Janhvi Kapoor About Shikhar Pahariya: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహీ’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె సినిమా ప్రమోషన్ లో బిజీగా గడుపుతోంది. వరుస ఇంటర్వ్యూలతో మూవీపై అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలు చెప్పుకొచ్చింది. అంతేకాదు, ఇంతకాలం శిఖర్ పహారియాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించింది.


ఇద్దరం కలిసే పెరిగాం- జాన్వీ


వాస్తవానికి చాలా కాలంగా మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనువడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నా, ఏనాడు జాన్వీ స్పందించలేదు. కానీ, తొలిసారి అతడి గురించి మాట్లాడింది. “నాకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే శిఖర్ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరం కలిసే పెరిగాం. ఇద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. నా కలలను అతడి కలలుగా ఫీలవుతాడు. అతడి కలలను నా కలలుగా ఫీలవుతాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మాకు మేం సపోర్టుగా ఉంటాం” అని వివరించింది.


జాన్వీ కుటుంబంతో శిఖర్ మంచి సంబంధాలు


శిఖర్ తో ప్రేమ గురించి ఎప్పుడూ బయటకు చెప్పనప్పటికీ, తరచుగా అతడి పేరుతో ఉన్న లాకెట్ ను మెడలో వేసుకుంటుంది. పలుమార్లు ఈ లాకెట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో తన ఫోన్ స్పీడ్ డయల్ లిస్టులో తన తండ్రి, చెల్లితో పాటు శిఖర్ పేరు కూడా ఉంటుందని చెప్పింది. అప్పుడే వీరిద్దరి మధ్య లవ్ ఉందనే వార్తలకు బలం చేకూరింది. అంతేకాదు, పలు పార్టీలలో శిఖర్ తరచుగా జాన్వీ కపూర్ తో పాటు ఆమె తండ్రి బోనీ కపూర్, సోదరుడు అర్జున్ కపూర్ తో కనిపిస్తుంటారు. బోనీ కపూర్ కూడా శిఖర్ గురించి గతంలో ప్రస్తావించారు. శిఖర్ చాలా మంచి వ్యక్తి అని చెప్పిన ఆయన, అతడు తమ కుటుంబంతో స్నేహంగా ఉంటాడని చెప్పారు. ఎప్పటికీ అతడిని తమ కుటుంబ సభ్యుడిగానే చూస్తామని చెప్పారు.   


కాబోయే భర్త ఎలా ఉండాలంటే?


తాజా ఇంటర్వ్యూలో తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెప్పింది జాన్వీ కపూర్. తనకు కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ సంతోషంగా చూసుకునే వాడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. “నా కలలను తను ఇష్టపడాలి. నాకు ధైర్యం చెప్పాలి. నన్ను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించాలి. నేను ఏడ్చినప్పుడు దగ్గరుండి ఓదార్చాలి. అలాంటి వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను” అని చెప్పుకొచ్చింది.


శరణ్‌శర్మ దర్శకత్వంలో క్రికెట్‌ కథాంశంతో ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ సినిమా తెరకెక్కింది. ఇందులో మహేంద్ర పాత్రలో రాజ్‌ కుమార్‌ రావు, మహిమ పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. అపూర్వ మోహతా, కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు తెలుగులో జూ. ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా అక్టోబర్ 10న తొలి భాగం ప్రేక్షకుల ముందుకురానుంది.


Read Also: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?