జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా చింతలూరుకు చెందిన శ్యామ్ నిన్న ఉరేసుకుని కనిపించాడు. అయితే, ఆయన మరణంపై సర్వత్రా అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఆయన మృతిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. “శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన. శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలిచి వేస్తోంది. ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి” చేస్తున్నాను అంటూ ప్రకటన విడుదల చేశారు. తారక్ అభిమాని మరణంపై ఇతర హీరోల అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలని, పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


శ్యామ్ కు న్యాయం జరగాలంటున్న పవన్ లభిమానులు


జూ. ఎన్టీఆర్ వీరాభిమాని  శ్యామ్ మరణంపై అనుమానాలు రేగడంతో తోటి అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆయన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. అంతేకాదు. శ్యామ్ కు న్యాయం చేయాలని క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. #WeWantJusticeForShyamNTR అనే హ్యాష్ ట్యాగ్ తో కామెంట్స్ పెడుతున్నారు. ఆయన మృతికి అసలు కారణం తెలియాలని పవన్ కల్యాణ్ అభిమానులు సైతం కోరుతున్నారు. శ్యామ్ కు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తేల్చి చెప్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం గోదావరి జిల్లాల్లోనే వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్న పవర్ స్టార్, శ్యామ్ మరణంపైనా స్పందించాలని కోరుతున్నారు. అంతేకాదు, టాలీవుడ్‌లోని ఇతర హీరోల అభిమానులు సైతం తారక్ అభిమానుల డిమాండ్‌కు మద్దతు పలుకుతున్నారు. ఎప్పుడూ తమ హీరో గోప్పా.. మీ హీరో జీరో అంటూ కొట్టుకొనే అభిమానులు.. శ్యామ్ ఘటనపై ఒకే స్వరం వినిపిస్తుండటం గమనార్హం.


‘దాస్ కా ధమ్కీ’ వేదికగా గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్


తూర్పుగోదావరి జిల్లా చింతలూరుకు చెందిన శ్యామ్ ఊహ తెలిసినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమానిగా ఉన్నాడు. కొద్ది  నెలల క్రితం విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శ్యామ్ హల్ చల్ చేసి హైలెట్ అయ్యాడు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో తన అభిమాన హీరోను కలుసుకునేందుకు స్టేజి మీదికి దూసుకెళ్లాడు. సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఎన్టీఆర్ వారిని వద్దని వారించారు. శ్యామ్ ను దగ్గరికి పిలిచి ఫోటో దిగి పంపించారు. అప్పటి నుంచి ఎన్టీఆర్ వీరాభిమానిగా శ్యామ్ ఫేమస్ అయ్యాడు.


శ్యామ్ మరణంపై అనేక అనుమానాలు!


తాజాగా శ్యామ్ ఇంటి దగ్గరే ఉరేసుకుని చనిపోయి కనిపించాడు. అయితే, అతడికి ఉరేసుకుని చనిపోయే కష్టాలు ఏమీ లేవని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అతడిది కచ్చితంగా ఆత్మహత్య కాదంటున్నారు. ఎవరో కావాలనే తనను చంపేసి ఆత్మహత్య చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. ఉరేసుకుని చనిపోతే ఆయన శరీరం మీద గాయాలు ఎందుకు ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. చేతుల దగ్గర  కోసిన గుర్తులు ఉన్నాయంటున్నారు. శరీరం మీద కూడా గాయాలు కనిపిస్తున్నట్లు చెప్పారు. శ్యామ్ మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.


శ్యామ్ మృతిపై స్పందించిన చంద్రబాబు


ఇప్పటికే శ్యామ్ మృతిపై టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్ స్పందించారు. ఈ మేరకు ఇద్దరు ట్వీట్లు చేశారు. శ్యామ్ మరణంపై నిస్పక్షపాతంగా విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్యామ్ మరణంలో చాలా అనుమానం కలిగించే అంశాలు ఉన్నాయని, వెంటనే పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులను పట్టుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన వెనుక వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు వ్యక్తుల ప్రమేయం ఉందనే సమాచారం వస్తోందని ఆయన ఆరోపించారు.   


Read Also: సల్మాన్‌ను కచ్చితంగా చంపేస్తాం - ఆ సింగర్ హత్య కేసు నిందితుడు వార్నింగ్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial