Actor Sivaji About AP Politics: తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అయితే ఆయన ఓడిపోతారు అనే విషయాన్ని చాలాకాలం క్రితమే ఊహించారు శివాజీ. టాలీవుడ్ సీనియర్ యాక్టర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అయిన శివాజీ.. ఆపరేషన్ గరుడ అనే పేరుతో చేసిన విశ్లేషణ ఓ రేంజ్‌లో వైరల్ అయ్యింది. దాని ప్రకారం జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవని అన్నారు. దీంతో తనకు వార్నింగ్ ఇచ్చారని, అందుకే ఇంక విశ్లేషణలు లాంటివి ఏమీ చేయనని శివాజీ చెప్పిన పాత ఇంటర్వ్యూ ఒకటి మరోసారి తెరపైకి వచ్చింది. అందులో జగన్ పాలనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు శివాజి.


అవే కారణాలు..


జగన్‌పై 32 కేసులు ఉన్న విషయాన్ని ముందుగా గుర్తుచేశారు శివాజీ. అంతే కాకుండా ఆయనను కాస్ట్‌లీ ముఖ్యమంత్రి అని అన్నారు. జగన్ ఓడిపోవడానికి గల కారణాలు ఏమయ్యింటాయి అనే విషయంపై వ్యాఖ్యలు చేశారు. ‘‘కంపెనీలను వెనక్కి పంపించడం, పోలవరం పూర్తి చేయకపోవడం, అన్న క్యాంటీన్స్ రద్దు చేయడం, ఇసుక మాఫీయాను పెంచి పోషించడం, అమరావతిని పక్కన పెట్టడం, మద్యపానం నిషేదించికపోవడం, ఆయన కంపెనీలే నడపడం’’ ఇవన్నీ జగన్ చేశారని ఆరోపించారు శివాజీ. ఆయన ఎమ్మెల్యేలను, మంత్రులను వదిలేశారని అన్నారు. అలా వదిలేస్తే ఏ ప్రభుత్వం కూడా ఉండదు అని తెలిపారు.


పొత్తులపై కామెంట్..


ఏపీ ఎన్నికలకు కొన్నిరోజుల ముందు ఇంటింటికి స్టిక్కర్లు అంటూ ప్రజల్లోకి వెళ్లడానికి ఏవేవో ప్రయత్నాలు చేసింది జగన్ ప్రభుత్వం. దానిపై కూడా శివాజీ స్పందించారు. ‘‘ఇదంతా క్యాన్సర్ వచ్చిన తర్వాత చివరి రోజుల్లో చేసే ఆయుర్వేదం వైద్యం లాంటిది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంత సంపాదించారో ప్రజలకు తెలుసు. అంతకు ముందు పార్టీ వాళ్లు సంపాదిస్తున్నారనే కదా మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు’’ అని అన్నారు. ఇక పొత్తులపై కూడా శివాజీ అప్పట్లోనే స్పందించారు. పొత్తు ఉన్నా లేకపోయినా చంద్రబాబు విజయం నల్లేరు మీద నడక అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే శివాజీ.. కరెక్ట్‌గా గెస్ చేశారని అంటున్నారు ప్రజలు.


ప్రజల దృష్టిలో అంతే..


‘‘జగన్ మోహన్ రెడ్డి అడుగులే వాళ్లకు మళ్లీ ఊపిరినిచ్చి ప్రజల దృష్టిలో చంద్రబాబును మర్రిచెట్టును చేసిపెట్టాయి. చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఉందని జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. దాదాపు రెండేళ్ల నుండి నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. అప్పటినుండి ఇదే మాట చెప్తున్నాను. అప్పుడే జగన్ మోహన్ రెడ్డిగారు మీ పని అయిపోతుంది చూసుకోండి అని చెప్పాను. మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నామనేది వేరే విషయాలు. చుట్టూ ఉన్నవాళ్లను నమ్ముకొని అసలు గ్రౌండ్‌లోకి రాకపోవడం తప్పే కదా. జగన్ పాదయాత్ర చేసి ప్రజల్లో తిరిగి, అందరూ నావాళ్లే అంటూ ముఖ్యమంత్రి అయ్యారు. అలా అయినప్పుడు పరదాలు కట్టుకొని వెళ్లడమేంటి? ప్రజలతో మాట్లాడకుండా ప్రెస్ మీట్‌లు పెట్టడమేంటి’’ అంటూ అప్పట్లో జగన్ పాలనను ప్రశ్నించారు శివాజీ.


Also Read: మోదీ, చిరు మాత్రమే కాదు - చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఈ స్టార్ హీరో కూడా