ఎన్టీఆర్ - జమున... సూపర్ హిట్ జోడీ. అలాగే, ఏయన్నార్ - జమున జోడీ కూడా! తెలుగు చిత్రసీమకు ఎన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అని చెబుతారు. ఆ అగ్ర హీరోలు ఇద్దరూ జమునను తమ సినిమాల్లోకి తీసుకోకుండా మూడేళ్ళ పాటు దూరం పెట్టారు. ఒక విధంగా అనధికారిక బాయ్‌కాట్ చేశారు. అసలు, వాళ్ళ మధ్య గొడవ ఏమిటి? ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసినది ఎవరు? ఆ ముగ్గురి మధ్య రాజీ ప్రయత్నాలు ఎలా జరిగాయి? అనే వివరాల్లోకి వెళితే... 


జమునతో ఒక్కరికే గొడవ?
ఎన్టీఆర్, ఏయన్నార్... ఇద్దరిలో ఒక్కరితోనే జమునకు గొడవ అని, పడలేదని చాలా మంది పరిశ్రమ ప్రముఖులకు తెలిసిన విషయమే. అయితే, ఆ హీరో ఎవరనేది అటు జమున గానీ, ఇటు పరిశ్రమ గానీ బహిరంగంగా ఎప్పుడూ చెప్పింది లేదు. తనతో గొడవ పడిన హీరో మరొక హీరోను తోడు చేసుకుని తనపై మూడేళ్ళ పాటు బ్యాన్ విధించారని జమున ఒకానొక సందర్భంలో వెల్లడించారు. 


'భూ కైలాస్' షూటంగుకు జమున లేటుగా రావడమే అందుకు కారణమని చిత్రసీమలో వినిపించే మాట. సుమారు మూడు గంటలు లేటు రావడమే కాకుండా, ఎండలో వెయిట్ చేస్తున్న తమకు కనీసం క్షమాపణ చెప్పకపోవడంతో ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు టాక్. ఆయన చెప్పడంతో ఏయన్నార్ కూడా ఆమెను దూరం పెట్టారు. ఆ విషయాన్ని తన ఆత్మకథలో అక్కినేని వివరించారు.  


జమునతో నటించేది లేదని చెప్పిన హీరోలు
జమునతో సినిమాలు చేయమని, ఆమెతో నటించేది లేదని అగ్ర హీరోలు ఇద్దరూ పత్రికాముఖంగా వెల్లడించారు. ఆమెను ఎందుకు బాయ్‌కాట్ చేశారని అడిగితే... ఆమె షూటింగుకు లేటుగా వస్తారని, పొగరుబోతు అని, తమ ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటారని కారణాలు చెప్పారు. వాళ్ళ ఆరోపణలు నిజమైతే తనకు అన్ని సినిమాల్లో నటించే అవకాశం ఎందుకు  వస్తుందని జమున ఎదురు ప్రశ్నించారు. అగ్ర హీరోలు చెప్పిన కారణాలు సమంజసం కావని, అసలు కారణాలు ఏమిటన్నది తనకు తెలుసునని, అయితే ఎవ్వరికీ చెప్పనని జమున స్పష్టం చేశారు. 


రాజీ కుదిర్చిన చక్రపాణి, కేవీ రెడ్డి
'గుండమ్మ కథ', 'గులేబకావళి' సినిమాలకు ముందు మూడేళ్ళ పాటు ఎన్టీఆర్, ఏయన్నార్, జమున కలిసి సినిమాలు చేయలేదు. ఇద్దరు అగ్ర హీరోలు తనపై బ్యాన్ విధించడంతో హరినాథ్, జగ్గయ్య తదితరుల సరసన జమున సినిమాలు చేశారు. అప్పట్లో ఆమె దగ్గరకు హీరోయిన్ ఓరియెంటెడ్ కథలు ఎక్కువ వచ్చాయి. ఆ సినిమాలు విజయాలు సాధించడంతో ఆమెపై ఫిమేల్ స్టార్ ముద్ర పడింది. ఆ గొడవ కారణంగా సరైన సినిమాలు రావడం లేదని చక్రపాణి, కేవీ రెడ్డి రాజీ కుదిర్చారు.
 
చక్రపాణి 'గుండమ్మ కథ' రాసి మూడేళ్ళు అయ్యింది. అందులో ఎన్టీఆర్ - సావిత్రిని ఒక జంటగా... ఏయన్నార్ - జమునను మరో జోడీగా అనుకున్నారు. గొడవ విషయం తెలిసి హీరోలను, జమునను పిలిచి రాజీ కుదిర్చారు. తొలుత తనను క్షమాపణ పత్రం రాసి ఇవ్వమంటే నిరాకరించినట్టు జమున ఒక సందర్భంలో తెలిపారు. 


'గుండమ్మ కథ' కోసం కాంప్రమైజ్ చేస్తే... ముందుగా 'గులేబకావళి' మొదలైంది. ఆ సినిమాలో ఎన్టీఆర్, జమున జంటగా నటించారు. ఆ తర్వాత 'గుండమ్మ కథ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఆ ఇద్దరు హీరోలతో జమున నటించారు. 'గుండమ్మ కథ'లో జమునను తీసుకోవడం రామారావుకు ఇష్టం లేనప్పటికీ తాను సరిచెప్పానని ఆత్మకథలో అక్కినేని వివరించారు. 


Also Read : రెండు పార్టులు పవన్ 'అన్‌స్టాపబుల్‌ 2' సందడి - ఫస్ట్ పార్ట్ ఎప్పుడంటే?


ఆ మూడేళ్ళలో జమున పని అయిపోయిందని ఎన్నో వార్తలు వచ్చాయి. హీరోలు బ్యాన్ చేయడంతో రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే... వాటిని తట్టుకుని మరీ జమున నిలబడ్డారు. అప్పట్లో కొత్త హీరోలైన రమణమూర్తి, కైకాల సత్యనారాయణ, కృష్ణం రాజులతో కూడా ఆమె నటించారు. ఆ సమయంలో హిందీ చిత్ర పరిశ్రమకు వెళ్లి సినిమాలు చేసి వచ్చారు.     


Also Read : రాజమౌళి ఫ్యామిలీపై కేంద్రం ప్రత్యేక ప్రేమ చూపిస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏంటంటే?