Chandini Chowdary: హీరోయిన్ అవుతానంటే నవ్వారు, కలలు కనడానికి వయసుతో సంబంధం లేదు - చాందిని చౌదరీ

Music Shop Murthy Pre Release Event: తెలుగమ్మాయి చాందిని చౌదరీ నటించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదలకు సిద్ధమవుతున్నాయి. దానిపై తను ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పందించింది.

Continues below advertisement

Chandini Chowdary At Music Shop Murthy Pre Release Event: ప్రస్తుతం తెలుగమ్మాయి చాందిని చౌదరీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం తన చేతిలో రెండు సినిమాలు ఉండగా.. ఆ రెండూ ఒకేసారి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఒక ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో చాందిని చౌదరీ ఒక డీజే ప్లేయర్‌గా కనిపించనుంది. జూన్ 14న విడుదల కానున్న ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ప్రీ రీలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. అందులో మూవీ టీమ్ గురించి చాలామంది మాట్లాడారని, తాను మూవీ గురించి చెప్తానంటూ తన స్పీచ్‌ను ప్రారంభించింది చాందిని. తను హీరోయిన్ అవుదామనుకున్నప్పటి అనుభవాలను గుర్తుచేసుకుంది.

Continues below advertisement

అలాంటి సినిమా..

‘‘మనిషి పుట్టిన తర్వాత ప్రతీ ఒక్కరికీ ఆశలు, ఆశయాలు లాంటివి ఉంటాయి. కొందరు దాని గురించి చిన్నప్పుడే తెలుసుకుంటారు. మరికొందరు పెరుగుతున్న వాతావరణాన్ని చూసి ఇది అవ్వాలి, అది అవ్వాలి అని అనుకుంటారు. కొన్ని కలలు రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. కొన్ని ఊహించడానికే భయంగా ఉంటాయి. మన మీద మనకు కాన్ఫిడెన్స్ లేకపోవడం, భయం, ఎగతాలి చేస్తున్నారు.. ఇలాంటి చాలా ఆలోచనలు ఉంటాయి. ఇదంతా దాటుకొని ముందుకెళ్తే వెనక్కి లాగడానికి చుట్టుపక్కల కొంతమంది ఉంటారు. ఇప్పుడు నీకు ఇదంతా అవసరమా? అని చాలామంది అంటుంటారు. చాలామందికి జీవితంలో కనెక్ట్ అయ్యే పాయింట్ ఇది. అలాంటి ఒక పాయింట్ మీద తీసిన సినిమానే మ్యూజిక్ షాప్ మూర్తి’’ అని చెప్పుకొచ్చింది చాందిని చౌదరీ.

వయసుతో సంబంధం లేదు..

‘‘జీవితం ముందుకెళ్లిన తర్వాత వయసు అయిపోయింది ఇప్పుడు మనం ప్యాషన్ అంటూ వెళ్తే ఏమనుకుంటారో అని ఆలోచిస్తారు. ఈ సినిమాతో మేము ఏం చెప్పాలనుకుంది ఏంటంటే కలలు కనడానికి వయసుతో సంబంధం లేదు. ఒక ఉదాహరణ చెప్తాను తప్పుగా అనుకోవద్దు. నేను 10, 12 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోయిన్ అవుదామని అనుకున్నాను. నాకు చెప్పుకోవడానికి మాత్రమే కాదు వినేవాళ్లకు కూడా వింతగా అనిపించేది. నవ్వినవాళ్లు కూడా ఉన్నారు. నేనే నవ్వుకున్న రోజులు కూడా ఉన్నాయి. నా మీద ఒక కథ రన్ అవ్వాలి, పోస్టర్‌లో నన్ను నేను చూసుకోవాలి, నా మీద సినిమా తీయాలి అనే కోరిక అప్పుడు నాకు ఉంది’’ అని తన ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పడం మొదలుపెట్టింది చాందిని చౌదరీ.

నాకు చాలా పెద్ద విషయం..

‘‘నా కల నిజమవుతుంది అని నేనెప్పుడూ అనుకోలేదు. అయితే బాగుంటుంది అని మాత్రం అనుకున్నాను. కట్ చేస్తే.. 10,12 ఏళ్ల తర్వాత ఒకేరోజు నా రెండు సినిమాలు వస్తున్నాయి. రెండూ చిన్న సినిమాలే కదా దానికే ఈ అమ్మాయి అంత ఫీల్ అవ్వాలా అనుకోవచ్చు. జనాలకు చూపించుకోవడానికి కొన్ని సాధిస్తాం. మనకోసం మనం కొన్ని సాధించుకుంటాం. ఇది నా విషయంలో పెద్దది. అలా ఎవరి దృష్టిలో వారి ఆశయం చాలా పెద్దదే. ఇలా నా జీవితానికి చాలా దగ్గరయ్యే కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నేను భాగమయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చూసి మూర్తి చేశాడు కదా మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని ప్రేక్షకుల్లో ఒకరు అనుకున్నా టీమ్‌గా మేము హ్యాపీ’’ అంటూ ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ తనకు ఎంత స్పెషలో బయటపెట్టింది చాందిని.

Also Read: నటి వరలక్ష్మి పెళ్లి జరిగేది ఈ దేశంలోనే - అక్కడ గ్రాండ్ వెడ్డింగ్‌కి భారీగా ఏర్పాట్లు..

Continues below advertisement