Police Investigation On Shefali Jariwala Death: 'కాంటా లగా' సాంగ్ ఫేమ్, హీరోయిన్ షఫాలీ జరివాలా శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారన్న వార్త ఇండస్ట్రీతో పాటు ఆమె ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేసింది. ఆమె మృతిపై తాజాగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ముంబై పోలీసులు తాజాగా స్పందించారు. షఫాలీ మృతికి ఇంకా కారణాలు తెలియలేదని చెప్పారు.

పెట్ డాగ్‌తో షఫాలీ భర్త

విచారణలో భాగంగా షఫాలీ అపార్ట్‌మెంట్‌ను ఫోరెన్సిక్ అధికారులు తనిఖీ చేశారు. మరోవైపు... శనివారం ఉదయం ఆమె భర్త పరాగ్ త్యాగీ అపార్ట్‌మెంట్ బయట పెట్ డాగ్‌తో నడుస్తూ కనిపించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటనపై తమకు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. 'అంధేరీలోని నివాసంలో షఫాలీ మృతదేహం పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. ఆమె మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు.' అని చెప్పారు.

గుండెపోటుతోనే మృతి చెందారా?

షఫాలీ జరివాలా గుండెపోటుతోనే మృతి చెందారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ వేటినీ ధ్రువీకరించలేదు. శుక్రవారం రాత్రి షఫాలీ తీవ్ర అస్వస్థతకు గురి కాగా భర్త పరాగ్ త్యాగీ ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. రాత్రి 11:15 గంటలకు ఆస్పత్రికి తీసుకురాగా... అప్పటికే ఆమె చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Also Read: 'మైసా' మూవీపై విజయ్ దేవరకొండ పోస్ట్ - రష్మిక ఎంత క్యూట్‌గా రియాక్ట్ అయ్యారో తెలుసా?

'కాంటా లగా' గర్ల్‌గా...

షఫాలీ మరణ వార్తతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2002లో వచ్చిన 'కాంటా లగా' రీమిక్స్ సాంగ్‌తో షఫాలీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. యూత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఆమె... 'కాంటా లగా'గా పేరొందారు. ఓ సందర్భంలో షఫాలీ... 'ప్రపంచంలో ఒక్కరంటే ఒక్కరే కాంటా లగా గర్ల్ ఉండగలరు. అది నేనే! అది నాకు చాలా ఇష్టం. నేను చనిపోయేంత వరకూ అందరూ నన్ను అలానే పిలవాలి.' అని అన్నారు. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ సాంగ్ తర్వాత షఫాలీ సినిమాల్లో ఛాన్సెస్ దక్కించుకున్నారు. సల్మాన్ ఖాన్ 'ముజ్సే షాదీ కరోగా' మూవీలో నటించారు. ఆ తర్వాత పలు టీవీ షోల్లోనూ మెరిశారు. రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ 13లోనూ పార్టిసిపేట్ చేశారు. తొలుత మ్యుజీషియన్ హర్మీత్ సింగ్‌ను వివాహం చేసుకున్న ఆమె కొంత కాలం తర్వాత డివోర్స్ తీసుకుని 2015లో పరాగ్ త్యాగీని పెళ్లి చేసుకున్నారు. త్యాగీతో కలిసి పలు షోలు చేశారు. సోషల్ మీడియాతోనూ షఫాలీ బాగా పాపులర్ అయ్యారు. ఆమెకు ఇన్ స్టాలో 33 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

యూపీకి చెందిన పరాగ్ త్యాగి... పలు టీవీ షోస్‌తో పాటు సినిమాల్లోనూ నటించి గుర్తింపు సంపాదించుకున్నారు. 2016లో 'బ్రహ్మ రాక్షస్'లో నటించారు. తెలుగులో పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి'లో సెక్యూరిటీ క్యారెక్టర్‌తో పాటు 'వెంకీ మామ', బాలకృష్ణ 'రూలర్', 'సర్కారు వారి పాట' సినిమాల్లో కనిపించారు.