AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం (New Govt In AP) ఏర్పడిన నేపథ్యంలో ఈనెల 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) నిర్వహించనున్నారు. మొత్తం నాలుగురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. మొదటిరోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరుగుతుంది. రెండో రోజు స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఉపసంహరణ బిల్లు అసెంబ్లీలో పెట్టి ఆమోదించే  అవకాశం ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి.


జనసేన శాసనసభా పక్షనేతగా పవన్ 
జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్.. జనసేన శాసనసభా పక్ష నాయకుడుగా పవన్ కల్యాణ్ పేరును ప్రతిపాదించారు. సభ్యులందరూ
నాదెండ్ల ప్రతిపాదనను ఏకగ్రీవంగా బలపరిచారు.


కూటమి భారీ విజయం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది. అంచనాలను తలకిందులు చేస్తూ.. తెలుగుదేశం పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పార్టీ 21 స్థానాలు, బీజేపీ 9 స్థానాల్లో గెలిచాయి. ఎన్డీయే కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని తిరుగులేని మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు తోడు, టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు ఎన్నికల్లో ప్రభావం చూపించాయి.


ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద 14 ఎకరాల్లో ప్రమాణ స్వీకార సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కార్యక్రమానికి వచ్చిన వారు ఇబ్బంది పడకుండా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. వర్షాలను సైతం తట్టుకునేలా భారీగా గుడారాలను ఏర్పాటు చేస్తున్నారు.


రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి ప్రతిబింబించేలా కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపారు. సభా వేదిక, ప్రాంగణంలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనాయకులు, జనసేనాని పవన్ కల్యాణ్, 164 మంది కూటమి ఎమ్మెల్యేలు, 21 మంది లోక్ సభ సభ్యులు హాజరుకానున్న నేపథ్యంలో భద్రతాపరమైన లోపాలు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


హామీల అమలుపై కసరత్తు
అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వం హామీల అమలుపై కసరత్తు ప్రారంభంచింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు దాదాపు 30 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీపై మొదటి సంతకం పెడతారనే ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే విద్యాశాఖ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీల వివరాలు తెలుసుకుంటున్నారు. అలాగే ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం రాష్ట్రంలో పింఛన్ లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్ దారుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అంతే కాదు మరో కీలక హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు కసరత్తు చేస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న ఫ్రీ బస్సు పథకాన్ని అధ్యయనం చేసి నివేదిక తయారు చేశారు.