జయసుధ... తెలుగు ప్రేక్షకులు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. రెండు మూడు తరాల ప్రేక్షకులకు ఆవిడ తెలుసు. ఈ తరం ప్రేక్షకులకు నటిగా పరిచయం అయితే... కొన్నేళ్ళ క్రితం ప్రేక్షకులకు కథానాయికగా తెలుసు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుతో పాటు ఆ తరం హీరోలు అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు తదితరుల సరసన కథానాయికగా సినిమాలు చేశారు. ఆ తర్వాత తరం హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతో సినిమాలు చేశారు. ఈ తరం హీరోలకు తల్లిగా నటిస్తున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జయసుధ ప్రస్థానం మొదలై యాభై సంవత్సరాలు. ఈ 50 ఏళ్ళలో ఎన్నో సినిమాలు చేసి, అందరి మన్ననలు పొందిన ఆవిడ... లేటెస్టుగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు ఇండస్ట్రీలో వివక్ష ఉందని ఆమె అన్నారు.
ఎవరూ ఫ్లవర్ బొకే కూడా పంపలేదు
Jayasudha Completes 50 Years In Films: ''ఎవరైనా పరిశ్రమలో 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటే... హిందీ సినిమా ఇండస్ట్రీలో అయితే ఫ్లవర్ బొకేలు అయినా పంపిస్తారు. ఇక్కడ ఫ్లవర్ బొకే పంపించిన వాళ్ళు కూడా లేరు'' అని ఇండస్ట్రీలో పరిస్థితి గురించి జయసుధ చెప్పుకొచ్చారు. అదే ఒక హీరో అయితే... పరిస్థితి వేరేలా ఉంటుందన్నట్టు ఆమె వ్యాఖ్యానించారు. చాలా మంది ఇండస్ట్రీలో వాళ్ళను పిలిచి పార్టీ ఇవ్వమని సలహా ఇచ్చారని, తనకు పార్టీ వద్దని అనిపించిందని ఆమె అన్నారు.
వివక్ష ఉంది... ముంబై నుంచి వస్తే కుక్కపిల్లకు రూమ్ ఇస్తున్నారు!
తెలుగు సినిమా పరిశ్రమలో వివక్ష ఉందని తనకు అనిపించినట్లు జయసుధ కాస్త బాధతో చెప్పారు. ''బాగా సక్సెస్ అయిన పెద్ద హీరోలను ఒకలా ట్రీట్ చేయడం... హీరో కంటే హీరోయిన్లను తక్కువగా ట్రీట్ చేయడం వంటివి ఉన్నాయి'' అని ఆమె అన్నారు. టాప్ హీరోయిన్ అయిన తర్వాత కూడా వివక్ష ఉందన్నారు. ముంబై నుంచి వచ్చిన హీరోయిన్లను ఒకలా ట్రీట్ చేస్తున్నారని... కుక్కపిల్లకు కూడా స్టార్ హోటల్ రూమ్ ఇస్తున్నారని జయసుధ ఘాటుగా వ్యాఖ్యానించారు.
హీరో కంటే హీరో పక్కన ఉన్నవాళ్ళ డ్రామా ఎక్కువ ఉంటుందని జయసుధ సూటిగా చెప్పారు. హీరోకు డ్యాన్స్ రాకపోతే హీరోయిన్ దగ్గరకు వచ్చి 'మూమెంట్ కరెక్టుగా చేయలేదేంటి?' అని అడుగుతారని ఆమె నవ్వేశారు.
'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) బిల్డింగ్ కడతామని మురళీమోహన్ గారు అధ్యక్షులుగా పని చేసినప్పటి నుంచి చెబుతున్నారని, మరో 25 ఏళ్ళ తర్వాత అయినా కడతారో? లేదో? అని జయసుధ సందేహం వ్యక్తం చేశారు. 'మా' ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాల గురించి చెప్పాలంటే... తన 50 ఏళ్ళ కెరీర్ అంత ఉంటుందని ఆమె అన్నారు.
Also Read : ఫుడ్ బిజినెస్‌లోకి మహేష్ బాబు - త్వరలో హైదరాబాద్‌లో రెస్టారెంట్
పద్మశ్రీ ఎందుకు రాలేదు?
పద్మ పురస్కారాల ప్రస్తావన కూడా జయసుధ ఇంటర్వ్యూలో వచ్చింది. 'మీకు ఎందుకు పద్మశ్రీ రాలేదు?' అని తనను చాలా మంది అడిగినట్లు జయసుధ తెలిపారు. కంగనా రనౌత్‌కు పద్మశ్రీ ఇచ్చారనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. బహుశా... కంగనా కంటే తాను ఏమి తక్కువ అనేది జయసుధ ఉద్దేశం కాబోలు! జయసుధ పద్మశ్రీ పురస్కారానికి అర్హురాలు అనేది మెజారిటీ ప్రేక్షకుల అభిప్రాయం. వచ్చే ఏడాది అయినా ఆమెకు దక్కాలని ఆశిద్దాం!
Also Read : ఫ్యాట్ టు ఫిట్, 88 నుంచి 75 కేజీల వరకూ - నందమూరి కళ్యాణ్ రామ్ కష్టం అంతా ఇంతా కాదు