Best Thriller Movies On OTT: సైన్స్ ఫిక్షన్ కథలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. పైగా ఆ కథల్లో కాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను కలిపితే అవి ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు అవుతాయి. అలాంటి ఒక సినిమానే ‘ఓల్డ్’ (Old). 2021లో విడుదలయిన ఈ మూవీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. చివరి వరకు ఏం జరుగుతుంది అని ఆసక్తితో చూడగలిగే సినిమా ఇది. బీచ్ అంటే చాలామందికి ఇష్టమే. కానీ ఈ మూవీలో బీచ్‌కు వెళ్లడం వల్లే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారు. మామూలుగా సూపర్ నేచురల్ కథలు, అద్భుతమైన ట్విస్టులతో సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అనిపించుకున్న ఎమ్ నైట్ శ్యామలన్.. ఈ ‘ఓల్డ్’ను కూడా డైరెక్ట్ చేశాడు.


కథ..


‘ఓల్డ్’ కథ విషయానికొస్తే.. గయ్ (గేల గార్సియా బెర్నాల్), ప్రిస్కా (విక్కీ క్రీప్స్).. తమ కొడుకు ట్రెంట్, కూతురు మాడెక్స్‌ను తీసుకొని హాలీడే కోసం ఒక రిసార్ట్‌కు వెళ్తుంటారు. ఆ రిసార్ట్ యాజమాన్యం వారికి వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చి దగ్గర్లో ఒక బీచ్ ఉందని, అక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్తారు. దీంతో గయ్‌తో పాటు రిసార్ట్‌లో ఉండే మరో రెండు కుటుంబాలు కూడా ఆ బీచ్‌కు వెళ్తాయి. అందరూ సరదాగా ఆడుకుంటున్న సమయంలోనే ట్రెంట్‌కు అక్కడ ఒక అమ్మాయి శవం కనిపిస్తుంది. అది చూసి అందరూ భయపడిపోతారు. అదే సమయంలో మిడ్ సైజ్డ్ (ఆరన్) అనే వ్యక్తి వచ్చి అది తన ఫ్రెండ్ అని చెప్తాడు. దీంతో ఆ బీచ్‌కు వచ్చిన డాక్టర్ చార్ల్స్ (రుఫస్ సీవెల్)కు మిడ్ సైజ్డ్ మీద డౌట్ వస్తుంది. అప్పుడే చార్ల్స్ తల్లి అనారోగ్యానికి గురవుతుంది. తనను ఎంత కాపాడాలని ప్రయత్నించినా బతకదు. అప్పుడే అందరూ తాము ఆ బీచ్‌కు వచ్చినప్పటి నుంచి వయస్సు పెరిగిపోతున్నట్లు తెలుసుకుంటారు.


మాడెక్స్, ట్రెంట్.. పెద్దవాళ్లు అయిపోవడం చూసి తల్లిదండ్రులు షాకవుతారు. అక్కడి నుండి త్వరగా తప్పించుకోకపోతే ప్రాణాలు కోల్పోతాయని అర్థం చేసుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా ప్రయత్నించిన ప్రతీసారి ఏదో ఒక అడ్డంకి వస్తుంది. అంతే కాకుండా అక్కడ వారికి గాయాలు అయినా కూడా అవి త్వరగా మానిపోతుంటాయి. ఒక్కొక్కరుగా అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండానే చనిపోతుంటారు. చివరికి మాడెక్స్, ట్రెంట్ మాత్రమే ఆ బీచ్‌లో ఒంటరిగా మిగిలిపోతారు. అప్పుడే సముద్రం కింద భాగానికి ఈదగలిగితే వారు తప్పించుకునే మార్గం ఉంటుందని తెలుస్తుంది. తప్పించుకున్న తర్వాత అసలు ఆ బీచ్‌లో వారంతా ఎందుకంతా త్వరగా వయసు పెరిగారో తెలుసుకుంటారు. దీని వెనుక అసలు కథ ఏంటో తెలియాంటే సినిమా చూడాల్సిందే.



కొత్త కాన్సెప్ట్..


బీచ్‌లోకి వెళ్తే త్వరగా వయసు పెరిగిపోవడం అనేది ఎక్కడా వినని ఒక కొత్త కాన్సెప్ట్. ముఖ్యంగా ‘ఓల్డ్’ మూవీ ప్రేక్షకులను మెప్పించడానికి ఇందులోని డిఫరెంట్ కాన్సెప్టే కారణం. తర్వాత ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ ప్రేక్షకుల్లో చివరి వరకు ఉంచడంలో డైరెక్టర్ 200 శాతం సక్సెస్ సాధించాడు. ఇలాంటి ఒక సినిమాను ఎప్పుడూ చూడలేదే అన్న ఫీలింగ్ తప్పకుండా ఆడియన్స్‌లో కలుగుతుంది. ఒక డిఫరెంట్ థ్రిల్లర్‌ను చూడాలనుకునేవారు అమెజాన్ ప్రైమ్‌లో రెంట్‌కు ఉన్న ‘ఓల్డ్’ను స్ట్రీమ్ చేయవచ్చు.


Also Read: లేక్‌లో లేడీ దెయ్యం, అందంగా ఉందని కక్కుర్తిపడితే చచ్చారే - ఆమెను ప్రేమిస్తే ఏమవుతుంది? ఇదో వెరైటీ హర్రర్ మూవీ