Archana Puran Singh: యాక్టింగ్ అనేది చాలా కష్టమని, స్క్రీన్‌పై అందంగా కనిపించే సీన్ కోసం స్క్రీన్ వెనుక ఎంతో కష్టపడతామని నటీనటులు అంటుంటారు. కేవలం నటీనటులు మాత్రమే కాదు ఎంతోమంది టెక్నీషియన్లు కలిసి కష్టపడితేనే మంచి ఔట్‌పుట్ వస్తుందని చెప్తారు. బుల్లితెర విషయానికొస్తే చాలా భిన్నంగా ఉంటుంది. రియాలిటీ షోలలో కేవలం ఒకే దగ్గర కూర్చొని మాట్లాడితే చాలు.. నటీనటులకు కోట్లు వచ్చిపడతాయి. అలాగే ఒక బాలీవుడ్ సీనియర్ నటి కూడా కేవలం చైర్‌లో కూర్చొని రూ.8 కోట్లు సంపాదించింది అంటే నమ్ముతారా? నమ్మడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజం.


ఆ షోలో గెస్ట్..


అర్చనా పురాన్ సింగ్.. హిందీలో రియాలిటీ షోలు ఫాలో అయ్యేవారికి ఈ పేరు బాగా తెలిసే ఉంటుంది. కపిల్ శర్మ షోలో ఎన్నో ఏళ్లు జడ్జి సీటులో కూర్చొని తన నవ్వుతో అందరినీ నవ్వించేది అర్చనా. ముందుగా కపిల్ శర్మ షోలో జడ్జి స్థానంలో నవ్జోత్ సింగ్ సిద్ధు ఉండేవారు. ఆయన తప్పుకున్న తర్వాత ఆ స్థానంలోకి అర్చనా సింగ్ వచ్చారు. 2018 నుంచి 2023 వరకు కపిల్ శర్మ షోలో పర్మనెంట్ గెస్ట్‌గా ఉన్నారు అర్చనా. అదే సమయంలో కపిల్‌కు నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. తన షోను ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమ్ చేస్తామని నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ పేరుతో ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. అక్కడ కూడా అర్చనా పురాన్ సింగ్ పర్మనెంట్ గెస్ట్‌గా కనిపిస్తోంది.


ఒక్క ఎపిసోడ్‌కు ఎంతంటే.?


‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’లో పర్మనెంట్ గెస్ట్‌గా ఉండే అర్చనా పురాన్ సింగ్.. పెద్దగా చేయాల్సింది ఏమీ ఉండదు. ఒకే చైర్‌లో కూర్చొని షోకు వచ్చే గెస్టులతో కపిల్ చేసే కామెడీకి నవ్వాలి. అంతే ఆమె పని. దానికోసం ఎపిసోడ్‌కు రూ.10 లక్షలు ఛార్జ్ చేస్తుందట ఈ నటి. ఓ బాలీవుడ్ మ్యాగజిన్ తెలిపిన వివరాల ప్రకారం.. కపిల్ శర్మ షో ద్వారా ఏకంగా రూ.8 కోట్లు సంపాదించారట అర్చనా. ఇది విని అందరూ షాకవుతున్నారు. 1987లో ‘అభిషేక్’ అనే సీరియల్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు అర్చనా పురాన్ సింగ్. బుల్లితెరపై నుంచి వెండితెరపైకి వచ్చి సక్సెస్ సాధించిన వారి లిస్ట్‌లో అర్చనా కూడా చోటు దక్కించుకున్నారు.


వెండితెరతో పాటు బుల్లితెరపై..


‘జల్వా’ మూవీతో మొదటిసారి వెండితెరపై మెరిశారు అర్చనా పురాన్ సింగ్. అమితాబ్ బచ్చన్ ‘అగ్నీపత్’, దిలీప్ కుమార్ ‘సౌదాగర్’, గోవిందా ‘షోలా ఔర్ షబ్నమ్’, అమీర్ ఖాన్ ‘రాజా హిందుస్థానీ’లో అర్చనా నటించారు. అంతే కాకుండా చిన్న పాత్రలతోనే ఎంతో పాపులారిటీ అందుకొని ఐటెమ్ గర్ల్‌గా కూడా మారారు. ‘బాజ్’, ‘జడ్జ్ ముజ్రిమ్’ అనే చిత్రాల్లో ఐటెమ్ పాటలకు స్టెప్పులేశారు. 90ల్లో ఒకవైపు వెండితెరపై వెలిగిపోతూనే బుల్లితెరపై కూడా పాపులర్ అయ్యారు అర్చనా. ‘అర్చనా టాకీస్’ అనే ఒక షోను హోస్ట్ కూడా చేశారు. ఒక కామెడీ షోలో జడ్జిగా వ్యవహరించిన తర్వాత ఇప్పుడు కపిల్ శర్మ షోతో బిజీ అయిపోయారు.


Also Read: సోనాక్షి సిన్హా పెళ్లా? నాకేం చెప్పలేదు.. అదే నిజమైతే నా భార్య, నేను అలా చేస్తాం - కూతురి పెళ్లి వార్తలపై శత్రుఘ్న సిన్హా స్పందన