Hyderabad Traffic: హైదరాబాద్‌లోని రాజ్ భవన్ లో 74వ గణతంత్ర దినోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. రిపబ్లిక్ డేతోపాటు పలు కార్యక్రమాల నేపథ్యంలో సోమాజిగూడ నుంచి వీవీ స్టాచ్యూ ఖైరతాబాద్ వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందని పోలీసులు వెల్లడించారు. రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలతోపాటు ఎట్ హోమ్ కార్యక్రమం ఉన్నందున మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రాజ్ భవన్ రోడ్డును రెండు వైపులా మూసి వేయనున్నట్లు తెలిపారు. ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలు చేరుకొని, పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్ బాబు కోరారు.
రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం
తెలంగాణ రాజ్ భవన్‌లో గణతంత్ర వేడుకలు ఉదయం ఏడు గంటలకే ప్రారంభం అయ్యాయి. త్రివర్ణ పతాకాన్ని గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. డీజీపీ అంజనీ కుమార్, సీఎస్ శాంతి కుమారి ఈ వేడుకలకు హాజరయ్యారు. రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలకు ప్రభుత్వం నుంచి మంత్రులు, ఇతరులు ఎవరూ హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
జాతీయ పతాకం ఆవిష్కరణ తర్వాత తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు అంటూ తెలుగులో గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రసంగం చివర్లో కూడా గవర్నర్ తెలుగులో మాట్లాడుతూ ముగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తీరుపట్ల పరోక్షంగా అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదామని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ హక్కును నిలబెట్టుకుందామని అన్నారు.
కొంత మందికి నేను నచ్చకపోవచ్చు - తమిళిసై
‘‘కొత్త భవనాల నిర్మాణం అభివృద్ధి కాదు - నేషనల్ బిల్డింగ్ అభివృద్ధి. ఫామ్ హౌస్‌లు కట్టడం అభివృద్ధి కాదు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు- రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ ఫెసిలిటి ఉండాలి. తెలంగాణ గౌరవాన్ని నిలపెడుతాం - రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. తెలంగాణతో నాకున్న బంధం మూడేళ్లు కాదు.. పుట్టుకతో ఉంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతిలో నా పాత్ర తప్పకుండా ఉంటుంది. నా పెద్ద బలం.. హార్డ్ వర్క్, నిజాయతీ, ప్రేమ. కొంత మందికి నేను నచ్చకపోవచ్చు. కానీ, నాకు తెలంగాణ ప్రజలంటే ఇష్టం. అందుకే ఎంత కష్టమైనా పని చేస్తాను.’’ అని గవర్నర్ తమిళిసై మాట్లాడారు.