Balakrishna On Akkinenni :   అక్కినేని నాగేశ్వరరావును కించపరుస్తూ తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు.  హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన  అక్కినేని.., తొక్కినేని అంటూ వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావు తనపై తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమ చూపేవారన్నారు. తాను బాబాయ్ అని పిలుచుకునేవాడిని.. ఆయనపై ప్రేమ తనకు గుండెల్లో ఉంటుందన్నారు. పొగడ్తలకు పొంగి పోకూడనదే విషయాన్ని తాను అక్కినేని నాగేశ్వరరావు నుంచే నేర్చుకున్నానన్నరు. ఎన్టీఆర్‌ను ఎన్టీవోడు అంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో యాసలో పిలుస్తూంటారు..అదంతా ఆయనపై చూపే అభిమానమేనని గుర్తు చేశారు. ఏదో ఫ్లో లో వచ్చిన మాటలను వక్రీకరించుకుని వ్యతిరేక ప్రచారం చేస్తే తనకేం సంబంధం అని ప్రశ్నించారు. సినీ ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు లాంటి వారని.. స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు పెడితే మొదట .. అక్కినేని నాగేశ్వరరావుకే అవార్డు ఇచ్చామని గుర్తు చేశారు. 


వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవంలో వ్యాఖ్యలతో వివాదం


వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవంలో బాలకృష్ణ మాట్లాడుతున్నప్పుడు రచయితతో షాట్ గ్యాప్‌లో ఏం మాట్లాడుకునేవారమో వివరించారు. ఈ సందర్భంగా అక్కినేని... తొక్కినేని అనే మాటలు వాడారు. అయితే అక్కినేని తర్వాత ప్రాసలో తొక్కినేని అని పదం రావడంతో.. ఈ అంశం వివాదాస్పదమయింది. అలాగే ఆ రంగారావు అనే మాట కూడా వాడారు. దీంతో సోషల్ మీడియాలో బాలకృష్ణపై కొంత మంది విమర్శలు ప్రారంభించారు. అందులో రాజకీయం చొరబడటంతో వివాదం పెద్దదయిపోయింది. ఇదే సమయంలో  నాగ చైతన్య, అఖిల్ కూడా.. ఏఎన్నార్ లైవ్స్ ఆన్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. కించపర్చడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కడా బాలకృష్ణ పేరు పెట్టకపోయినా ఆ వివాదం ఉద్దేశించే అని స్పష్టం కావడంతో మరితం దుమారం రేగింది. 


ఎస్వీ రంగారావును కించపర్చలేదని స్పష్టం చేసిన కుటుంబసభ్యులు


మరో వైపు కాపు నాడు పేరుతో ఓ సంఘం కూడా... ఎస్వీ రంగారావును బాలకృష్ణ అవమానించారని ఆరోపణలు చేశారు. ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు. అదే సమయంలో సాక్షి రంగారావు గారి సామాజికవర్గం వారు ఏమీ డిమాండ్ చేయరా అన్న కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి. చివరికి ఎస్వీ రంగారావు కుటుంబీకులు వీడియో విడుదల చేశారు.  ఎస్వీరంగారావును బాలకృష్ణ కించపర్చలేదని.. ఈ విషయాన్ని వివాదం చేయవద్దని వీడియో విడుదల చేశారు. అసలు  బాలకృష్ణ ఏమీ అనకపోయినా అన్నట్లుగా  ప్రచారం చేయడం కరెక్ట్ కాదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఎస్వీఆర్ విషయంలో వివాదం సద్దుమణిగింది. 


బాలకృష్ణ వివరణపై అక్కినేని ఫ్యాన్స్  ఎలా స్పందిస్తారో ?


అక్కినేని ఫ్యాన్స్ మాత్రం బాలకృష్ణపై విమర్శలు చేస్తున్నారు. కూకట్ పల్లి అర్జున్ ధియేటర్ వద్ద ధర్నా కూడా చేశారు. ఈ క్రమంలో బాలకృష్ణ ఎలా స్పందిస్తారన్న ఆసక్తి ప్రజల్లో ఏర్పడింది. అయితే చివరికి వివాదాన్ని బాలకృష్ణ తేలికగానే తీసుకున్నారు. ఫ్లో అన్నమాటలేనని ... దీన్ని వివాదం చేసుకుంటే.. తనకేం సంబంధం లేదని తేల్చారు. ఇప్పుడు అక్కినేని అభిమానులు ఎలా స్పందిస్తారో మరి..!