Loan Recovery Calls : ఇద్దరి మధ్య ఆర్థికపరమైన లేకపోతే ఆస్తుల వివాదాలు వస్తే.. ఎవరో ఒకరు పలుకుబడి ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్లి " అన్నా .. సెటిల్మెంట్ చెయ్" అని అడుగుతారు. సహజంగా ఈ సెటిల్మెంట్లు చేసేది పవర్ ఉన్న రాజకీయ నేతలు. ఇద్దరి మధ్య రాజీ చేస్తారు. ఈ క్రమంలో ఎవరైనా అసంతృప్తి చెందే చాన్స్ లేకుండా భయం కల్పిస్తారు. లీగలా.. ఇల్లీగలా అని పక్కన పెడితే ఇలాంటి సెటిల్మెంట్లు చాలా జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఆ లీడర్లు ఇష్టపూర్వకంగా చేస్తారు. అంత వరకూ మనకు తెలుసు.
లోన్లు ఎగ్గొట్టిన వాళ్లకు రాజకీయ నేతలతో ఫోన్లు చేయించే ప్లాన్ !
కానీ తెలివి మీరిపోయిన లోన్ యాప్‌లు అలాంటి లీడర్లకు తెలియకుండా.. తమకు అప్పులు ఎగ్గొట్టిన వాళ్లతో మాట్లాడించి సెటిల్మెంట్లు చేయించాలనుకుంటున్నారు. ఇక్కడ లీడర్లకు తెలియకుండా ఎలా అనే డౌట్ మనకు వస్తుంది. చివరికి లీడర్లకు కూడా వస్తుంది. ఇక్కడే లోన్ యాప్‌ల అసలు తెలివి తేటలు ఉన్నాయి. నెల్లూరులో జరిగిన ఈ రెండు ఉదంతాలే వారి అతి తెలివికి నిదర్శనాలు.
అప్పు ఎగ్గొట్టిన వాళ్లు మీ పేరు చెప్పారంటూ నేతలకు ఫోన్లు !
ఇటీవల నెల్లూరులో పలువురు రాజకీయ నేతలకు లోన్ యాప్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఫలానా వ్యక్తి మా దగ్గర లోన్ తీసుకున్నాడు. ఆయన మీ నెంబర్ ఇచ్చారు. మీ బామ్మర్ది అని చెప్పాడు.. లేకపోతే ఇద్దరూ కలిసి లోన్ వాడుకున్నారని చెప్పాడని.. ఇలా రకరకాలుగా చెప్పి బెదిరించడం ప్రారంభించారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి.. మాజీ మంత్రి అనిల్‌కు ఇలాగే వచ్చాయి. నిజానికి వారికి లోన్ ఎగ్గొట్టిన వారితో ముఖ పరిచయం కూడా ఆ ఇద్దరు నేతలకు లేదు. ఆ విషయం లోన్ యాప్స్ నిర్వాహకులు కూడా తెలుసు. కానీ ఇక్కడే వారు అసలు ప్లాన్ అమలు చేశారు. సెటిల్మెంట్ ప్లాన్ ఇక్కడే ప్రారంభమయింది.
అప్పు ఎగ్గొట్టిన వాళ్ల నెంబర్ ఇస్తాం ..మాట్లాడండి అని ఆఫర్ !
రాజకీయ నాయకులకు ఫోన్లు చేసి ఫలానా వ్యక్తి మీ పేరు వాడుకుని లోన్ తీసుకున్నారని అడుగుతారు, పదే పదే ఇలా ఫోన్లు వస్తుంటే అసలు ఆ లోన్ తీసుకున్న వ్యక్తి ఎవరా అనే ఎంక్వయిరీ మొదలవుతుంది. వారి ఫోన్ నెంబర్ మేమే ఇస్తాం, మీరే మాట్లాడండి అంటున్నారు రికవరీ ఏజెంట్లు. ఒకవేళ మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ ఆ వ్యక్తికి నేరుగా ఫోన్ చేసి, లోన్ గురించి మాట్లాడితే సగం పని అయినట్టే. మంత్రి, ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నారు కాబట్టి, మేటర్ పెద్దవాళ్ల వరకు వెళ్లింది అనే భయంతో అతను లోన్ కట్టేస్తాడనేది రికవరీ ఏజెంట్ల పన్నాగం. అంటే లీడర్లకు తెలియకుండా వారితోనే సెటిల్మెంట్ చేయిస్తున్నట్లన్నమాట.
లీడర్ వాళ్లకు ఫోన్ చేస్తే భయపడి కట్టేస్తారని లోన్ యాప్స్ పన్నాగం !
అయితే లోన్ యాప్స్ నిర్వాహకులు ఇక్కడ ఓ విషయం మర్చిపోయారు. వారు రాజకీయ నేతలు. అంతకు మించి ఢక్కామొక్కీలు తిన్నవారు. పైగా తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు. ఇలాంటి వేషాల్ని వారు చాలా చూసి ఉంటారు. వారిని తక్కువగా అంచనా వేశారు. ఈ వ్యవహారం తేడాగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కానీ మన రాజకీయ నేతలు మరీ అంత అమాయకులు కాదుగా... లోపలేయించేశారు !
రికవరీ ఏజెంట్ తో ఎమ్మెల్యే అనిల్ మాట్లాడిన ఫోన్ వాయిస్ రికార్డ్ ఎలా బయటకొచ్చింది. రికవరీ ఏజెంట్లే దీన్ని బయటపెట్టి బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారా..? ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నేరుగా ఎమ్మెల్యేలు, మంత్రులను టార్గెట్ చేసుకుని ఫోన్లు చేస్తున్నారు రికవరీ ఏజెంట్లు. వారితో పని జరుపుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం నెల్లూరు వ్యవహారం బయటపడింది. ఇలా బయటపడకుండా మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ ని రాజకీయ నాయకులు ఫేస్ చేశారో లేదో తేలాల్సి ఉంది. నెల్లూరు పోలీసులు ప్రస్తుతం ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.