నివాళులు అర్పించి, ఆ కుటుంబాలకు మద్దతుగా ఉంటామని చెప్పారు. అప్పటి నుంచి తన పుట్టినరోజున కానీ, తన సినిమా విడుదల సమయంలో కానీ.. తన కోసం బ్యానర్స్‌ను కట్టటం, ప్రమాదకరమైన బైక్ చేజింగ్‌లలో పాల్గొనటం, నిర్లక్ష్యపు సెల్ఫీలు తీసుకోవటం వంటివి మానుకోవాలని యష్ అభిమానులకు పిలుపునిచ్చారు.
Also Read: 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
2019లో జరిగిన మరో సంఘటన కూడా యష్‌ని ఎంతగానో కదిలించేసింది. యష్ పుట్టినరోజు సందర్భంగా ఓ అభిమాని ఆయనని కలవాలని ప్రయత్నించి, కలవలేకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ సందర్భంలో యష్ ఎంతగానో బాధపడ్డారు. వెంటనే ఇలాంటి చర్యలు సరైనవి కావని, ఇలాంటి పనులు చేయడమనేది నిజమైన అభిమానాన్ని చూపినట్లు కాదని అభిమానులకు విజ్ఞప్తి కూడా చేశారు. ఇప్పుడు తన బర్త్‌డే వస్తుండటంతో.. ఈసారి ముందస్తుగానే తన అభిమానులను ఆయన హెచ్చరించాడు. అంతేకాదు.. అభిమానం, ప్రేమలను వ్యక్తపరిచే విధానాన్ని మార్చే సమయమిదని చెబుతూ.. నిజమైన అభిమానం, ప్రేమలను ఎలా వ్యక్తపరచాలో ఆయన విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
తన అభిమానులకు హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఇచ్చిన యష్ ఈ లేఖలో.. ఈ ఏడాది ముగుస్తున్నందున ఇయర్ ఎండింగ్ వేడుకలు నిర్వహించుకునే వారు, అలాగే నా పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునే అభిమానులు అందరూ ఆరోగ్యం, భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వేడుకలలో పాల్గొనటం కంటే నా అభిమానులు వారి గొప్ప లక్ష్యాలను చేరుకుంటున్నారని తెలిస్తే.. ఎంతో సంతోషిస్తాను. మీరు నా నిజమైన అభిమానులు అయితే బ్యానర్లు కట్టడం, గుంపులు గుంపులుగా బైక్‌లతో ర్యాలీలు చేయడం ఆపి.. మీ పనిని మీరు శ్రద్ధగా చేయండి, మీ లైఫ్ మీదే, సంతోషంగా ఉండండి, సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్లండి. ఇదే నాకు మీరిచ్చే గొప్ప బహుమతి. ఈ బర్త్‌డేకి నేను టౌన్‌లో ఉండటం లేదు.. షూటింగ్‌లో బిజీగా ఉంటాను. అయినప్పటికీ మీరు పంపించే శుభాకాంక్షలు నన్ను చేరుకుంటాయి. అవి నాకు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చి, నాలో స్ఫూర్తి నింపుతాయి. అందరూ క్షేమంగా ఉండండి.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. అని యష్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యష్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్’ అనే సినిమాలో నటిస్తున్నారు. గీతు మోహన్‌దాస్ ఈ చిత్రానికి దర్శకుడు.
Also Read: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్... ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?