Nag Ashwin: ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరే వినిపిస్తోంది. ఆయన తెరకెక్కించిన ‘కల్కి 2898 - A.D’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆ ఏరియా ఈ ఏరియా అని తేడా లేకుండా అన్నిచోట్లా వసూళ్లు వర్షం కురిపిస్తోంది. రెండో వారంలోనూ భారీ కలెక్షన్లు రాబడుతూ, రూ. 1000 కోట్ల మైలురాయి మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
‘కల్కి 2898 ఏడీ’కి పార్ట్-3 ఉండదు
పురాణాలు, ఇతిహాసాలను భవిష్యత్ ప్రపంచానికి ముడిపెడుతూ నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ' చిత్రాన్ని రూపొందించారు. క్లైమాక్స్ లో పార్ట్ 2పై ఆసక్తిని కలిగిస్తూ, కల్కి యూనివర్స్ కంటిన్యూ అవుతుందని స్పష్టం చేసారు. అయితే ఈ కథంతా రెండో భాగంతోనే ముగుస్తుందని, పార్ట్-3 లేదని దర్శకుడు తెలిపారు. ముందుగా ఈ కథను ఒక్క సినిమాగానే తీయాలనుకున్నాం. కానీ, కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ తర్వాత ఇంత పెద్ద స్టోరీని ఒక్క పార్ట్ గా చెప్పడం కష్టమనిపించింది. అప్పుడే రెండు భాగాలుగా చూపించాలని నిర్ణయించుకున్నాం అని చెప్పారు. పార్ట్-2కి సంబంధించి 20 రోజుల షూటింగ్ మాత్రమే జరిగిందని క్లారిటీ ఇచ్చారు.
కల్కి కథంతా సెకండ్ పార్ట్ లోనే..
మొదటి భాగంలో ప్రభాస్ పాత్ర నిడివి తక్కువ ఉందనే కామెంట్స్ పై స్పందిస్తూ.. నిజానికి ‘కల్కి 2898 ఏడీ’ అనేది చాలా పెద్ద కథ. ఆ ప్రపంచాన్ని, అందులోని పాత్రల్ని జాగ్రత్తగా పరిచయం చేయాలి. ఇప్పుడు పార్ట్-1లో కల్కి వరల్డ్ అందరికీ పరిచయమైపోయింది. కాబట్టి రెండో భాగంలో ఏమి కథ చెప్పినా అర్థమైపోతుంది. ఫస్ట్ పార్ట్ లో 40 శాతం కథ మాత్రమే చెప్పాం. ఇంకా 60 శాతం చూపించాలి. తప్పకుండా రెండో భాగంలో ప్రభాస్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది అని నాగ్ అశ్విన్ తెలిపారు.
'మాయా బజార్' సినిమానే స్ఫూర్తి
తెలుగు సినిమా అనగానే చాలా మందికి 'మాయా బజార్' గుర్తొస్తుంది. అది మహాభారతం స్ఫూర్తితో రూపొందినదే కానీ, దాంట్లో మెయిన్ పాయింట్ కల్పితం. మహాభారతంలో అది ఉండదు. నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మహాభారత కాలాన్ని, భవిష్యత్తు కాలానికి ముడిపెడుతూ ‘కల్కి’ కథ రాసుకున్నాను అని నాగ్ అశ్విన్ వెల్లడించారు. ప్రస్తుతానికైతే మహాభారతాన్ని పూర్తిస్థాయిలో తెరకెక్కించే ఆలోచన లేదని చెప్పారు. విజయ్ దేవరకొండ పోషించిన అర్జునుడు పాత్ర క్యామియో అప్పీరియన్స్ కాదని, కల్కి యూనివర్స్ లో భాగమేనని తెలిపారు. విజయ్ దేవరకొండ, మాళవిక నాయర్ తనకు లక్కీ చార్మ్స్ అనుకోవచ్చని అన్నారు.
ఆ పాత్రతో సినిమా చేసే ఆలోచన లేదు
సుప్రీం యాస్కిన్ రోల్ గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కమల్ హాసన్ తన యాక్టింగ్ తో ఆ పాత్రను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లారన్నారు. నేను సంగం సంగం చెప్పినా దాన్ని ఆయన 100 శాతం చేస్తారు. పార్ట్ 1లో యాస్కిన్ కథను పూర్తిగా చూపించలేదు. పార్ట్ 2లో ఆయన ఫుల్ క్యారక్టర్ ని చూస్తారు అని చెప్పారు. ఇప్పటికైతే యాస్కిన్ పాత్రతో సెపరేట్ గా మరో సినిమా చేయాలన్న ఆలోచనైతే లేదని, కానీ దీంట్లో ప్రతి క్యారక్టర్ తోనూ ఓ సినిమా చేయగలిగేంత బలం ఉందని ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు చెప్పుకొచ్చారు.
Also Read: కల్కిగా కనిపించే హీరో ఎవరు? - డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఏం చెప్పారంటే?