TDP Chief Chandrababu Naidu Oath Taking Ceremony: ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. బుధవారం (జూన్ 12) ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు విజయవాడ శివారులోని గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న మేధ ఐటీ పార్కు వద్ద జరిగే భారీ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ప్రమాణం చేయనున్నారు. ఇంకా 26 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే వేదికపై మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
అయితే, ఈ వేడుక అట్టహాసంగా జరగనుంది. ప్రమాణ స్వీకార వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రిక ఇప్పుడు బయటికి వచ్చింది. ‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రివర్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ఉదయం 11.27 గంటలకు, 12 జూన్ 2024 (బుధవారం) వేదిక: మేధ ఐటీ పార్కు (గన్నవరం విమానాశ్రయం ఎదురుగా) కేసరపల్లి, విజయవాడ’’ అని ఆహ్వాన పత్రికలో ఉంది.
ప్రమాణ స్వీకార వేడుకకు హాజరయ్యే వారికి కొన్ని సూచనలు కూడా చేశారు. కార్యక్రమానికి వచ్చేవారు ఈ ఆహ్వాన పత్రిక తప్పకుండా తీసుకురావాలి. వారికి కేటాయించిన స్థలంలో ఉదయం 9.30 గంటల కల్లా కూర్చోవాలని సూచించారు. ఈ ఆహ్వాన పత్రిక ఇతరులకు బదిలీ చేయకూడదని.. ఒక ఆహ్వాన పత్రికపై ఒకరు మాత్రమే ప్రవేశానికి అర్హులని వివరించారు. ఈ కార్డు నకిలీని క్రియేట్ చేసే వీలు లేకుండా దానిపై ఏపీ ప్రభుత్వ హోలోగ్రామ్‌ను కూడా ఉంచారు.
ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ కూడా హాజరు కానున్నారు. బుధవారం ఉదయం 8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి.. ఉదయం 10.40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. ప్రమాణ స్వీకార ప్రాంగణానికి 11 గంటల వరకు చేరుకుని కార్యక్రమంలో పాల్గొననున్నారు. మళ్లీ మధ్యాహ్నం 12.30 గంటల కల్లా కార్యక్రమం ముగించుకొని.. 12.45 గంటలకు ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ కు మోదీ వెళ్లనున్నారు.
3 లక్షల మంది జనం
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చే జనం కోసం నియోజకవర్గానికి 4 బస్సుల చొప్పున కేటాయించినట్లు సమాచారం. చుట్టుపక్కల జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలు భారీ ఎత్తున వస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. సభకు మొత్తం 3 లక్షలకు పైగానే జనం వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేసినట్లుగా విజయవాడ ఎంపీ కేశి నేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. విజయవాడ నగరంలో చాలా చోట్ల ఎల్ఈడీ తెరలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.