నందమూరి బాలకృష్ణ ఇటీవల ‘వీర సింహారెడ్డి’ సినిమా సక్సెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. ఆయన ఆ ఫంక్షన్ లో సీనియర్ నటుల గురించి మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. అనుకోకుండా ‘రామారావు, రంగారావు, అక్కినేని.. తొక్కినేని..’ అని టంగ్ స్లిప్ అయ్యారు. అయితే అక్కినేని ఇంటి పేరు గురించి అలా మాట్లాడటంపై అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలంటూ అక్కినేని ఫ్యాన్స్ నిరసనలు కూడా చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందిస్తూ అక్కినేని నాగ చైతన్య, అఖిల్ ట్వీట్స్ కూడా చేశారు. మరోవైపు సీనియర్ నటుడు రంగారావు ను కూడా కించపరిచేలా బాలకృష్ణ మాట్లాడారు అంటూ రంగారావు అభిమానులు మండిపడ్డారు. అయితే తాజాగా బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎస్వీ రంగారావు మనవళ్లు స్పందించారు. 


బాలకృష్ణ రంగారావు ఫ్యామిలీ కు క్షమాపణలు చెప్పాలని చేస్తున్న డిమాండ్లపై రంగారావు మనవళ్లు స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఇటీవల జరిగిన సినిమా సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయని అన్నారు. అయితే ఎస్వీ రంగారావు కుటుంబ సభ్యులుగా, మనవళ్లు గా తామొక విషయాన్ని వెల్లడించాలనుకుంటున్నామని చెప్పారు. తమ కుటుంబానికి ఎన్టీఆర్ కుటుంబంతో గానీ బాలకృష్ణ తో గానీ మంచి సత్సంబంధాలు ఉన్నాయని, తామంతా ఓ కుటుంబంగా భావిస్తామని అన్నారు. బాలకృష్ణ ఇటీవల మాట్లాడిన వ్యాఖ్యలలో తోటి నటులతో జరిగిన సంభాషణల గురించి సాధారణంగా చెప్పారని,  అందులో తమకు ఎలాంటి వివాదం కనిపించలేదని వెల్లడించారు. ఈ విషయాన్ని కొంత మంది కావాలని సాగదీస్తున్నారని అన్నారు. మీడియా కూడా ఈ విషయాన్ని హైలైట్ చేయొద్దని కోరారు. ఇలాంటి వివాదాన్ని తీసుకొచ్చి తమ కుటుంబానికి, నందమూరి ఫ్యామిలీకి నందమూరి వారసులకీ 
ఉండే అనుబంధాన్ని పాడుచేయొద్దని అన్నారు. 


మరోవైపు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ కొన్ని చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. అయితే ఈ విషయం పై బాలకృష్ణ స్పందించారు. సినిమా సక్సెస్ మీట్ లో యాదృచ్చికంగా అన్న మాటలే గానీ అక్కినేని నాగేశ్వరరావును కించపరిచే విధంగా తానేమీ మాట్లాడలేదని అన్నారు బాలయ్య. నాగేశ్వరరావును తాను బాబాయ్ అని పిలుస్తానని అన్నారు. ఏన్టీఆర్, ఏఎన్నార్ నుంచి తాను జీవితంలో చాలా నేర్చుకున్నానన్న ఆయన నాగేశ్వరరావు ఆయన కన్న బిడ్డల కంటే తననే ఎక్కువగా ప్రేమించేవారని చెప్పుకొచ్చారు. ఒక్కోసారి ఫ్లో లో వచ్చిన మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదన్నారు. ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ లు రెండు కళ్లు లాంటి వారని అన్న ఆయన ఎన్టీఆర్ పేరుతో ఇచ్చే అవార్డులను తొలుత నాగేశ్వరరావుకే అందజేశామని గుర్తు చేశారు. ఆయనపై ప్రేమ గుండెల్లో అలాగే ఉంటుందని, బయట జరిగే వాటిని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. మరి తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి.