Andhra Pradesh News: అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన తర్వాత రెండో సంతకం ఆ ఫైల్‌పైనే పెడతారని సమాచారం. దాదాపు ప్రతి ఎన్నికల సభలో చంద్రబాబుతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.


ఆంధ్రప్రదేశ్‌ భూ యాజమాన్య హక్కు చట్టం -2022 ఈ ఎన్నికల్లో పెను దుమారాన్నే రేపింది. దీన్ని ప్రభుత్వంపై శతఘ్నీలా వాడుకుంది కూటమి. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా రద్దు చేస్తామన్న హామీని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను రెవెన్యూ శాఖ ప్రారంభించింది. న్యాయశాఖ అనుమతి కూడా తీసుకుంటారు. రేపు సీఎం ఈ ఫైల్‌పై సంతకం చేసిన తర్వాత మంత్రిమండలిలో ఆమోదించి వచ్చే శాసనసభలో టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లు ప్రవేశపెడతారు. దీంతో చట్టం రద్దు అవుతుంది. పాత చట్టమే అమల్లో ఉంటుంది. 


వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ ప్రజల్లో అనేక భయాందోళనలకు కారణమవుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. స్థిరాస్తులపై హక్కులను నిర్ణయించే అధికారం అధికారులకు అప్పగించడంపై దుమారం రేగింది. ఈ చట్టంలో ఉన్న సెక్షన్ -28పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రకారం ఏపీ ల్యాండ్ అథార్టీ ఏర్పాటు చేసి దానికి ఛైర్‌పర్సన్‌, కమిషనర్‌, సభ్యులను నియమిస్తూ  జీవో జారీ చేశారు. నీతి ఆయోగ్ సూచన మేరకే చట్టాన్ని రూపొందించామని అప్పటి వైసీపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ నీతి  ఆయోగ్ చెప్పినట్టుగా ఏ అధికారినైనా టీఆర్‌వోగా నియమించవచ్చు అంటే... వైసీపీ ప్రభుత్వం దాన్ని ఏ వ్యక్తినైనా అంటూ మార్చేశారని ఆరోపణలు వచ్చాయి. 


యజమాన్యం విషయంలో ఒకసారి రిజిస్టర్ చేస్తే మూడేళ్ల వరకు ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే ఆ తర్వాత అభ్యంతరం చెప్పినా ప్రయోజనం ఉండదని తేల్చింది. దాన్ని వైసీపీ ప్రభుత్వం రెండేళ్లకు కుదించింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అభ్యంతరాలు ఉంటే హైకోర్టుకు వెళ్లాలని నీతి ఆయోగ్ సూచిస్తోంది. కానీ అలాంటి హక్కును వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో తీసేశారు. కేవలం రివిజన్ చేసుకోవచ్చని మాత్రం చెప్పుకొచ్చారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 
భూహక్కుల్లో తలెత్తే వివాదాల పరిష్కారానికి మూడు అంచెల వ్యవస్థను నీతి ఆయోగ్ రూపొందిస్తే.. దాన్ని రెండింటికే పరిమితం చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇన్ని లోపాలు ఉన్నందున దీన్ని రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా అనేక వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. క్రమంగా ఇది రాజకీయాంశంగా మారి... ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా అయింది. 


ఇంత దుమారానికకి కారణమైనందున దీన్ని రద్దు చేస్తామని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. టీడీపీ, జనసేన ప్రతి సభలో ఈ అంశాన్ని ప్రముఖంగా తీసుకెళ్లారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్థలాలు లాక్కుంటారని ప్రచారం చేశారు. దీనికి భయపడిన జనం వైసీపీని తిరస్కరించారనే విశ్లేషణలు ఉన్నాయి. అందుకే రెండో సంతకం ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం చేయనున్నారు చంద్రబాబు.