Andhra Pradesh CM: ఏపీ(Andhra Pradesh) నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత, జనసేన-బీజేపీ-టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Baidu) ఈ నెల 12న(బుధవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదే శ్‌లో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఇప్పుడు విభజిత ఏపీలో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని గన్నవరం(Gannavaram) విమానాశ్రయానికి చేరువలో ఉన్న.. కేసరపల్లి ఐటీ పార్కు(Kesarapalli IT park)ను ప్రమాణ స్వీకార వేదిగా మలుచుకున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా జాతీయ నాయకులు, పలువురు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను ఘనం చేస్తున్నారు. వేదిక నిర్మాణం దాదాపు పూర్తయింది.
చంద్రబాబుకు ఎంతో ఇష్టమైన రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతి(Amaravati)లో కాకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసరపల్లిని ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ఏపీకి కొత్త రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆయన హయాంలోనే కొన్ని భవనాలు, కార్యాలయాలు కూడా ఇక్కడ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు అక్కడ కాకుండా కేసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేయడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. వాస్తవానికి.. టీడీపీ నాయకులు.. తొలుత అమరావతి ప్రాంతంలోని మంగళగిరికి సమీపంలోనే ప్రమాణ స్వీకార వేదికను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అంతేకాదు.. ఈ నెల 9నే చంద్రబాబుప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ప్రకటన చేశారు. కానీ, టైము, వేదిక రెండూ కూడా తర్వాత మారిపోయాయి.
కారణం ఇదేనా?
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసరపల్లిలోని ఐటీ పార్కును ఎంచుకోవడం వెనుక రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఐటీ పార్కును జాతీయస్థాయిలో చర్చకు తీసుకురావడం. వాస్తవానికి కేసరపల్లిలో ఐటీ పార్కును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి(Y.S. Rajashekarareddy) 2006లో ప్రారంభించారు. విజయవాడ(Vijayawada)కు అత్యంత సమీపంలో ఉండడంతో విజయవాడను ఐటీ హబ్ చేయాలన్న సంకల్పంతో ఆయన దీనిని ప్రారంభించారు. అయితే.. హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖరరెడ్డి ఆకస్మికంగా చనిపోయినా.. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రోశయ్య దీనిని కొనసాగించారు. 2010లో అప్పటి సీఎంగా రోశయ్య `మేధ` టవర్‌ను ప్రారంభించారు. ఇక, ఆతర్వాత.. దీనిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు ఈ ఐటీ పార్కుకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న సంకల్పంతోనే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
రెండో కారణం.. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జాతీయ స్థాయి నాయకులు వస్తున్నారు. విశిష్ఠ అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. అదేవిధంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఇతర నాయకులు రానున్నారు. ఈ నేపథ్యంలో వారంతా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి సమీపంలోని కేసరపల్లికి చేరుకునేందుకు కేవలం 1.5 కిలో మీటర్ల ఉంటుంది. దీనివల్ల వారి భద్రతకు, ఇతరత్రా సౌకర్యాలకు కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈ కారణంగా కూడా కేసరపల్లిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇదేసమయంలో అమరావతి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే.. అది సుదూరంగా ఉండడంతో పాటు భద్రతాపరమైన చర్యలకు కూడా ఇబ్బంది అవుతుందనే అంచనా వుంది. ఈ నేపథ్యంలోనే కేసరపల్లిని ఎంపిక చేసినట్టు సమాచారం.
విశాలం కూడా!
కేసరపల్లిలోని ఐటీ పార్కు గ్రౌండ్ విశాలంగా ఉండడం కూడా.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకునేందుకు కారణమని తెలుస్తోంది. ఇక్కడ ఒకే సారి 50 వేల మంది కూర్చునేందుకు అనువైన స్థలం ఉంది. మొత్తంగా 18-20 ఎకరాల స్థలం కావడంతో కార్ల పార్కింగు సహా.. వచ్చిన అతిథులు పార్టీల అభిమానులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే.. కేసరపల్లిలో ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అలాకాకుండా.. అమరావతిలో కనుక ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తే.. అతిథుల తరలింపు నుంచి ఏర్పాట్ల వరకు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. పైగా.. అమరావతిని గత పదేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో అక్కడ ఏర్పాట్లు చేయాలంటే ఇబ్బందులు తప్పవనే వాదన కూడా ఉంది. అందుకే కేసరపల్లిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.
అమరావతి దుస్థితికి కారణం?
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీకి ప్రత్యేకంగా రాజధాని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో 2015లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో సేకరించింది. నవ్యాంధ్ర రాజధాని దేశానికే దిక్సూచిగా ఉండాలన్న బృహత్తర సంకల్పంతో నవ నగరాల ను ఇక్కడ ప్రతిపాదించారు. అనేక విద్యాసంస్థలు, ఉపాధి కేంద్రాలు, పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయా లని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అమరావతి రాజధానికి ప్రధాని నరేంద్ర మోడీ అప్పట్లో శంకు స్థాపన చేశారు. అయితే, 2019కి వచ్చేస రికి ప్లానింగ్ దశలో ఉన్న అమరావతి విషయంలో యూ టర్న్ తెరమీదికి వచ్చింది. 2019లో 151 మంది ఎమ్మెల్యేలతో విజయం దక్కించుకున్న వైసీపీ అధినేత.. తర్వాత అమరావతిపై శీతకన్నేశారు. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే.. భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని భావించిన ఆయన మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకువచ్చారు. విశాఖను పాలనారాజధానిగా మలచాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కర్నూలు న్యాయ రాజధాని, అమరావతిని శాసన రాజధానిగా మారుస్తూ.. ప్రకటన ఇచ్చింది. అయితే.. దీనిని వ్యతిరేకిస్తూ.. రైతులు ఉద్యమించారు. న్యాయ పోరాటం కూడా చేశారు. అయితే.. తాజాగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం దక్కించుకోవడంతో మరోసారి రాజధాని నిర్మాణం వడివడిగా ముందుకు సాగుతుందని విశ్వస్తున్నారు.