'నాటు నాటు...' పాట నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకవేళ ఆ పాట విడుదల అయిన తరుణంలో గానీ, సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు గానీ 'మాకు నచ్చలేదు' అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు 'బాగుంది' అని చెప్పక తప్పని పరిస్థితి. ఆ పాటకు గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ (Naatu Naatu Won Oscar) అవార్డులు వరించడంతో ఒకప్పుడు విమర్శించినా వాళ్ళు సైతం ఇప్పుడు 'ఆహా ఓహో' అంటున్నారు.
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg)కు సైతం 'నాటు నాటు...' పాట నచ్చిందని రాజమౌళి తెలిపారు. అసలు, ఈ పాట నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? అంటే... రాజమౌళి, కీరవాణి ఫ్యామిలీలో పెద్ద ఉన్నారు. సంగీత దర్శకుడు తండ్రికి ఆ పాట నచ్చలేదు. 'అదొక పాటా?' అని కామెంట్ చేశారు.


అదొక పాటా? - శివశక్తి దత్తా
'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో 'రామం రాఘవం...' పాట ఉంది కదా! దానికి ఎంఎం కీరవాణి తండ్రి, రచయిత శివశక్తి దత్తా రాశారు. అయితే, అది సందర్భోచితంగా వచ్చే పాట. 'నాటు నాటు...' మాంచి మాస్ బీట్. డ్యాన్స్ నంబర్. దీనికి ఆస్కార్ వచ్చింది. 'మీకు నాటు నాటు సాంగ్ నచ్చిందా?' అని శివశక్తి దత్తాను ఓ ఇంటర్వ్యూలో అడగ్గా... ''అదొక పాటా? అందులో మ్యూజిక్ ఎక్కడ ఉంది నా ముఖం? ఇది ఒక విధి విలాసం. విధి విచిత్ర వైచిత్యం'' అని ఘాటు ఘాటు కామెంట్స్ చేశారు.


కీరవాణి కృషికి ఈ రూపంలో పురస్కారం వచ్చింది! 'నాటు నాటు...' సాంగ్ తనకు నచ్చలేదని పేర్కొన్న శివశక్తి దత్తా, తన కుమారుడు ఎంఎం కీరవాణి ఇన్నాళ్లుగా చేసిన కృషికి ఆ పురస్కారం రూపంలో ప్రతిఫలం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో చంద్రబోస్ రాసిన ఐదు వేల పాటల్లో అదొక పాటా? కీరవాణి సంగీతం అందించిన పాటల్లో అదొక పాటా?   అదొక సంగీతమా? అని శివశక్తి దత్తా ప్రశ్నించారు. 


కొరియోగ్రఫీ అద్భుతం...
ఆయనకు ప్రశంసలు దక్కాలి!
'నాటు నాటు...' పాటలో సంగీతం, సాహిత్యం కంటే కొరియోగ్రఫీ తనకు ఎక్కువ నచ్చిందని, అద్భుతమని శివశక్తి దత్తా తెలిపారు. నృత్య దర్శకుడికి ప్రశంసలు దక్కాలని పేర్కొన్నారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీకి అంత అద్భుతంగా స్టెప్పులు వేసిన హీరోలు ఇద్దర్నీ కూడా ఆయన అభినందించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ చేసిన డ్యాన్స్ నిజంగా అద్భుతమన్నారు. ఆ పాట వెనుక సూపర్ బ్రెయిన్ రాజమౌళి అన్నారు. ప్రేమ్ రక్షిత్, రాజమౌళికి ప్రశంసలు దక్కాలనేది శివశక్తి దత్తా చెప్పే మాట.


Also Read : రామ్ చరణ్‌కు అమిత్ షా సత్కారం - ఇండియన్ సినిమా లెజెండ్ చిరంజీవి అంటూ...


ఆస్కార్స్ వేడుక పూర్తి కావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్... 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం అంతా హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పుడు అందరూ తమ తమ తదుపరి సినిమాల మీద దృష్టి పెట్టనున్నారు. ఆస్కార్స్ నుంచి వచ్చిన తర్వాత విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్నారు. తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. బేగం పేట్ ఎయిర్ పోర్టులో అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. 


Also Read : మళ్ళీ ఆస్కార్ కొడతాం - స్టేజిపై ఇద్దరు తెలుగోళ్ళు కనిపించారు, కిక్ ఇచ్చే ఎన్టీఆర్ స్పీచ్