Minister Botsa On Pawan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రాజకీయాలంటే రెచ్చగొట్టడం కాదని పవన్ కు హితవుపలికారు. పవన్‌ కల్యాణ్‌కు సబ్జెక్ట్‌తో పాటు పార్టీ విధానం కూడా లేదని విమర్శించారు. వచ్చే తరాలకు అసలు పవన్ కల్యాణ్ ఏం మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టం అంటే పవన్ కు తెలియదన్నారు. కేఏ పాల్‌కు పవన్‌ కల్యాణ్‌కు ఏం తేడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. పవన్ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  రాజ్యాంగం విలువలు తెలిస్తే అలాంటి సన్నాసి మాటలు మాట్లాడరని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు ఎంతమేర లబ్ది చేకూరిందో తెలుసుకోవాలని సూచించారు. డీబీటీ ద్వారా పేదలకు ఎన్ని నిధులను అందిస్తున్నామో పవన్ తెలుసుకోవాలని హితవుపలికారు. ఇవేం తెలుసుకోకుండా వాళ్లని కొడతా, వీళ్లని కొడతా అంటే సరిపోతుందా? అని మంత్రి బొత్స ప్రశ్నించారు.  వైసీపీ విధానం వికేంద్రీకరణ అని స్పష్టం చేశారు. మూడు ప్రాంతాలూ అభివృద్ధి జరగాలన్నదే సీఎం జగన్ లక్ష్యం అన్నారు. మూడు రాజధానులు, 26 జిల్లాలే తమ విధానమన్నారు.  ఐదుకోట్ల ప్రజల అభివృద్ధి లక్ష్మమని ఇంతకు ముందే చెప్పామన్నారు. పవన్ లాంటి వ్యక్తులను చూస్తుంటే తనకు రాజకీయాలపై విరక్తి కలుగుతోందని మంత్రి బొత్స అన్నారు.  చంద్రబాబు, పవన్‌లకు ఒక్క అమరావతి అభివృద్ధి చెందితే చాలని, వాళ్లదంతా దోపిడీ విధానం అని విమర్శించారు.  


పవన్ సన్నాసి మాటలు 


పవన్‌ ఉగ్రవాది అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి బొత్స అన్నారు. పవన్‌ కల్యాణ్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని, అలాగే పవన్ కూడా ఎగిరెగిరిపడుతున్నారన్నారు.  గణతంత్ర దినోత్సవం నాడు ఎవరైనా హుందాగా మాట్లాడుతారని, సన్నాసి మాటలు మాట్లాడి మాచేత కూడా మాట్లాడిస్తున్నారని పవన్ పై మంత్రి బొత్స మండిపడ్డారు. సెలబ్రిటీ పార్టీ నాయకుడు పవన్ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 60 వేల కోట్లు జమచేసిందన్నారు. అణగారిన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడితే పవన్ కల్యాణ్ కు ఏం బాధ అన్నారు. వాక్ స్వాతంత్రం ఉందని ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. పవన్ ఈ భాష ద్వారా వచ్చే తరాలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని మంత్రి బొత్స ప్రశ్నించారు. 


ఉగాది నుంచి విశాఖలో పాలన 


 వైసీపీ ప్రభుత్వ విధానం వికేంద్రీకరణ అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తన విధానంపై ఇంతకు ముందే స్పష్టంగా చెప్పామన్నారు.  మళ్లీ చెబుతున్నామన్నారు. పవన్ కల్యాణ్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పెద్ద బండి కొనుక్కుని ఉంటారని వారాహిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పవన్ లాంటి వాళ్లను చూస్తుంటే రాజకీయాలు అంటే విరక్తి వస్తోందని మంత్రి బొత్స అన్నారు.  చంద్రబాబు, పవన్ కల్యాణ్ లది దోపిడీ విధానమని, వైసీపీది అభివృద్ధి విధానం అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ఉగాది నుంచి విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని సీఎం జగన్ పై ఒత్తిడి చేస్తున్నామన్నారు. కేబినెట్ మంత్రులు అడిగితే ముఖ్యమంత్రి కుదరదు అనరుగా అన్నారు. ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.