ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి హత్యా బెదిరింపులు వచ్చాయి. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గోల్డీ బ్రార్, సల్మాన్ ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ హత్య గురించి కీలక విషయాలు వెల్లడించాడు గోల్డీ బ్రార్. తమ గ్యాంగ్ తప్పకుండా సల్మాన్ ను చంపేస్తుందని తేల్చి చెప్పాడు. "మేము అతడిని(సల్మాన్ ను) చంపుతాం. కచ్చితంగా చంపుతాం. కృష్ణ జింకలు చంపినందుకు భాయ్ సాహెబ్(లారెన్స్ బిష్ణోయ్)కి అతను క్షమాపణ చెప్పాలన్నాం. కానీ, అతడు చెప్పలేదు. బాబాను ఎదిరిస్తే ఏమవుతుందో అతడికి తెలిసేలా చేస్తాం” అని గోల్డీ వార్నింగ్ ఇచ్చాడు. “ ఇది సల్మాన్ ఖాన్ గురించి మాత్రమే హెచ్చరిక కాదు, మేము జీవించి ఉన్నంత వరకు మా శత్రువులందరిపైనా తీవ్ర ప్రతి ఘటన తప్పదు. మా శత్రువుల లిస్టులో సల్మాన్ కూడా ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. మేము కచ్చితంగా అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం” అని తేల్చి చెప్పాడు.
ఇప్పటికే సల్మాన్ ను చంపేస్తామని హెచ్చరించిన లారెన్స్ బిష్ణోయ్
బిష్ణోయ్ కమ్యూనిటీ పవిత్రంగా భావించే కృష్ణ జింకలను వేటాడిన సల్మాన్ ను కచ్చితంగా చంపుతానని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాడు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్. తరుచుగా ఈ విషయంలో సల్మాన్ కు బిష్ణోయ్ బ్యాచ్ నుంచి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ సైతం కీలక విషయాలు వెల్లడించింది. బిష్ణోయ్ టాప్ హిట్ లిస్టులో సల్మాన్ పేరు ఉన్నట్లు వివరించింది.
సిద్ధూ మూసేవాలాను హత్య కేసులో గోల్డీ ప్రధాన నిందితుడు
నటుడు సల్మాన్ ఖాన్ కార్యాలయానికి బెదిరింపు ఇమెయిల్‌లు పంపినందుకు గాను ముంబై పోలీసులు గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ గార్గ్ పై కేసు నమోదు చేశారు. వీరి మీద బాంద్రా పోలీసులు ఐపీసీ 506(2),120(బి), 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ముఠా సభ్యులే ఈ ఏడాది ఏప్రిల్‌లో టిల్లూ తాజ్‌పురియాపై తీహార్ జైలులో దాడి చేసి హత్య చేశారు. గత ఏడాది పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాను కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసింది. ఈ హత్యకు బాధ్యత బిష్ణోయ్ ప్లాన్ వేయగా, ఆయన అనుచరుడు కెనడాకు చెందిన బ్రార్ పర్యవేక్షించారు. తాజ్‌పురియా హత్యకు కూడా బ్రార్ బాధ్యత వహించాడు. కెనడియన్ ప్రభుత్వం రూపొందించిన మోస్ట్ వాంటెడ్ టాప్ 25 నేరస్థులలో గోల్డీ బ్రార్ ఒకడు. అతడి అసలు పేరు సతీందర్ సింగ్ బ్రార్. తరుచుగా బెదిరింపులు రావడంతో సల్మాన్‌కు ముప్పు పొంచి ఉందని భావించిన ముంబై పోలీసులు అతడికి Y+ కేటగిరీ భద్రతను కల్పించారు. అతడి ఇంటి పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
Read Also: వైష్ణవ్ తేజ్ సాహసం - ఆ డిజస్టర్ డైరెక్టర్‌తో మూవీకి గ్రీన్ సిగ్నల్?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial