Vishnu Manchu's Kannappa First Day Box Office Collection: 'కన్నప్ప'తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు విష్ణు మంచు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇండియాలోనే మొత్తం రూ.10 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు సమాచారం. విష్ణు తన కెరీర్‌లోనే ఈ మూవీతో రికార్డు ఓపెనింగ్స్ సాధించారని చెబుతున్నారు.
ఇక రెండో రోజు అదే జోరు కొనసాగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీకెండ్ కావడంతో కలెక్షన్లు పెరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు వెర్షన్‌లో 55.89 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేయగా... రాత్రి షోలకు కూడా 69.87 శాతం ఆక్యుపెన్సీతో జోష్ కొనసాగింది. అంచనాలకు అనుగుణంగానే కలెక్షన్లు రాబడుతుండడంతో మూవీ టీం సంతోషం వ్యక్తం చేస్తోంది.
'ఇండస్ట్రీ హిట్'
''కన్నప్ప' ఇండస్ట్రీ హిట్‌గా అవతరించింది' అంటూ మూవీ టీం సోషల్ మీడియా వేదికగా తాజాగా ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. 'సిల్వర్ స్క్రీన్‌ను శాసిస్తోన్న నమ్మకం... తిరుగులేని గాథ. ప్రేక్షకులు దాన్ని ఆశీర్వదించారు.' అంటూ చెప్పగా... వైరల్ అవుతోంది.
చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత విష్ణు మంచు 'కన్నప్ప'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా... 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించారు. విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటించారు. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా లెవల్ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఊహించినట్లుగానే హిట్ టాక్ సొంతం చేసుకుంది.
తిన్నడిగా విష్ణు, రుద్రుడిగా ప్రభాస్, మహాదేవశాస్త్రిగా మోహన్ బాబు, కిరాత పాత్రలో మోహన్ లాల్ అదరగొట్టారు. చిన్నప్పటి నుంచి దేవుడంటే ఇష్టపడని తిన్నడు నాస్తికుడి నుంచి పరమ శివుడి భక్తుడిగా ఎలా మారాడో అనేదే కథాంశంగా 'కన్నప్ప'ను తెరకెక్కించారు.