Andhra Pradesh Cabinet: కేంద్ర మంత్రివర్గంలోఎవరెవరు ఉంటారనే ఉత్కంఠకు ఇప్పటికే తెరపడింది. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు ఎవరికి ఉంటుంది... జనసేనకు ఎన్ని పదవులు ఇస్తారు... బీజేపీ ఎన్ని తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఈ కేబినెట్ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారని మిత్రపక్షాలతో కూడా మాట్లాడినట్టు చెబుతున్నారు. ఈసారి 164 మంది గెలవడంతో పోటీ మామూలుగా లేదు. అందులో మహిళలు, సీనియర్లు, యువత ఇలా ఎటు చూసినా మంత్రివర్గంపై ఆశలు పెట్టుకున్న వాళ్లే కనిపిస్తున్నారు. అన్నింటినీ బేరీజు వేసుకొని చంద్రబాబు జాబితాను కొలిక్కి తీసుకొచ్చినట్టు చెప్పుకుంటున్నారు. 


మంత్రివర్గంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని టాక్. పది వరకు బీసీలకు పదవులు ఇస్తారని చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు మూడు లేదా నాలుగు, మైనార్టీలకు ఒకటి ఇచ్చే ఛాన్స్ ఉంది. మిగిలిన పదవులను కమ్మ, కాపు, రెడ్డి సహా ఇతర మేజర్ సామాజిక వర్గాలకు కేటాయిస్తారు. మళ్లి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈసారి ఉమ్మడి జిల్లాలలను ప్రాధాన్యతగా తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారని సమాచారం. 


మంత్రివర్గం జాబితాపై ఒక చర్చ నడుస్తుంటే... అసలు జనసేన అధినేత పవన్‌కు ఎలాంటి పదవి ఇస్తారనే చర్చ మరో ఎత్తు. ఆయన చేపట్టే పదవిపై రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆయనకి ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఈమేరకు చర్చలు కూడా పూర్తి అయినట్టు చెబుతున్నారు. ఈసారికి ఆయన ఒక్కడినే ఉపముఖ్యమంత్రిగా ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. అంతకు ముందు చంద్రబాబు హయాంలో కూడా మూడు ప్రాంతాల నుంచి ముగ్గురు ఉప ముఖ్యమంత్రులుగా ఉండే వాళ్లు. ఈసారి మాత్రం పవన్ కల్యాణ్ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక్కడికే ఆ పదవిని కట్టబెట్టాలని నిర్ణయించారు. 


పవన్ ఉప ముఖ్యమంత్రి కేటాయిస్తున్న టీడీపీ అధినేత... మరో మూడు మంత్రిపదవులు ఆ పార్టీకి ఇవ్వబోతున్నారు. ఇప్పుడు పవన్‌తోపాటు ఆ పదవులు చేపట్టేది ఎవరనే చర్చ నడుస్తోంది. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇచ్చేలా ఈ కూర్పు ఉంటుందని ఈ నలుగురు కూడా నాలుగు సమాజిక వర్గాల నుంచి పదవీ బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. పవన్‌తో మొదటి నుంచి ప్రయాణం చేస్తున్న నాదెండ్ల మనోహర్‌కు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఇంకో ఇద్దరు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. 


బీజేపీకి కూడా చంద్రబాబు రెండు మంత్రిపదవులు ఇవ్వబోతున్నారు. కేంద్రంలో రెండు మంత్రిపదవులు తీసుకున్నందును రాష్ట్రంలో కూడా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను మంత్రులుగా చేయనున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. బీజేపీ అధినాయకత్వం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని చెబుతున్నారు. అక్కడి నుంచి ఓకే అన్న తర్వాత ఇక్కడ వాళ్లకు పదవులు ఇవ్వాలా... ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై క్లారిటీ వస్తుందని కూడా చెబుతున్నారు. 


తెలుగుదేశం విషయానికి వస్తే ఈసారి పోటీ చాలా గట్టిగానే ఉంది. ఓవైపు ఆఖరి ఛాన్స్ అన్నట్టు సీనియర్లు మంత్రిపదవుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే... ఉజ్వల రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కచ్చితంగా తమకు స్థానం కల్పించాలని యువ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ఇంకోవైపు మహిళలు కూడా గతం కంటే ఎక్కువ మంది ఎన్నిక కావడంతో వారి నుంచి కూడా ఒత్తిడి ఉంది. వీటిని చూసుకుంటూనే సామాజిక సమీకరణాలు చూసుకొని జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఆ కసరత్తును చంద్రబాబు ఎప్పుడో చేశారని టాక్ నడుస్తోంది 


135 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 20 మందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇందులో లోకేష్‌, నారాయణకు మంత్రిపదవులు ఖాయం అయ్యాయి. అంటే ఇంకా 18 పదవులకు మిగతా వాళ్లు పోటీ పడాల్సి ఉంటుంది. వీరిలో ఎవరికి ఛాన్స్ ఉంటుందనేది ఇంకా స్పష్టత రాలేదు. గత సంప్రదాయాల ప్రకారం చంద్రబాబు మంత్రిపదవులు ఇచ్చే వారితో ముఖాముఖీగా మాట్లాడేవాళ్లు. ఈసారి మాత్రం అలాంటి సమావేశాలు జరగలేదు.