NTR Fan Syam Case :  జూనియర్‌ ఎన్టీఆర్‌ డైహార్డ్‌ ప్యాన్‌ శ్యామ్‌ అనుమానస్పదంగా మృతిచెందడం తీవ్ర సంచలనంగా మారింది. తన అమ్మమ్మ ఊరు అయిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రుకు  వారం రోజుల క్రితం వచ్చిన శ్యామ్‌  జూన్‌ 25న శనివారం అనుమానస్పదంగా మృతిచెందాడు. చేతి మణికట్టుపై బ్లేడ్‌తో పలుసార్లు కోసుకున్నట్లుగా..    ఉరివేసుకున్న స్థితిలో  మృతదేహం కనిపించింది. ఇప్పటికే పోలీసులు ఈ ఘటనపై అనుమానస్పద కేసుగా నమోదుచేసి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు.  సోషల్ మీడియాలోని ఎన్టీఆర్ అభిమనుల్లో  మంచి గుర్తింపు  ఉన్న శ్యామ్ అనుమానాస్పదంగా చనిపోవడంతో సోషల్ మీడియాలో ఒక్క సారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ యాక్టివ్ అయ్యారు. శ్యామ్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  





అనుమానస్పద రీతిలో మృతిచెందిన శ్యామ్‌ స్వస్థలం ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలోని కొప్పిగుంట. ఇతని కుటుంబం చాలా కాలం నుంచి తిరుపతిలో ఉంటున్నారు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తి చేసిన శ్యామ్‌ కాకినాడలో జాబ్‌ చూసుకుంటానని తన అమ్మమ్మ ఇల్లు అయిన కొత్తపేట మండలంలోని మోడేకుర్రులో వారం రోజులుగా ఉంటున్నాడు. అయితే శనివారం చేతి మణికట్టు వద్ద పలుసార్లు బ్లేడుతో కోసుకుని, అదే బ్లేడును తన జేబులో పెట్టుకుని ఉరి వేసుకుని మృతిచెందినట్లు పోలీసులు చెబుతున్నారు. తిరుపతిలో శ్యామ్‌ ఓ అమ్మాయిని ప్రేమించాడని, ఈ వ్యవహారమే శ్యామ్‌ మృతికి కారణమని మొదట ప్రచారం జరిగింది.  





శ్యామ్‌ మృతి సమాచారం తెలుసుకున్న కుటుంబికులు, బంధువులు, స్నేహితులు కొత్తపేట మండలం మోడేకుర్రుకు తరలివచ్చారు. శ్యామ్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఉరివేసుకుంటే కాళ్లు నేలకు ఎలా తాకి ఉంటాయి..? శరీరం మీద, ముక్కుమీద గాయాలు ఎందుకున్నాయి.? జేబులో గంజాయి ప్యాకెట్‌ ఉంటే ఆమత్తులో ఉరి ఎలా వేసుకుంటాడు.? చేతి మణికట్టును బ్లేడుతో కోసుకుంటే అంత నిలకడగా ఉరి ఎలా వేసుకుంటాడని ప్రశ్నలు సంధిస్తున్నారు.. ఈ ప్రశ్నలతో సోషల్‌మీడియా వేదికగా ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో ఎన్టీఆర్‌ అభిమాని శ్యామ్‌ మృతి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.. 





ఎన్టీఆర్‌ అభిమాని శ్యామ్‌ మృతిపై విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ ట్వీట్‌చేయడంతో ఈ విషయంకు మరింత చర్చకు దారితీసింది. అయితే ఇప్పటికే పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిర్వహించామని, శ్యామ్‌ జూన్‌ 24వ తేదీ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతం నుంచి మరుసటి రోజు 25వ తేదీ ఉదయం 6 గంటల మధ్య మృతిచెంది ఉంటాడని తెలిపారు. చేతి మణికట్టుపై బ్లేడుతో కోసుకుని ఆపై ఉరివేసుకున్నాడని ప్రాధమిక విచారణలో తేలిందని, ఇదే విషయం పోస్ట్‌మార్టం నివేదికలో తేలిందన్నారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, మృతుడు ప్రేమ వ్యవహారంతోపాటు చదువు తగ్గిపోయిందన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ఓ నోట్‌లో వెల్లడించారు.


 





 


ఎన్టీఆర్‌ అభిమాని శ్యామ్‌ మృతిపై అతని స్నేహితులు ఆరోపిస్తున్నట్లు కొందరు వైసీపీ నాయకుల ప్రమేయం ఉందన్నదాంట్లో ఎటువంటి వాస్తవం లేదని, ఇది ఆత్మహత్య అని తేల్చి చెబుతున్నారు. అయితే పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేయాలన్న డిమాండ్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.