ఆస్కార్ వేడుకల్లో నటుడు, కమెడియన్ క్రిస్ రాక్ మీద విల్ స్మిత్ చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. వీక్షకులకు వినోదం పంచే క్రమంలో క్రిస్ రాక్ తన భార్య పేరు తీసుకు రావడాన్ని విల్ స్మిత్ సహించలేకపోయారు. నేరుగా వేదికపైకి వెళ్లి చెంపదెబ్బ కొట్టారు. విల్ స్మిత్ చేసిన పనికి అతడిపై చర్యలు తీసుకుంది ఆస్కార్స్ అకాడమీ బోర్డ్. ఈ స్టార్ హీరో పదేళ్ల పాటు ఆస్కార్ పురస్కార వేడుకలు సహా అకాడమీ నిర్వహించే ఏ కార్యక్రమాలకూ హాజరు కాకూడదని నిషేధం విధించింది. అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు విల్ స్మిత్ పేర్కొన్నారు. 


ఇప్పటికే విల్ స్మిత్ తను చేసిన పనికి సిగ్గుపడుతూ క్రిస్ రాక్ ను క్షమాపణలు కోరారు. సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. అయితే ఈ విషయంలో చాలా మంది విల్ స్మిత్ ను ట్రోల్ చేశారు. అతడి ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోలేక.. క్రిస్ రాక్ ను కొట్టడాన్ని వేలెత్తి చూపించారు. ఈ ఇన్సిడెంట్ విల్ స్మిత్ కెరీర్ పై కూడా ప్రభావం చూపించింది. 


ఇప్పుడు మరోసారి క్రిస్ రాక్ ను క్షమాపణలు కోరారు విల్ స్మిత్. తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేశారు విల్ స్మిత్. ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలను సమాధానాలు చెప్పారు. క్రిస్ రాక్ తో మాట్లాడారా..? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'అతడితో మాట్లాడానికి ప్రయత్నించాను. కానీ క్రిస్ నాతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అతను మాట్లాడాలనుకున్నప్పుడు నేను కచ్చితంగా మాట్లాడతాను. మరోసారి క్రిస్ కి ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతున్నాను' అంటూ చెప్పుకొచ్చారు. 


అలానే తను చేసిన పని కారణంగా ఇంతమంది బాధపడతారని ఊహించలేదని.. ఇప్పుడు జరిగినదాన్ని మార్చలేనని అన్నారు. స్టేజ్ పై అలా ప్రవర్తించడం కరెక్ట్ అని తను అనుకోవడం లేదని.. అగౌరవాన్ని, అవమానాన్ని అలా హ్యాండిల్ చేయకూడదని అన్నారు. క్రిస్ రాక్ తో అలా ప్రవర్తించిన విషయంలో తన భార్య ప్రమేయం లేదని, అది పూర్తిగా తన నిర్ణయమని తెలిపారు. ఈ క్రమంలో తన భార్య, పిల్లలకు కూడా క్షమాపణలు చెప్పారు. తన కారణంగా వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారని ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు విల్ స్మిత్. అలానే క్రిస్ రాక్ తల్లిని, అతడి కుటుంబాన్ని క్షమాపణలు కోరారు.


Also Read : రామారావు ఆన్ డ్యూటీ రివ్యూ: మాస్ మహారాజా రవితేజ సక్సెస్ అందుకున్నారా? లేదా?


Also Read : విక్రాంత్ రోణ రివ్యూ: కిచ్చా సుదీప్ సినిమా ఎలా ఉందంటే?