Keya Nair About Amitabh Bachchan And Deepika Padukone: నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 AD’లో చాలామంది నటీనటులు ఉన్నారు. ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్‌తో పాటు ఈ సినిమాలో మరెందరో యాక్టర్స్ కీలక పాత్రల్లో కనిపించారు. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ కేయా నాయర్ కూడా ఒకరు. ఇందులో ‘రయా’ అనే పాత్రలో నటించిన కేయా నాయర్‌కు కథపరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. తను వెండితెరపై కనిపించడం ఇదే మొదటిసారి అయినా అంత ప్రాముఖ్యత ఉన్న పాత్రను సింపుల్‌గా చేసేసింది కేయా. తాజాగా తను పాల్గొన్న ఇంటర్వ్యూలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్‌తో నటించిన అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంది.


మ్యాజిక్ చేశాం..


‘‘ఇది నా మొదటి సినిమా. నేను ఇంతకు ముందు అసలు యాక్టింగే చేయలేదు. నాగ్ అశ్విన్ వచ్చి నా మొదటి సీన్ ది గ్రేట్ అమితాబ్ బచ్చన్‌తో అని చెప్పగానే అసలు ఎలా చేస్తానా అనిపించింది. నేను యాక్ట్ చేయలేను, ఆశ్చర్యంతో నిలబడి ఉంటాను అనుకున్నాను. కానీ అమితాబ్ చాలా మంచివారు. ఆయన వెంటనే నేను సౌకర్యంగా ఫీల్ అయ్యేలా చేశారు. మేము మా ఐడియాస్‌ను పంచుకునేవాళ్లం. సీన్‌కు ముందే నా డైలాగులను ఆయనతో ప్రాక్టీస్ చేసేదాన్ని. అలా మేము స్క్రీన్‌పై మ్యాజిక్ చేయగలిగాం అనుకుంటాను’’ అంటూ అమితాబ్ బచ్చన్‌ను మొదటిసారి కలిసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంది కేయా. ఇక తనకు తెలుగు అసలు రాదు కాబట్టి మొదట్లో కష్టంగా అనిపించిందని, డైలాగులను పదేపదే ప్రాక్టీస్ చేశానని తెలిపింది.


నాకు డయాబెటీస్..


‘‘అమితాబ్ బచ్చన్ నాతో మాట్లాడడానికి ముందుకొచ్చేవారు. అందుకే నేను ఆయనతో ఈజీగా మాట్లాడేదాన్ని. ఆయన నా గురించి అన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. మేము కలిసి యాక్ట్ చేసిన ప్రతీసారి కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఆయనకు ఇప్పుడు వయసు అయిపోయింది. కానీ ఫైట్ సీన్స్ మాత్రం ఆయనే స్వయంగా చేశారు. అది చూసి నేను సర్‌ప్రైజ్ అయ్యాను. నేను టైప్ 1 డయాబెటీస్ అని ఆయనతో చెప్పాను. అది ఆయన ట్వీట్‌లో కూడా రాశారు. ఆయనతో మాట్లాడడం చాలా ఫన్‌గా అనిపించేది. ఆయన నాకు ఎప్పటినుండో తెలుసు అనే ఫీలింగ్ వచ్చింది. నాకు తాతయ్యలాగా అనిపించారు’’ అని చెప్పింది కేయా.


అలా పిలవద్దు..


దీపికా పదుకొనె గురించి చెప్తూ.. ‘‘తనతో మాట్లాడడం కూడా చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. తనకు నేను ఎప్పటినుండో పెద్ద ఫ్యాన్. కానీ మొదటిసారి తనతో మాట్లాడడానికి భయమేసింది. నాకు భయమేస్తుంది అని చెప్పగానే నోరుమూసుకో, ఎందుకు భయపడడం అంది. దీపికా అని పిలవద్దు డీపీ అని పిలువు అని చెప్పింది. తను అందరితో సరదాగా ఉండేది. తన టీమ్ అంతా తన గురించి చాలా జాగ్రత్తలు తీసుకునేది. కానీ తను మాత్రం పర్వాలేదు ఎవరైనా నాతో మాట్లాడొచ్చు అనేది. అలా తను అందరితో ఫ్రీగా ఉండేది’’ అని గుర్తుచేసుకుంది కేయా నాయర్. ఇక ‘కల్కి 2898 AD’లో కేయా నాయర్ చేసిన ‘రయా’ పాత్ర బ్లాక్‌బస్టర్ అయ్యింది.



Also Read: బాక్సాఫీస్ దగ్గర తగ్గిన ‘కల్కి 2898 ఏడీ’ జోరు, ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో తెలుసా?