Best Horror Movies On OTT: దెయ్యాలతో మాట్లాడడానికి ఎన్నో పాతకాలం గేమ్స్ ఉన్నాయని ఎన్నో సినిమాల్లో బయటపెట్టారు మేకర్స్. అవన్నీ నిజమైన గేమ్స్ అయినా కాకపోయినా డెవిల్ గేమ్స్ అనే పేరుతో కొన్ని గేమ్స్ మాత్రం చాలా పాపులర్ అయ్యాయి. అయితే వాటన్నింటికి భిన్నంగా ఆత్మల చేయి పట్టుకొని మాట్లాడగలిగే గేమ్‌ గురించి విన్నారా? అలాంటి ఒక గేమ్ నిజంగా ఉంటుందా లేదా తెలియదు. కానీ దాని ఆధారంగా తెరకెక్కిన సినిమానే ‘టాక్ టు మీ’ (Talk To Me). దెయ్యాలతో మాట్లాడొచ్చు అని సరదాగా మొదలుపెట్టే ఒక ఆట.. ఒక అమ్మాయి ప్రాణం తీస్తుంది. మిగతా ఇంగ్లీష్ హారర్ చిత్రాలతో పోలిస్తే ‘టాక్ టు మీ’ చాలా భిన్నంగా ఉంటుంది.


కథ..


‘టాక్ టు మీ’ సినిమా ఒక పార్టీలో మొదలవుతుంది. అందులో కోల్ (అరీ మ్యాక్‌కార్తీ).. తన తమ్ముడి కోసం వెతుకుతూ ఉంటాడు. చివరికి తన తమ్ముడు సరిగా బట్టలు లేకుండా ఒక రూమ్‌లో ఉంటాడు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న తన తమ్ముడిని తీసుకొని వెళ్తుండగా.. అతడు కోల్‌పై హత్యాయత్నం చేసి తనను తాను కళ్లల్లో పొడుచుకొని చనిపోతాడు. కట్ చేస్తే.. మియా (సోఫీ వైల్డ్) తల్లి ఆత్మహత్య చేసుకొని చనిపోవడంతో తండ్రితో కూడా సరిగా మాట్లాడకుండా.. ఎక్కువగా తన ఫ్రెండ్ జేడ్ (అలెక్సాండ్రా జెన్సెన్) ఇంట్లోనే ఉంటుంది. జేడ్ తమ్ముడు రైలీ (జో బర్డ్)తో కూడా మియాకు మంచి బాండింగ్ ఉంటుంది. అప్పుడే జేడ్.. తన క్లాస్‌మేట్ షేర్ చేసిన ఒక వీడియోను చూస్తుంటుంది. అందులో ఒక అమ్మాయికి దెయ్యం పట్టి ఉంటుంది. అయితే ఒక గేమ్ ఆడడం వల్ల అలా దెయ్యాలు పట్టేలా చేయవచ్చని జేడ్.. మియాతో చెప్తుంది. అలా వాళ్లిద్దరూ వాళ్ల క్లాస్‌మేట్స్ ఆ గేమ్‌ను ఎక్కడ ఆడుతున్నారో తెలుసుకొని అక్కడికి వెళ్తారు.


మియాకు ఆ గేమ్‌ను ఆడాలని చాలా కుతూహలం ఉంటుంది. అందుకే ఈ గేమ్‌ను ఎవరు ఆడతారు అని తన ఫ్రెండ్ హెయిలీ (జో టెరాక్స్) అడగగానే మియా వచ్చి ముందు కూర్చుంటుంది. అప్పుడు హెయిలీ తన ముందు ఒక చేతి బొమ్మను పెడతాడు. ఆపై గేమ్ రూల్స్‌ను చెప్తాడు. ఆ గేమ్ ఆడాలి అనుకునేవారు ఆ చేతికి పట్టుకొని ఉండాలి. దెయ్యం వచ్చిన 90 సెకండ్ల తర్వాత తమ ముందు ఉన్న క్యాండిల్‌ను ఆర్పేయాలి. ఒకవేళ అలా ఆర్పకపోతే దెయ్యాల లోకం నుండి ఇక్కడికి వచ్చిన ఆత్మ.. ఈ లోకంలోనే ఉండిపోతుంది. ఆ రూల్స్ అన్ని విన్న తర్వాత మియా.. ఆ చేతి బొమ్మను పట్టుకుంటుంది. దెయ్యం వచ్చి తనను ఆవహిస్తుంది. కానీ అనూహ్యంగా 90 సెకండ్ల కంటే ఎక్కువగా మియా లోపల దెయ్యం ఉంటుంది. అప్పటివరకు ఈ గేమ్‌ను నమ్మని జేడ్.. అప్పటినుండి నమ్మడం మొదలుపెడుతుంది.


జేడ్‌కు కూడా ఆ గేమ్‌పై ఆసక్తి కలగడంతో ఆ చేయి బొమ్మను పట్టుకొని తన ఇంటికి రమ్మని హెయిలీని ఆహ్వానిస్తుంది. తనతో పాటు కొందరు ఫ్రెండ్స్ కూడా వస్తారు. అదంతా చూసి జైడ్ తమ్ముడు రైలీకి కూడా ఆ గేమ్ ఆడాలనిపిస్తుంది. జేడ్ వద్దన్నా మియా ఎంకరేజ్ చేస్తుంది. అలా గేమ్‌లో కూర్చున్న తర్వాత మియా అమ్మ ఆత్మ రైలీలోకి వచ్చి తనతో మాట్లాడుతుంది. అందరూ ఆశ్చర్యపోయి 90 సెకండ్లలో క్యాండిల్‌ను ఆర్పడం మరిచిపోతారు. దీంతో రైలీ తనను తాను హాని చేసుకోవడం మొదలుపెడతాడు. తనను అందరూ కలిసి హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. 90 సెకండ్లలో క్యాండిల్‌ను ఆర్పకపోవడంతో దెయ్యాల ప్రపంచం నుండి వచ్చిన దెయ్యాలకు మియా, రైలీ టార్గెట్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.



ఎక్కువ రక్తపాతం..


ఓజా బోర్డ్ లాంటి ఎన్నో డెవిల్ గేమ్స్ గురించి ఎన్నో సినిమాల్లో చూశాం. కానీ చేతి బొమ్మతో దెయ్యాల ప్రపంచంలోకి వెళ్లే కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కడంతో ‘టాక్ టు మీ’ .. హారర్ మూవీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో ఒకట్రెండు సీన్స్‌లో దెయ్యాలు కనిపించి భయపెట్టినా.. అంతకంటే ఎక్కువగా జరిగే రక్తపాతమే ఆడియన్స్‌ను మరింతగా భయపెడుతుంది. 2022లో విడుదలయిన ‘టాక్ టు మీ’.. హారర్ మూవీస్ లిస్ట్‌లో టాప్ స్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లీష్‌తో పాటు ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఒక డిఫరెంట్ హారర్ చిత్రం చూడాలి అనుకునేవారు అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ‘టాక్ టు మీ’ను చూసేయండి.


Also Read: కారు డిక్కీలో చెయ్యి.. జుట్టు కోసం అమ్మాయిలను ఎత్తుకుపోయే కిల్లర్ - సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే థ్రిల్లర్ మూవీ ఇది