2025 Sankranti Movies: టాలీవుడ్‌లో సంక్రాంతి పండుగను సినిమాలకు అతి పెద్ద సీజన్‌గా భావిస్తుంటారు. ఏ సినిమా అయినా టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు రాబడుతుంది కాబట్టి, ప్రతీ ఒక్కరూ ఇదే పండక్కి రావాలని చూస్తుంటారు. ఎప్పటిలాగే వచ్చే ఏడాది కూడా బాక్సాఫీసు దగ్గర గట్టి పోటీ ఏర్పడేలా కనిపిస్తోంది. ఫెస్టివల్ సీజన్ కోసం ఏడెనిమిది నెలల ముందుగానే డేట్లు లాక్ చేయడం స్టార్ట్ చేసారు. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కానీ, ఇప్పటికైతే పోటా పోటీగా రిలీజులు అనౌన్స్ చేస్తున్నారు.


లేటెస్టుగా మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ‘సామజవరగమన’ చిత్రానికి రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన రోజే మేకర్స్ ఈ మూవీ విడుదలను కూడా ప్రకటించారు. 2025 సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నారు.


అయితే సంక్రాంతి కోసం అందరి కంటే ముందే మెగాస్టార్ చిరంజీవి కర్చీఫ్ వేశారు. ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న'విశ్వంభర' సినిమాని జనవరి 10న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.


విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #VenkyAnil3 సినిమాని కూడా వచ్చే పొంగల్‌కు రిలీజ్ చేస్తామని అంటున్నారు. దీనికి దిల్ రాజు నిర్మాత. ఆయన నిర్మిస్తున్న 'శతమానం భవతి 2' చిత్రాన్ని కూడా సంక్రాంతికే తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు సెంటిమెంటుగా 'ఎఫ్ 2' టీమ్ తోనే రావాలని ఫిక్స్ అయ్యారు.


మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ కూడా పొంగల్‌కు షెడ్యుల్ చేశారు. మొన్న పండక్కి 'హను-మాన్'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రతీ ఫెస్టివల్‌కు తన సినిమా ఉంటుందని చెప్పాడు. చెప్పినట్లుగానే 'జై హనుమాన్' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. ఎలాగూ రణవీర్ సింగ్ తో చెయ్యాల్సిన హిందీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని అంటున్నారు కాబట్టి, హనుమాన్ సీక్వెల్‌ను పెద్ద పండుగకు సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి.


'నా సామి రంగా'తో సూపర్ హిట్ కొట్టిన కింగ్ అక్కినేని నాగార్జున.. వచ్చే సంక్రాంతికి కలుద్దామని సక్సెస్ మీట్ లోనే ప్రకటించేశారు. ఇప్పటి వరకూ నాగ్ తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు.. సెట్స్ మీదకు తీసుకెళ్ళలేదు. కాకపోతే ఆయన ప్రీవియస్ సినిమాల ప్లానింగ్ ను బట్టి చూస్తే మాత్రం, పొంగల్ టార్గెట్ రీచ్ అవ్వడం కింగ్‌కు పెద్ద కష్టమేమీ కాదు. నందమూరి బాలకృష్ణ, కొల్లి బాబీల NBK109 సినిమా ఈ సంవత్సరం విడుదల కాకపోతే, వచ్చే సంక్రాంతికి రావొచ్చని అంచనాలు వేస్తున్నారు.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రూపొందించే 'రాజా సాబ్' మూవీ సైతం పొంగల్‌కు వచ్చే ఛాన్స్ ఉందని టాక్. ఇలా 2025 సంక్రాంతి కోసం పలు పెద్ద సినిమాలు పోటీ పడుతుండటం ఆసక్తికరంగా మారింది. మాములుగా ఫెస్టివల్ సీజన్ లో నాలుగు చిత్రాలకు ప్లేస్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ సినిమాలొస్తే థియేటర్ల సమస్య ఏర్పడుతుంది. అందుకే ఇండస్ట్రీ పెద్దలు క్లాష్‌ను నివారించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మరి ఫైనల్ గా వీటిల్లో ఏయే చిత్రాలు బరిలో నిలుస్తాయో, కొత్తగా ఇంకెన్ని సినిమాలు రేసులోకి వస్తాయో వేచి చూడాలి.


Also Read: మహేష్ బాబులా ఉన్నావని అంటే నా కొడుక్కి కోపం వచ్చేస్తుంది - హీరో సుధీర్ బాబు