ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఉదయం ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు అయ్యే గెస్ట్‌ల లిస్ట్ భారీగానే ఉంది. వీరిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. మెగాస్టార్‌తోపాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రమాణ స్వీకరోత్సవానికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రత్యేక అతిథి హోదాలో మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. సాయంత్రం హైదరాబాద్‌లో ప్రత్యేక విమానంలో బయల్దేరి విజయవాడ చేరుకుంటారు. అక్కడ రాత్రి బస చేసి ఉదయం కార్యక్రమానికి హాజరవుతారు. ఆయనతోపాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం ఉంది.
ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ టూర్ కన్ఫామ్ అయింది. ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని తెలిసింది. ఇప్పుడు మెగాస్టార్ కూడా రానున్న వేళ... ప్రమాణస్వీకారోత్సవంలో మెగా ఫ్యామిలీ సందడి కనిపించనుంది.
ఇదే వేదికపై మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణం చేయనున్నారు. అందుకోసం మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వెళ్తోంది. టీడీపీ, జనసేన శ్రేణులు, మెగా ఫ్యామిలీ అభిమానులు గన్నవరంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.
నాల్గోసారి సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఉదయం 11.27 నిమిషాలకు గన్నవరానికి సమీపంలో ఉన్న కేసరపల్లిలో ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఇతర కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా హాజరుకానున్నారు. వీళ్లతోపా వివిధ రంగాల ప్రముఖులు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, క్రీడారంగ ప్రముఖులు రానున్నారు.
అతిథుల జాబితా భారీగా ఉండటంతో ఆ స్థాయిలో భద్రతా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఎక్కడా వచ్చిన అతిథులకు, హాజరయ్యే ప్రజలకు సమస్యలు రాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 12 ఎకరాల్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సిద్ధం చేస్తున్నారు. సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తి అయిన తర్వాత భద్రతా దళాల చేతిలోకి ఆ ప్రాంతమంతా వెళ్లిపోనుంది.