Hrithik Roshan about Anil Kapoor: బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘ఫైటర్’ మూవీ హాట్ టాపిక్‌గా మారింది. జనవరి 26న విడుదల కానున్న ఈ సినిమా కోసం బీ టౌన్ ప్రేక్షకులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించాడు. హృతిక్ రోషన్, దీపికా పదుకొనె హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఒక ముఖ్య పాత్రలో కనిపించారు. తాజాగా ‘ఫైటర్’ షూటింగ్ సమయంలో హృతిక్ రోషన్ ఇచ్చిన ఒక కాంప్లిమెంట్.. తనను ఎమోషనల్ చేసిందని గుర్తుచేసుకున్నారు అనిల్ కపూర్. ప్రస్తుతం మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తున్న సమయంలో ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.


కాంప్లిమెంట్‌కు కన్నీళ్లు..


‘ఫైటర్’ ప్రమోషన్స్ సమయంలో ముందుగా అనిల్ కపూర్‌ను ప్రశంసలతో ముంచేశాడు హృతిక్ రోషన్. ‘‘నాన్న నటించిన చాలా సినిమాలకు నేను అసిస్టెంట్‌గా పనిచేశాను. అదే సమయంలో అనిల్ కపూర్‌ను చూశాను. నేను మోడల్ నుంచి యాక్టర్‌గా మారుతున్న సమయంలో యాక్టర్ అంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను. దాదాపు 3,4 ఏళ్లు అదే చేశాను’’ అంటూ అనిల్ కపూర్‌పై ఇష్టాన్ని బయటపెట్టాడు హృతిక్. ‘‘మామూలుగా ఎవరికైనా సీన్ బాగా చేశారని కాంప్లిమెంట్ ఇస్తే.. వాళ్లు మామూలుగా థాంక్యూ, నాకు చాలా సంతోషంగా ఉంది లాంటి రియాక్షన్స్ ఇస్తారు. కానీ జీవితం మొత్తం దానికే అంకితం చేసినప్పుడు ఆటగాళ్లకు ఒలింపిక్స్, వింబుల్‌డన్‌లాంటి గేమ్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచినప్పుడు కాంప్లిమెంట్ అందితే వాళ్లు చాలా మైమరచిపోతారు. కళ్లలో నీళ్లు తిరుగుతాయి’’ అని పోలికను చెప్పాడు హృతిక్.


మళ్లీ అసిస్టెంట్ అయిపోయాను..


‘ఫైటర్’లో అనిల్ కపూర్‌కు, తనకు మధ్య ఉండే ఒక ముఖ్యమైన సీన్‌ను గుర్తుచేసుకున్నాడు హృతిక్. ‘‘పేపర్‌పై ఉన్న సీన్ చాలా బాగుంది. అందులో చాలా కోపం దాగుంది. ఆ సీన్ గురించి మీరు చెప్పింది, చేసింది.. దానిని ఎక్కడి నుండో ఎక్కడికో తీసుకెళ్లింది. దానిని పూర్తిగా ఎమోషనల్‌గా మార్చేశారు. అది మీకు చెప్పినప్పుడు మీ కళ్లలో నీళ్లు తిరిగాయి. నేను మిమ్మల్ని అలా చూస్తూ ఉండిపోయాను. ఈ వ్యక్తి ప్రతీ సీన్‌కు ప్రాణం పోస్తారు. ఒక్క కాంప్లిమెంట్ వినగానే కళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. అది కూడా ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాల పాటు ఉన్న తర్వాత కూడా. ఆరోజు నేను మళ్లీ ఒక అసిస్టెంట్‌లాగా మారి ఆయనను చూస్తున్నట్టు అనిపించింది’’ అంటూ అనిల్ కపూర్‌తో సీన్ చేసిన అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు హృతిక్. మీడియా ముందు ఇదంతా వివరిస్తున్న సమయంలో కూడా మరోసారి అనిల్ కపూర్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి.


మీలాగా ఉండాలని ఆశపడతారు..


హృతిక్ మాటలతో దీపికా పదుకొనె కూడా సమ్మతించింది. ‘‘మా జనరేషన్‌లోని ప్రతీ యాక్టర్ మీలాగా ఉండాలని ఆశపడతారు’’ అంటూ అనిల్ కపూర్‌ను ఉద్దేశించి ప్రశంసించింది. ‘ఫైటర్’లో రాకీ అనే పాత్రలో కనిపించనున్నారు అనిల్ కపూర్. వీరితో పాటు అక్షయ్ ఒబ్రాయ్, కరణ్ సింగ్ గ్రోవర్ కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే విడుదలయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. సిద్ధార్థ్ ఆనంద్ టేకింగ్ మీద నమ్మకం ఉన్న ఫ్యాన్స్ మాత్రం ‘ఫైటర్’ కచ్చితంగా హిట్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Also Read: సినిమాటిక్ యూనివర్స్ ఆలోచన అలా వచ్చింది, బడ్జెట్ లేక తప్పులు జరిగాయి - ప్రశాంత్ వర్మ