కోలీవుడ్ అగ్ర హీరో కార్తీ గత సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. కార్తీక్ నటించిన 'పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1', 'విరుమన్', 'సర్దార్' వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఈ ఏడాది విడుదలైన 'పొన్ని యన్ సెల్వన్ పార్ట్ 2' కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో కార్తీ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జపాన్'. రాజమురుగన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తమిళం తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతుంది. ఈ సినిమాలో కార్తీ సరసన అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది.  కార్తీ నటిస్తున్న జపాన్ సినిమా  తమిళనాడులోని వరుస దొంగతనాలకు పాల్పడిన తిరువారూర్ మురుగన్ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందట.


తమిళనాడులోని తిరుచ్చి అనే ప్రాంతంలో లలిత జ్యువెలరీ దుకాణంలో తిరువారూర్ మురుగన్ అనే వ్యక్తి సుమారు 13 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వజ్రాలను దోచుకున్నాడు. 2019వ సంవత్సరంలో జరిగిన ఈ రాబరీ దేశవ్యాప్తంగానే పెను సంచలనాన్ని సృష్టించింది. ఈ ఒక్క దోపిడినే కాకుండా దక్షిణాదికి చెందిన కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లోనూ ఇతను దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులకు ఇతను కర్ణాటకలో ఒకసారి మాత్రమే పట్టు పడ్డాడు. ఇక ఈ మురుగన్ ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీసులు 50 సార్లకు పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినా కూడా అతని పట్టుకోలేకపోయారు. చెన్నైలోనే తిరుచ్చిలో నగల దుకాణంలో దోపిడీ అయిన తర్వాతే తిరువారూర్ మురుగన్ గురించి అందరికీ తెలిసింది. ఇప్పటివరకు మురుగన్ తన సహచరులతో కలిసి సుమారు 100 కోట్లకు పైగా కొల్లగొట్టినట్టు చెబుతున్నారు. ఇక 2020లో మురుగన్ జైల్లో ఎయిడ్స్ వ్యాధితో మరణించాడు.


ఇక ఈ నిజమైన దొంగోడి కథ ఆధారంగానే జపాన్ సినిమాను తీస్తున్నారని ప్రస్తుతం కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. అయితే కార్తీ ఈ కథలో కొన్ని మార్పులు సూచించాడట. మురుగన్ ఎందుకు దొంగగా మారాల్సి వచ్చింది? ఎంతో ప్రతిష్టాత్మకమైన బంగారు దుకాణాల్లో అతను బంగారం ఎలా దోచుకున్నాడు? అనే కొన్ని కమర్షియల్ ఎలివెంట్స్ ని సైతం జపాన్ మూవీలో యాడ్ చేస్తున్నారట. అలాగే క్లైమాక్స్ విషయంలోనూ చిత్ర యూనిట్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే కొందరేమో మురుగన్ నిజజీవితంలో జరిగిన సంఘటనలతోటే క్లైమాక్స్ ప్లాన్ చేయనని సూచిస్తుంటే, మరికొందరేమో ఈ కథను సుఖాంతంతో ముగించాలని చెబుతున్నారట. మరి మూవీ టీం జపాన్ మూవీ క్లైమాక్స్ ని ఏ విధంగా ప్లాన్ చేస్తారో చూడాలి. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: కార్తి బ్లాక్ బస్టర్ ‘ఆవారా’ సీక్వెల్ రాబోతోంది - హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా?