'బింబిసార' సినిమాలో, ఆ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేమని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వ్యాఖ్యానించారు. అన్నయ్య గురించి తమ్ముడు ఎక్కువ చెప్పారని అనుకుంటే పొరపాటే అవుతుంది. ప్రతి సినిమాకు కళ్యాణ్ రామ్ ప్రాణం పెట్టి పని చేస్తారు. పాత్రకు  తగ్గట్టు తనను తాను మలుచుకుంటారు. ఖర్చుకు వెనుకాడకుండా సినిమా నిర్మిస్తారు. అయితే, 'బింబిసార' కోసం ఇంకాస్త ఎక్కువ కష్టపడినట్టు తెలుస్తోంది.


'బింబిసార' కోసం నందమూరి కళ్యాణ్ రామ్ బరువు తగ్గారు. రాజు పాత్రలో ఫిట్‌గా కనిపించడం కోసం 13 కేజీలు తగ్గారు. ఆ కష్టం క్లియర్‌గా కనబడుతోంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్లు, పాటలు చూస్తే ఆయన ఫిట్ ఫిజిక్ తెలుస్తోంది. దీని వెనుక ఉన్న కష్టాన్ని కళ్యాణ్ రామ్ ప్రేక్షకులతో పంచుకున్నారు.


88 కేజీల నుంచి 75 కేజీలకు
'ఎంత మంచివాడవురా' సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో తాను 'బింబిసార' కథ విన్నానని కళ్యాణ్ రామ్ తెలిపారు. తనకు తెలియకుండానే 88 కేజీలకు వెళ్ళానని, కొంచెం బొద్దుగా ఉన్నానని ఆయన వివరించారు. 'బింబిసార'లో కొన్నేళ్ళ క్రితం జీవించిన మహారాజు వర్తమానానికి వస్తే ఎలా ఉంటాడనే అంశం తనను ఆకట్టుకుందని, అటువంటి పాత్ర తాను ఇప్పటి వరకు చేయలేదని కళ్యాణ్ రామ్ తెలిపారు. ఆ పాత్ర కోసం 88 కేజీల నుంచి 75 కేజీలకు వచ్చానని ఆయన చెప్పారు.


Also Read : థియేటర్లకు జనాలు రావడం లేదంటే నమ్మను, ఇండస్ట్రీకి ఇది గడ్డు కాలం కాదు - ఎన్టీఆర్

'బింబిసార' లుక్ టెస్ట్... బరువు తగ్గిన తర్వాత
బరువు తగ్గిన తర్వాత, ఫిట్ అయ్యాక 'బింబిసార' లుక్ టెస్టులు చేశామని కళ్యాణ్ రామ్ చెప్పారు. రాజు ధరించే ఖడ్గం నుంచి బొట్టు... దుస్తులు... అన్నీ టెస్ట్ చేశామని ఆయన అన్నారు. ఎం.ఎం. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ఆయువుపట్టుగా నిలిచిందని ఆయన తెలిపారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.



Also Read : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?