Kesineni Nani Announces Retirement From Politics| విజయవాడ: ఏపీ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజకీయాలకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయవాడ స్థానం నుంచి పోటీ చేసిన కేశినేని నాని ఓడిపోయారు. టీడీపీ నుంచి బరిలోకి దిగిన సోదరుడు కేశినేని చిన్ని 2 లక్షల 82 వేల 85 ఓట్ల తేడాతో కేశినాని నానిపై ఘన విజయం సాధించారు. 


లోక్‌సభ ఎన్నికల్లో నాని ఓటమి 
టీడీపీ నుంచి రెండు పర్యాయాలు టీడీపీ పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా కేశినాని నాని గెలుపొందారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు అప్పటి అధికార పార్టీ వైసీపీలో చేరారు. సిట్టింగ్ ఎంపీకి వైసీపీ విజయవాడ లోక్‌సభ టికెట్ ఇచ్చింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా కూటమి హవా కొనసాగడంతో కేశినాని నాని ఎన్నికల్లో ఓటమి చెందారు.






సోషల్ మీడియాలో కేనినేని నాని పోస్ట్  
ఎంతగానో ఆలోచించిన తరువాత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు కేశినేని నాని తెలిపారు. పదేళ్ల పాటు విజయవాడ ప్రజలకు సేవలు అందించేందుకు అవకాశం కల్పించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా రెండు పర్యాయాలు సేవ చేయడం అపుపూపమైన గౌరవంగా భావిస్తాను. ప్రజల మద్ధతు, వారి దృఢసంకల్పం ఎంతో స్ఫూర్తినిచ్చాయి. రాజకీయాలకు మాత్రమే దూరంగా ఉంటా. కానీ విజయవాడ ప్రజల పట్ల నిబద్ధతతో ఉంటాను. విజయవాడ అభివృద్ధికి నా మద్దతు కొనసాగుతోంది. పొలిటికల్ జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నో జ్ఞాపకాలు, మరిచిపోలేని అనుభవాలు నాతో ఉన్నాయి. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం కొత్తగా ఎన్నికైన నేతలు పాటుపడాలని, వారికి అభినందనలు’ అంటూ కేశినేని నాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.