టాలీవుడ్‌ దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్‌ఆర్‌’ (RRR) సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు అనడంలో సందేహం లేదు. ‘బాహుబలి’ సినిమాతో తన స్థాయిని.. తెలుగు సినిమా స్థాయిని చాటి చెప్పిన రాజమౌళి ఈసారి అంతకు మించి అన్నట్లుగా RRRతో ఏకంగా హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ సరసన నిలిచారు. ‘‘‘‘నాటు నాటు’’’’ పాట ఆస్కార్ అవార్డు కు నామినేట్‌ అవ్వడంతో రాజమౌళి పేరు హాలీవుడ్‌ లో మారు మ్రోగుతోంది. అవతార్ ఫిల్మ్ మేకర్ తో పాటు ఎంతో మంది హాలీవుడ్ స్టార్స్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి మాట్లాడేలా చేసిన జక్కన్న ముందు ముందు హాలీవుడ్‌ లో చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

‘‘నాటు నాటు’’ పాట ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంటే రాజమౌళి కచ్చితంగా భవిష్యత్తులో హాలీవుడ్‌ ప్రాజెక్ట్ లు చేయడం ఖాయం. ఇప్పటికే రాజమౌళిని ఎంతో మంది హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ సంప్రదిస్తున్నారట.. అంతేకాకుండా హాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా రాజమౌళితో కలిసి సినిమాలు చేసేందుకు గాను ఆసక్తి కనబర్చుతున్నాయట. రాజమౌళి ప్రస్తుతానికి ఏ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌కి ఇంకా ఓకే చెప్పలేదు. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమాకు రాజమౌళి సిద్ధం అవుతున్నాడు. మహేష్ బాబు తో రాజమౌళి తీయబోతున్న సినిమా నిర్మాణ భాగస్వామిగా హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 

 

‘‘నాటు నాటు’’ పాట ఆస్కార్ కు ఒక్క అడుగు దూరంలో ఉన్న కారణంగా అందరి దృష్టి రాజమౌళి వైపు ఉంది. రాజమౌళి టీమ్ గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు అందుకున్న సమయంలో పలువురు హాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్ తో కలిశారు. ఆ సమయంలోనే హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ లపై ఆసక్తి కనబర్చారు. ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా మరెందరో హాలీవుడ్‌ సెలబ్రెటీలను కూడా రాజమౌళి టీం కలవబోతున్నారు. ఆ సందర్భంగా మరింతగా హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌ ల గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ దక్కితే రాజమౌళి తెలుగు లో సినిమాను రూపొందించినా కూడా హాలీవుడ్‌ రేంజ్ లో విడుదల చేసే అవకాశాలు ఉంటాయి. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ తో ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా అంతర్జాతీయ మార్కెట్‌ సొంతం చేసుకోనున్నాయి.

ఆస్కార్‌ కి ఒక్క అడుగు దూరంలో ‘‘నాటు నాటు’’


‘‘నాటు నాటు’’ పాట ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును సొంతం చేసుకుంది. ఆస్కార్‌ నామినేషన్స్‌ లో చోటు దక్కించుకున్న ‘‘నాటు నాటు’’ ఖచ్చితంగా అవార్డును సొంతం చేసుకోవడం ఖాయం అన్నట్లుగా అభిమానులు నమ్మకంగా ఉన్నారు. కీరవాణి సంగీతం అందించిన ‘‘నాటు నాటు’’ పాటను ఉక్రెయిన్ లో రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ లపై రాజమౌళి రూపొందించాడు. ఈ పాటకు ప్రేమ్‌ రక్షిత్ మాస్టర్‌ కొరియోగ్రఫీని అందించాడు. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్ కేటగిరీలో ఈ పాట ఆస్కార్‌ ను ఇండియాకు తీసుకు రావడం ఖాయం అని పలువురు హాలీవుడ్‌ ప్రముఖులు కూడా అంటున్నారు. మార్చి 12వ తేదీన ఈ మెగా ఈవెంట్‌ అమెరికాలో జరగబోతుంది. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని లైవ్‌ లో చూడబోతున్నారు.