PM Modi AP Tour to attend Chandrababus oath taking ceremony: అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మూడోసారి భారతదేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు రానుండటం ఇదే తొలిసారి. జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణం కార్యక్రమానికి ప్రధాని మోదీ విచ్చేయనున్నారు. 


కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ఈవెంట్ 
ఈ నెల 12న విజయవాడ కేసరపల్లి ఐటీ పార్కు వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ మోదీ బుధవారం ఉదయం 8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరనున్నారు. ఉదయం 10.40 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు మోదీ చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి చంద్రబాబు ప్రమాణ స్వీకార ప్రాంగణానికి 11 గంటల వరకు చేరుకుంటారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఏపీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఒడిశాలోని భువనేశ్వర్ పర్యటనకు ప్రధాని మోదీ బయల్దేరి వెళ్లనున్నారని సమాచారం.


మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన చంద్రబాబు, పవన్ 


దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి (జూన్ 9న) ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్డీయే మిత్రపక్షాలతో పాటు ఆహ్వానం అందిన కొన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు, సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎన్డీయే ఇతర మిత్రపక్ష పార్టీల నేతలు మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరై వీక్షించారు. మోదీ ప్రమాణ స్వీకారం కారణంగా చంద్రబాబు ప్రమాణం వాయిదా వేసుకోవడం తెలిసిందే.


10 వేల మంది పోలీసులతో బందోబస్తు
ఏపీ సీఎంగా ఈ 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. దాంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అతిథుల కోసం విజయవాడలోని పెద్ద హోటళ్లలో గదులు బుక్‌ చేశారు. దాదాపు 10 వేల మంది పోలీసులను ఈవెంట్ బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి గన్నవరంలోని వేదిక వరకూ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీజీ బృందం విజయవాడలో స్థానిక పోలీసులతో కలసి భద్రతను సమన్వయం చేసుకుని సెక్యూరిటీ పటిష్టం చేశారు. సీఎస్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీఎం ప్రమాణ స్వీకారం ఏర్పాట్ల పర్యవేక్షణకు అధికారులను ఆదేశించారు.