AP Latest News: చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే కార్యక్రమానికి దిగ్గజాలు హాజరు కాబోతున్నారు. దేశ వ్యాప్త రాజకీయ అగ్ర నేతలే కాకుండా సినిమా రంగంలోనూ ప్రఖ్యాతిగాంచిన సెలబ్రిటీలు కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. చంద్రబాబు సీఎంగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గన్నవరంలోని కేసరపల్లిలో జూన్ 12న ఉదయం 11.27 గంటలకు జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్న విషయం ఇప్పటికే ఖరారైంది. ప్రధాని మోదీ బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనుండగా.. అమిత్ షా ఇప్పటికే ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు. వీరిద్దరూ రేపు ఉదయం జరగబోయే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు అవుతున్నారు. అమిత్ షా, మోదీతో పాటు జేపీ నడ్డా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మరోవైపు, సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి దంపతులు కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చిరంజీవికి ఘనస్వాగతం లభించింది. తమ్ముడి ప్రమాణస్వీకారానికి వచ్చిన అన్నకు జనసైనికులు ఘన స్వాగతం పలికారు. కాగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రభుత్వం నుంచి చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది.
రజినీ కాంత్ కూడా
వీరితో పాటు మరో అగ్ర నటుడు కూడా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అనంతరం రోడ్డు మార్గాన నోవాటెల్ హాటల్ కు బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన అతిథులు అందరికీ చంద్రబాబు తన ఉండవల్లి నివాసంలో విందు ఏర్పాటు చేశారు.
రజినీ కాంత్ కు చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రజినీ కాంత్ కూడా చంద్రబాబుతో పాటు పాల్గొన్నారు. ఆ సమయంలో వైసీపీ నేతలు తీవ్రమైన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. రజినీ కాంత్ చంద్రబాబుకు మద్దతు పలికారనే ఉద్దేశంతో అప్పటి మంత్రులు అంబటి రాంబాబు, కొడాలి నాని వంటి నేతలు రజినీ కాంత్ ప్రతిష్ఠను మరింత దిగజార్చి వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో రజినీ పట్ల వారు అలా మాట్లాడడం తీవ్రమైన వ్యతిరేకతకు దారి తీసింది. తాజాగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజినీ కాంత్ హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.