ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన హామీ అమలు దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. సూపర్‌ సిక్స్‌ పేరుతో ఎన్నికల ముందు నుంచే ప్రచారాన్ని ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ వాటి అమలుపై కూడా ఫోకస్ చేసింది. ఇంకా ప్రమాణం చేయక ముందు నుంచే సూపర్ సిక్స్‌ పథకాల అమలు విధివిధానాలను అధ్యయనం చేస్తోంది. వీటిలో ముఖ్యమైన ఉచిత బస్ ప్రయాణంపై కసరత్తు షురూ చేసింది.


మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కర్ణాటక, తెలంగాణలో అమల్లో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు కర్ణాటక, తెలంగాణలో పర్యటించారు. అక్కడ ఈ పథకం అమలు అవుతున్న తీరు... ఇబ్బందులు, ఇతర సమస్యలపై స్టడీ చేశారు. దీనిపై సమగ్ర నివేదికను రెడీ చేశారు. ప్రస్తుతం ఈ విధానం అమలు అవుతున్న రెండు రాష్ట్రాల్లో తెలంగాణ విధానం బాగుందని ఎక్కువ మందికి లబ్ధి జరుగుతుందని అధికారులు తేల్చినట్టు సమాచారం. 


ప్రస్తుతం తెలంగాణలో సిటీ బస్‌లు, పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, మెట్రోఎక్స్‌ప్రెస్‌, ఆర్డినరీల్లో ఈ పథకం అమలు అవుతోంది. ఇలాంటి విధానమే ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తే బాగుంటుందని అధికారులు నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం జిల్లాలకే పరిమితం చేస్తారా లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ప్రయాణించేలా చేస్తారా అనేది మాత్రం ఇంకా నిర్ణయించలేదు. 


బస్ టికెట్ల ద్వారా ప్రభుత్వ ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడనుంది. టికెట్ల ద్వారా ఆర్టీసీకి నెలకు 500 కోట్ల రూపాయలు వసూలు అవుతోంది. ఇప్పుడు ఉచిత ప్రయాణం అమలు చేస్తే మాత్రం 200 కోట్ల వరకు ఆదాయం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తూ వస్తోంది. ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తే మాత్రం ఆనిధులు ఆపేస్తారు. మిగిలిన వాటిని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అదిఎంత అనేది మాత్రం పథకం విధివిధానాలపై ఆధార పడి ఉంటుంది. ఇప్పటికైతే ఆర్టీసీ నెల నెలా ప్రభుత్వానికి 175 కోట్లు రూపాయలు చెల్లిస్తూ వస్తోంది. తెలంగాణలో ఉచిత ప్రయాణానికి టికెట్ కట్ చేస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి విధానం తీసుకొస్తారో అన్న ఆసక్తి నెలకొంది.