Karan Johar Moves Bombay High Court: బాలీవుడ్ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ బాంబే హైకోర్టును ఆశ్ర‌యించాడు. త‌న అనుమ‌తి లేకుండా సినిమా టైటిల్ లో పేరు వాడార‌ని, దాన్నితొల‌గించాల‌ని ఆయ‌న పిటిష‌న్ వేశారు. 'షాదీకి డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ ఔర్ జోహార్' పేరుతో బాలీవుడ్ లో ఒక సినిమాని తెర‌కెక్కించారు. ఆ సినిమా జూన్ 14న రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో త‌న పేరును ఉప‌యోగించుకున్నార‌ని, సినిమాని నిలిపివేయాల‌ని తాను కోర‌డం లేద‌ని, కేవ‌లం త‌న పేరును తొల‌గించాల‌ని ఆయ‌న కోరారు. ఈ అంశంపై ఆయ‌న బుధ‌వారం పిటిష‌న్ వేయ‌గా స్వీక‌రించిన కోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నుంది. 


ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు బ‌బ్లూ సింగ్ 'షాదీకి డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ ఔర్ జోహార్' అనే టైటిల్ తో సినిమాని తెర‌కెక్కించారు. ఆ సినిమాని ఇండియాప్రైడ్ అడ్వైజరీ,  సంజయ్ సింగ్ నిర్మించారు. అయితే, సినిమా టైటిల్ లో క‌ర‌ణ్ పేరు ఉండ‌టంతో ఆయ‌న పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సినిమా టైటిల్ లో త‌న పేరును ఉప‌యోగించ‌కుండా శాశ్వ‌త నిషేధం విధించాల‌నే ఉత్తర్వులు జారీ చేయాల‌ని క‌ర‌ణ్ జోహార్ ఆ పిటిష‌న్ లో కోరారు. 


'నాకు అస‌లు సంబంధం లేదు..' 


జ‌స్టిస్ రియాజ్ చాగ్లా ఈ కేసుపై విచార‌ణ జ‌ర‌ప‌నున్నారు. కాగా.. 'షాదీకి డైరెక్ట‌ర్ క‌ర‌ణ్ ఔర్ జోహార్' సినిమాతో, ఆ సినిమా తీసిన వాళ్ల‌తో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని క‌ర‌ణ్ జోహార్ పిటిష‌న్ లో చెప్పారు. సినిమా ప్రొడ్యూస‌ర్లు కూడా ఎవ‌రో త‌న‌కు తెలీద‌ని, అన్యాయంగా, సీక్రెట్ గా, ప‌ర్మిష‌న్ లేకుండా త‌న పేరు వాడుకున్నార‌ని అన్నారు క‌ర‌ణ్‌. టైటిల్ లో త‌న పేరును డైరెక్ట‌ర్ట్ గా వాడార‌ని, అది త‌న ప‌ర్సనాలిటీ రైట్స్, ప్రైవ‌సీకి భంగం క‌లిగిస్తుంద‌ని చెప్పారు క‌ర‌ణ్ జోహార్. ఎలాంటి ప‌ర్మిష‌న్ లేకుండా త‌న పేరును వాడుకుని మంచి పేరు, ప్ర‌చారం క‌లిపించుకోవాల‌ని చూస్తున్నార‌ని క‌ర‌ణ్ అన్నారు. త‌న పేరు వాడ‌టం వ‌ల్ల తన ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లుగుతుంద‌ని పిటిష‌న్ లో చెప్పారు క‌ర‌ణ్. త‌న పేరు ఉంటే అది త‌న సినిమా అనుకుని సినిమాకి వ‌స్తార‌నే ఆలోచ‌న‌తో ఇలా చేశార‌ని ఆరోపించారు క‌ర‌ణ్. 


ఎన్నో హిట్ సినిమాలు.. 


క‌ర‌ణ్ జోహార్.. సినిమా ఇండ‌స్ట్రీలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఎన్నో భారీ హిట్ సినిమాలు తీశారు. సినిమాలు డైరెక్ట్ చేయ‌డ‌మే కాకుండా ప్రొడ్యూస్ కూడా చేశారు. అలా ఆయ‌న‌కు సినీ ఇండ‌స్ట్రీలోనే మంచి పేరు ఉంది. 'కుచ్ కుచ్ హోతా హై' సినిమా ద్వారా బాలీవుడ్ కి ప‌రిచ‌యం అయ్యారు క‌ర‌ణ్. మొద‌టి సినిమానే బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కావ‌డంతో పాటు అవార్డులు ద‌క్కించుకున్నారు ఆయ‌న‌. ఆ త‌ర్వాత 'కభీ ఖుషీ కభీ గమ్', 'కభీ అల్విదా నా కెహ్నా', 'మై నేం ఈజ్ ఖాన్' లాంటి మంచి మంచి హిట్లు అందించారు. అంతేకాకుండా టీవీ షోలు కూడా చేశారు. 'కాఫీ విత్ క‌ర‌ణ్' చాలా ఫేమ‌స్ షో. 


అదిరిపోయిన 'కిల్' ట్రైల‌ర్.. 


ఇక లేటెస్ట్ గా క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన 'కిల్' సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. గతేడాది టొరంటో ఫిలిమ్ ఫెస్టివ‌ల్ లో ప్రీమియ‌ర్ అయిన ఈసినిమా ఇప్పుడు మ‌న దేశంలో రిలీజ్ కాబోతోంది. దానికి క‌ర‌ణ్ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌గా.. హీరో లక్ష్య కాగా.. ఆయ‌న స‌ర‌స‌న తాన్యా న‌టించారు. ఈ సినిమా ట్రైల‌ర్ ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటోంది. మాస్ సీన్లకి అంద‌రూ ఫిదా అయిపోతున్నారు. 


Also Read: ‘కిల్’ ట్రైలర్ - ఆ చంపుడేంది సామి.. సినిమా మొత్తం రైల్లోనే, ఇండియాలోనే అత్యంత హింసాత్మక మూవీ ఇదేనట!