'పదహారు నెలలు ఎన్ని విధాలుగా ముప్పు తిప్పలు పెట్టినా... అన్ని ఎదుర్కొని ఆశయం వైపు అడుగులు వేశాడు. అనుకున్నది సాధించాడు. ఎంతో మందికి ఈ రోజు తను ఆదర్శంగా నిలిచాడు. పట్టుదలతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఎవరో తెలుసుగా?' అని ఓ విద్యార్థిని జ్యోతిక ప్రశ్నించారు. అప్పుడు ఆ చిన్నారి 'జగన్ మావయ్య' అని సమాధానం ఇచ్చారు. ఇది రీల్ లైఫ్ సీన్ కాదు! రియల్ లైఫ్ సీన్!
పైన పేర్కొన్నది తెలుగు సినిమాలో సన్నివేశం కాదు... తమిళ సినిమాలోనిది! ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికలకు ముందు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా మరొక సినిమా రెడీ అయ్యిందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల విషయంలో జగన్ చేసిన అభివుద్ధిని చెప్పేలా ఉందని కొందరు పేర్కొంటున్నారు. అసలు, ఈ సన్నివేశం ఏ సినిమాలోనిది అనే వివరాల్లోకి వెళితే...
తెలుగులోకి 'అమ్మ ఒడి'గా తమిళ రాక్షసి!
జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా 'రాక్షసి' (Raatchasi). ఎస్.వై. గౌతమ్ రాజ్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాష్, ఎస్.ఆర్. ప్రభు ప్రొడ్యూస్ చేశారు. తమిళనాట ఐదేళ్ల క్రితం విడుదల అయ్యింది. ఇప్పుడీ సినిమాను 'అమ్మ ఒడి' పేరుతో తెలుగులో డబ్ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వడ్డి రామానుజం, వల్లెం శేషారెడ్డి భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం సినిమా ట్రైలర్ విడుదల చేశారు. కథ, కథనాలతో పాటు తెలుగు డైలాగ్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసేలా ఉన్నాయి.
Also Read: జగన్ నవ్వారు, అంతే! సీరియస్‌గా తీసుకోలేదు - 'యాత్ర 2' దర్శకుడు మహి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అమ్మ ఒడి' పేరును తమిళ అనువాద సినిమాకు పెట్టడంతో పాటు 'మారుమూల గ్రామాల్లో పాడైపోయిన పాఠశాలలను ప్రభుత్వం పునరుద్దరించాలని అనుకుంటుంది... నాడు నేడుతో', 'ఇది పని చేసే ప్రభుత్వం' అని జ్యోతిక డైలాగులు చెప్పడం చూస్తుంటే... ఇది జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా వస్తున్న సినిమా అని ప్రేక్షకులు సైతం చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు అందరు వెళితే తాము ముష్టి ఎత్తుకోవాలని ప్రయివేట్ పాఠశాలల యజమానులు ఏం చేశారు? అనేది కథగా తెలుస్తోంది. 'నేను ఎవరో తెలుసా? జన దేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిని. మేం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరినీ వదలం' అని విలన్ పాత్రధారి డైలాగ్ చెబుతారు. తెలుగు దేశం పార్టీని జన దేశం చేసినట్టు ఉన్నారు.
ఫైట్స్ చేసిన జ్యోతిక... ఆమె రోల్ ఏమిటంటే?
'అమ్మ ఒడి' సినిమాలో జ్యోతిక టీచర్ రోల్ చేశారు. శారీల్లో హుందాగా కనిపించారు. అంతే కాదు... ఫైట్స్ కూడా చేశారు. 'అమ్మ ఒడి' నిర్మాతలు వడ్డి రామానుజమ్, వల్లెం శేషారెడ్డి మాట్లాడుతూ... "తెలుగులో విడుదలైన ట్రైలర్ మంచి స్పందన అందుకుంది. తమిళంలో విజయవంతమైన ఈ సినిమా తెలుగులోనూ సక్సెస్ సాధిస్తుందని నమ్మకం ఉంది. విద్యా వ్యవస్థలోని లోటు పాట్లను చూపించేలా దర్శకుడు గౌతమ్ రాజ్ అద్భుతమైన సినిమా తీశారు. డబ్బింగ్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం'' అని చెప్పారు. జ్యోతిక 'రాక్షసి' పేరుతో ఆల్రెడీ ఈ సినిమా రెండేళ్ల క్రితం 'జీ 5' ఓటీటీ, జీ తెలుగు టీవీలో విడుదలైంది. ఇప్పుడు కొత్తగా డైలాగులు రాసి థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎలక్షన్ సీజన్ క్యాష్ చేసుకోవడానికి వస్తున్న సినిమాల్లో ఇదొకటి.
Also Read: ఉపాసన తాతయ్య బయోపిక్ రామ్ చరణ్ చేస్తారా? భర్త గురించి ఉపాసన ఏమన్నారంటే?