Kill Movie Trailer Out Now: మామూలుగా హాలీవుడ్ సినిమాలతో పోలిస్తే ఇండియన్ సినిమాల్లో వైలెన్స్‌ను చాలా తక్కువే చూపిస్తారు. రక్తపాతాన్ని ఎక్కువగా చూపించడానికి ఇండియన్ మేకర్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ ఇలాంటి భయంకరమైన సినిమాను ఇప్పటివరకు ఇండియాలో ఎవరూ నిర్మించలేదు అంటూ ఒక బాలీవుడ్ మూవీ.. ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. అదే ‘కిల్’. కరణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీ గతేడాది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయ్యింది. ఇప్పుడు ఇండియాలో విడుదలకు సిద్ధమయ్యింది. తాజాగా ‘కిల్’ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.


ప్రేమ కోసం..


హీరో లక్ష్య మెడకు గొలుసు వేసి లాక్కొని వెళ్తుండగా ‘కిల్’ ట్రైలర్ మొదలవుతుంది. అప్పటికే తన ఒంటి నిండా గాయాలు అయ్యింటాయి. కట్ చేస్తే.. తాన్యా, లక్ష్య కలిసి తమ 4వ లవ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అవుతారు. ఇద్దరూ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా లక్ష్య.. తాన్యాను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. తను కూడా ఓకే చెప్తుంది. అక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. అప్పుడే ట్రైన్‌లోకి కొందరు క్రిమినల్స్ బలవంతంగా ఎక్కుతారు. వారిని ఆపడానికి పోలీసులు ప్రయత్నించగా.. వారిని అతి దారుణంగా చంపేస్తారు. ఆ క్రిమినల్స్ దృష్టి హీరోయిన్‌పై పడుతుంది. దీంతో హీరో వైలెంట్‌గా మారి ఆ క్రిమినల్స్‌ను చంపడం మొదలుపెడతాడు.


ట్రైలర్‌లోనే ట్విస్ట్..


‘కిల్’ సినిమా అంతా దాదాపుగా ట్రైన్‌లోనే నడుస్తుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. బలవంతంగా ట్రైన్ ఎక్కిన క్రిమినల్స్.. హీరోయిన్‌ను లాక్కెళ్లిపోతారు. దీంతో వారిపై దాడి చేస్తూ హీరోయిన్‌ను కాపాడుకుంటానని ఛాలెంజ్ చేస్తాడు హీరో. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. హీరో ఒక సైనికుడు అని తెలుస్తుంది. అతడికి సాయం చేయడానికి ట్రైన్‌లోని కొందరు ప్యాసెంజర్లు ముందుకొస్తారు. దీంతో వారిని కూడా చంపడం మొదలుపెడతారు ఆ క్రిమినల్స్. అలా ‘కిల్’ కథ మొత్తం దాదాపుగా ట్రైలర్‌లోనే రివీల్ అయిపోయింది. కానీ వయొలెన్స్‌ను వెండితెరపై చూడడానికి ఇష్టపడేవారి కోసం మాత్రమే ఈ సినిమా అని మేకర్స్ ముందుగానే క్లారిటీ ఇచ్చేశారు.



నువ్వు రాక్షసుడివి..


‘నువ్వు రక్షకుడివి కాదు.. రాక్షసుడివి’ అంటూ విలన్ రాఘవ్ చెప్పే డైలాగ్‌తో హీరో లక్ష్య క్యారెక్టరైజేషన్ గురించి ‘కిల్’ ట్రైలర్‌లో రివీల్ చేశాడు దర్శకుడు నిఖిల్ నగేష్ భట్. యశ్ జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహ్తా, గునీత్ మోంగా కపూర్, అచిన్ జైన్ కలిసి ‘కిల్’ను సంయుక్తంగా నిర్మించారు. వారు ముందుగా చెప్పినట్టుగానే ట్రైలర్‌లో కొన్ని సీన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. విలన్ తలను హీరో తగలబెట్టేయడం, నేరుగా ఒకడి కంట్లోకి కత్తి గుచ్చడం.. ఇలాంటివి చాలామంది ప్రేక్షకులకు డిస్టర్బింగ్ అనిపిస్తాయి. ఇక ఈ డిస్టర్బింగ్ సినిమా జులై 5న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. ఈ మూవీతో లక్ష్య హీరోగా పరిచయం అవుతున్నాడు. రెమో డిసౌజా మూవీస్‌లో డ్యాన్సర్‌గా మెప్పించిన రాఘవ్.. మొదటిసారి ‘కిల్’తో విలన్‌గా మారాడు.


Also Read: ఈమె జస్ట్ అలా కూర్చున్నందుకు రూ.8 కోట్లు ఇస్తున్నారట - ఈ సీనియర్ నటి సంపాదన తెలిస్తే నోరెళ్లబెడతారు