కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)ను మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు కలిశారు. ఈ ముగ్గురి కలయికకు ఢిల్లీ వేదిక అయ్యింది. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' (RRR Movie) సినిమాలోని 'నాటు నాటు...' పాట ఆస్కార్ అందుకున్న సందర్భంగా రామ్ చరణ్ (Ram Charan)ను అమిత్ షా సత్కరించారు.
చిరంజీవి, చరణ్ లెజెండ్స్! - అమిత్ షా
''భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు (లెజెండ్స్) చిరంజీవి, రామ్ చరణ్ లను కలవడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసింది. 'నాటు నాటు...' పాట ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోవడంతో పాటు 'ఆర్ఆర్ఆర్' సినిమా అద్భుతమైన విజయం సాధించినందుకు రామ్ చరణ్ ను అభినందించా'' అని అమిత్ షా ట్వీట్ చేశారు.
చిరు తనయుడిని అమిత్ షా శాలువాతో సత్కరించారు. ఆయనను చిరంజీవి శాలువా సత్కరించగా... రామ్ చరణ్ పుష్పగుచ్చం అందజేశారు.
ఈ విజయం 'ఆర్ఆర్ఆర్' టీం అందరిదీ! - చిరంజీవి
అమిత్ షాకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ''అమిత్ జీ... మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ విజయం RRR టీం అందరిదీ! ఈ గుర్తింపు మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమది! ఈ ఆస్కార్ భారత దేశ ప్రజలందరికీ లభించిన గౌరవం. భవిష్యత్తులో భారతీయ చిత్ర పరిశ్రమ చేసే కృషికి మీ మాటలు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి'' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
థాంక్యూ అమిత్ జీ - రామ్ చరణ్
''ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో గౌరవనీయులైన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా గారిని కలవడం ఆనందంగా ఉంది. 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం చేసిన కృషిని అభినందించినందుకు థాంక్యూ సార్'' అని రామ్ చరణ్ పేర్కొన్నారు.
శుక్రవారం ఢిల్లీలో మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur)ను సైతం చిరంజీవి, రామ్ చరణ్ కలిశారు. హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయానికి చిహ్నమైన టోపీ, శాలువాతో చిరంజీవిని అనురాగ్ ఠాకూర్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు చిరు థాంక్స్ చెప్పారు.
అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్, శుక్రవారం సాయంత్రం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులను కలిశారు. అక్కడ నుంచి ప్రయివేట్ విమానంలో ఫ్రైడే నైట్ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టులో అభిమానుల నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆ ప్రాంగణం అంతా కొంతసేపు రామ్ చరణ్ నినాదాలతో హోరెత్తిపోయింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో సైతం అభిమానులు రామ్ చరణ్‌ను చుట్టుముట్టారు.
Also Read : ఆస్కార్ గొడవ - ఎన్టీఆర్ ఫోటో మాత్రమే ఎందుకు, రామ్ చరణ్ ఎక్కడ? మెగా ఫ్యాన్స్ ఫైర్
ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. త్వరలో ఆ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో పది రోజుల పాటు ప్రభుదేవా కొరియోగ్రఫీలో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అడ్వాణీపై ఓ పాటను తెరకెక్కించనున్నారు.
Also Read : అమెరికా నుంచి ఢిల్లీకి రామ్ చరణ్, అభిమానుల ఘన స్వాగతం