కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ  ప్రధాన పాత్రలో, డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్, ఎంటర్ టైనర్ ‘పయ్యా’. తెలుగులో ఈ సినిమా ‘ఆవారా’గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2010 లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. తమిళంతో పాటు తెలుగులోనూ చక్కటి విజయాన్ని దక్కించుకుంది.


13 ఏళ్ల తర్వాత ‘ఆవారా’ సీక్వెల్ పై కదలిక


ఈ సినిమా విడుదలై సుమారు 13 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో దర్శకుడు లింగుస్వామి కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ గురించి ప్రస్తావించారు. ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. అయితే, ఈ సినిమాలో హీరో ఎవరు అనేదాని మీద చర్చ జరుగుతోంది. చాలా సీక్వెల్స్ లో మొదటి భాగంలోని నటీనటులనే ఎక్కువగా తీసుకుంటారు. కొన్నిసార్లు కొత్త వాళ్లను తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.


‘ఆవారా’ సీక్వెల్ హీరో, హీరోయిన్లు ఎవరు?


‘ఆవారా’ సీక్వెల్ కు సంబంధించి ముందుగా దర్శకుడు ఆర్యకు కథ చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత ‘సూర్య’కు కూడా చెప్పారట. వీరిద్దరు నో చెప్పడంతో మళ్లీ కార్తినే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ‘ఆవారా’ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటించింది. అయితే, సీక్వెల్ లో మాత్రం  హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడట లింగుస్వామి. ఇప్పటికే, పూజాహెగ్డే తమిళంలో రెండు సినిమాలు చేయగా, అనుకున్న స్థాయిలో ఈ సినిమాలు సక్సెస్ కాలేదు.  ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఉన్న ఈ ముద్దుగుమ్మకలిసి రాని తమిళంలో సినిమా చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ నిర్మించనున్నట్లు సమాచారం. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


‘ఆవారా 2’ తొలి సినిమాకు కొనసాగింపా? లేక..


‘ఆవారా 2’ తొలి సినిమాకు కొనసాగింపుగా ఉంటుందా? లేదంటే పూర్తిగా కొత్త కథతో రూపొందుతోందా? అనే అంశం మీద కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ చిత్రం మొదటి భాగంలో సోనియా దీప్తి, జగన్, మిలింద్ సోమన్, దర్శన్ జరీవాలా, జాస్పర్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. దీనిని లింగుస్వామికి చెందిన నిర్మాణ సంస్థ తిరుపతి బ్రదర్స్ బ్యానర్ మీద నిర్మించారు.   


సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న లింగుస్వామి


వాస్తవానికి లింగుస్వామి ‘రన్’, ‘సండైకోజి’, ‘పయ్యా’ సినిమాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి.  ఈ చిత్ర నిర్మాత ఒకప్పుడు యాక్షన్ ఎంటర్‌టైనర్‌లలో మాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, ఆ తర్వాత చాలా ఫ్లాపులు ఎదురు చూశారు. తన ఇమేజ్ ను పూర్తిగా కోల్పోయారు.  ఇటీవల, తెలుగులో రామ్ పోతినేని హీరోగా ‘వారియర్‌’ సినిమా చేశారు. ఈ చిత్రంతోనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా బాక్సాఫీస్దగ్గర పరాజయం పాలైంది. ఇప్పుడు ‘ఆవారా’ విడుదలై 13 ఏళ్ల తర్వాత  లింగుస్వామి భారీ బడ్జెట్‌తో రెండో భాగాన్ని రూపొందించబోతున్నారు.   


Read Also: భారీ బడ్జెట్‌తో ‘శక్తిమాన్’ నిర్మాణం - ‘స్పైడర్ మ్యాన్’ నిర్మాణ సంస్థ చేతికి ఇండియన్ మూవీ: ముఖేష్ ఖన్నా