Union Bank Gold Missing : రైతులు వ్యవసాయ రుణం కోసం బ్యాంకులో తాకట్టుపెట్టిన రూ.1.70 కోట్ల విలువైన బంగారం మాయమైంది. స్థానికంగా ఈ ఘటన సంచలనం అయింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని రెంటపాళ్ళ యూనియన్ బ్యాంకులో బంగారం మాయం కావటం కలకలం రేపుతోంది. రైతులు వ్యవసాయ రుణం కోసం తాకట్టు పెట్టిన మొత్తం 1.70 కోట్ల విలువ గల బంగారం అదృశ్యం కావటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఖాతాదారులు. ఈ ఘటనపై బ్యాంకు ఉన్నతాధికారులు బ్యాంకు మేనేజర్ రాంబాబు నాయక్, అసిస్టెంట్ మేనేజర్ రవి కుమార్ పై సస్పెన్షన్ వేటు వేశారు. కానీ గోల్డ్ అప్రయిజర్ ఇమ్మిడిశెట్టి సంపత్ కుమార్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తనకు  ఈ ఘటనకు ఎటువంటి సంబంధం లేదని, ప్రతీ రోజు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు సిబ్బందికి అప్పజెప్పటం మాత్రమే తన విధని, బంగారం మాయం కావటం వెనుక వాస్తవాలు  ఉన్నతాధికారులు విచారణలో బయటకు వస్తాయని గోల్డ్ అప్రయిజర్ సంపత్ కుమార్ వెల్లడించారు. మూడు నెలలుగా బ్యాంకు అధికారులు ఇలానే చెబుతున్నారని, బంగారం రిలీజ్ చేయడంలేదని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. గోల్డ్ లోన్ చెల్లించినా బంగారం తిరిగి ఇవ్వడంలేదన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 


ఉద్యోగం కోసం అప్లై చేస్తే పోలీసుల నోటీసులు


ఆన్‌లైన్ మోసాలు రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొత్త మార్గాలు వెతుకుతూ ఏదో ఓ రూపంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. జాగ్రత్తగా లేకపోతే ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో, ఎలాంటి నేరాల్లో బాధితులుగా మిగిలిపోతామో రోజూ ఎన్నో ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయినా చాలా మంది సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. వారు అడిగిన వివరాలన్నీ చెప్పేసి లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. కొంత మందిపైనా కేసులు కూడా నమోదవుతున్నాయి. తాజాగా ఓ యువతి లింక్డిన్ పోర్టల్ లో జాబ్ కోసం తన బయోడేటా మొత్తం అప్‌లోడ్ చేసింది. తీరా చూస్తే పోలీసుల నుండి నోటీసులు అందాయి. తను కొంత మందిని మోసం చేసినట్లు అందులో ఉంది. 


అసలేం జరిగిందంటే..


డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నగర యువతి లింక్డ్ ఇన్ లో తన బయోడేటా అప్‌లోడ్ చేసింది. దాన్ని సూచిన సైబర్ నేరగాడు లండన్‌లో పని చేస్తున్న ఎన్నారై డాక్టర్ గా పరిచయం చేసుకుంటూ వాట్సాప్ లో మెసేజ్ చేశాడు. బయోడేటా పరిశీలించాలనని, వైద్య రంగంలో ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. అడ్వాన్స్‌గా జీతం వేస్తానని చెప్పి ఆమె నుండి కెనరా బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకున్నాడు. మాయమాటలు చెప్పి ఆమె చెక్ బుక్, డెబిట్ కార్డును పోస్టు ద్వారా పొందాడు. సాంకేతిక కారణాలు చెప్పి బ్యాంకు ఖాతాకు లింకై ఉన్న ఫోన్ నంబరును తన నంబర్ కు మార్పించుకున్నాడు. దేశవ్యాప్తంగా ఎన్నో సైబర్ ఆర్థిక నేరాలు చేసిన ఆ మోసగాడు వాటికి ఈ యువతి ఖాతానే వాడాడు. ఆమె ఖాతాలో పలువురు బాధితుడు డబ్బులు డిపాజిట్ చేశారు. తన వద్దే ఏటీఎం కార్డు ఉండటంతో ఆ డబ్బులను డ్రా చేసుకున్నాడు. యువతి ఫోన్ నంబర్ ఆ ఖాతాకు లింకై లేకపోవడంతో ఆమెకు ఆ వివరాలు ఏవీ తెలియవు.  తాను భారత్ కు వస్తున్నానని, కొత్తగా ఓ కంపెనీ పెట్టబోతున్నానని ఆ కంపెనీలో డైరెక్టర్ గా నియమిస్తానంటూ మెసేజీలు పంపించాడు. తనతో పాటు డబ్బులు కూడా తీసుకువస్తున్నట్లు ఆ పెట్టే ఫోటోలో పంపించాడు. రెండు రోజుల తర్వాత యువతికి ఢిల్లీ కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ వచ్చింది. భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ తీసుకువస్తుండటంతో ట్యాక్స్ కట్టనిదే వదిలి పెట్టబోమని వారు చెప్పారు. అలా ఆ యువతి నుండి అధికారులు అంటూ చెప్పిన ఆ వ్యక్తులు అందినకాడికి దోచుకున్నారు. అలా ఆ యువతి నుండి రూ.2.36 లక్షలు దోచుకున్నారు. 


అధికారులు నోటీసులతో మోసపోయానని గుర్తింపు


ఇదిలా ఉండగా ఒక రోజు ఆ యువతికి బెంగళూరు పోలీసుల నుండి నోటీసులు వచ్చాయి. ఆమె పేరుతో ఉన్న కెనరా బ్యాంక్ ఖాతాలో రూ.38 లక్షల లావాదేవీలు జరిగాయని, వాటిని డిపాజిట్ చేసిన వాళ్లు సైబర్ నేరాల బాధితులను, దీంతో ఖాతా ఫ్రీజ్ చేశామని అందులో పేర్కొన్నారు. యువతికి సంబంధించిన ఖాతానే కావడంతో ఆమెను కూడా నిందితురాలిగా పరిగణించాలని భావించారు. పోలీసుల నోటీసులు చూసిన యువతికి తాను మోసపోయానని అర్థమైంది. వెంటనే సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.