టాలీవుడ్ ఇండస్ట్రీకి మంగళవారం ఉదయం ఝలక్ తగిలింది. అగ్ర నిర్మాత 'దిల్' రాజు సంస్థ కార్యాలయాలతో పాటు ఆయన ఇళ్లలో ఆదాయపు పన్ను ఐటీ శాఖ రైడ్ చేస్తుందనే వార్త అందరికీ షాక్ ఇచ్చింది. ఆ తర్వాత మ్యాంగో మీడియాతో పాటు ఫైనాన్షియర్ సత్య రంగయ్య సంస్థ కార్యాలయంలో కూడా ఐటీ రైడ్ జరిగింది. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కార్యాలయాలతో పాటు దర్శకుడు సుకుమార్ ఇంటి మీద రైడ్ జరిగింది. సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నట్టుండి ఆదాయపు పన్ను శాఖ పడడానికి అసలు కారణం ఏమిటి? రెండు రోజులైనా ఎండ్ కార్డ్ ఎందుకు పడలేదు?
వేల కోట్ల వసూళ్లు, వందల కోట్ల రెమ్యూనరేషన్... అసలు లెక్క తీయండి!
'దిల్' రాజును టార్గెట్ చేస్తూ ఆదాయపు పన్ను శాఖ రైడ్ జరిగినట్లు తొలుత ప్రచారం జరిగింది. 'గేమ్ చేంజర్' నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఆయనకు... సినిమా విడుదల తర్వాత భారీ వసూళ్లు ఏమీ రాలేదని, ఆయన మీద రైడ్ చేయడం వల్ల ఐటీ శాఖకు ఏం వస్తుందని సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పడ్డాయి. ఆ సంగతి పక్కన పెడితే... అసలు టార్గెట్ 'దిల్' రాజు కాదని ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న గుసగుస. పైగా, ఆయనకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది.
పాన్ ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ సాధించామని, తమ సినిమా వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని సగర్వంగా ప్రకటించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థను, ఆ చిత్ర దర్శక నిర్మాతలను టార్గెట్ చేస్తూ ఐటీ శాఖ రైడ్ చేసినట్లు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఆఫ్ ది రికార్డుగా కొన్ని కామెంట్లు చాలా బలంగా వినబడుతున్నాయి.
కలెక్షన్స్ లెక్కల పరంగా 'బాహుబలి 2' రికార్డులను తమ సినిమా బీట్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించిన 'పుష్ప 2' కలెక్షన్స్ పోస్టర్లు చెబుతున్నాయి. ప్రభాస్, రాజమౌళి సినిమా ఊసు తీయనప్పటికీ... వీళ్లు అనౌన్స్ చేసిన నెంబర్లు ఆ సినిమా ఓవరాల్ కలెక్షన్స్ కంటే ఎక్కువ. అది ఒక్కటే కాదు... ఆ సినిమాకు గాను హీరో అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రూపాయలను పారితోషికం కింద అందుకున్నట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది.
'పుష్ప 2' సినిమాకు వచ్చిన వసూళ్ల లెక్కల వివరాలను ఐటీ శాఖ అడిగినట్లు తెలుస్తోంది. అలాగే, ఎవరికి ఎన్ని కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చారనే విషయంలోనూ కూపీలు లాగుతూ ఉందని వినబడుతోంది. 'పుష్ప 2: ది రూల్' చిత్ర నిర్మాణంలో దర్శకుడు సుకుమార్ స్థాపించిన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామి. అందుకని ఆయన్ను డైరెక్టుగా ఎయిర్ పోర్ట్ నుంచి ఐటీ శాఖ తమ అదుపులోకి తీసుకొని తీసుకువెళ్లారు.
Also Read: కుంటుకుంటూ... వీల్ ఛైర్‌లో హైదరాబాద్ నుంచి ముంబైకు రష్మిక - అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లిందో తెలుసా?
ఇప్పుడు అసలు వసూళ్లు ఎన్ని? కొసరు ఎంత? ఎంత కలిపారు? ఎవరికి ఎన్ని కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చారు? అనే విషయాలు బయటకు చెప్పకపోయినా సరే ఐటీ శాఖ దగ్గరకు వెళ్తాయి. మైత్రీతో పాటు పనిలో పనిగా సంక్రాంతి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన 'దిల్' రాజు సంస్థ మీద కూడా రైడ్ చేసింది ఐటీ శాఖ
సంక్రాంతికి విడుదలైన 'గేమ్ చేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలను నైజాం, విశాఖ వంటి ప్రాంతాల్లో 'దిల్' రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. 'గేమ్ చేంజర్' నిర్మాత కూడా ఆయనే. ఆయా సినిమాలకు సంబంధించిన వసూళ్ల ప్రకటనల నేపథ్యంలో 'దిల్' రాజు సంస్థ మీద రైడ్ జరిగినట్టు ఖబర్. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్న మ్యాంగో మీడియా ఫైనాన్షియర్ సత్య రంగయ్య తదితరుల మీద రైడ్స్ చేశారు. ఇకపై టాలీవుడ్ ఫేక్ పబ్లిసిటీ ఆపకపోతే తిప్పలు తప్పవేమో!?